1952లో నియోజకవర్గ ఆవిర్భావం నుంచి గెలిచిన పార్టీలు : 1952లో స్వతంత్ర అభ్యర్థి, 1957లో ప్రజా సోషలిస్టు పార్టీ, 1962, 1967, 1972, 1978లో వరుసగా కాంగ్రెస్, 1983 నుంచి 1999 వరకు తెలుగుదేశం పార్టీ, 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ గెలిచాయి.
భీమిలి.. దేశంలోనే అతి పురాతనమైన రెండో మున్సిపాలిటీ. సాగర తీరంతో, ప్రకృతి సౌందర్యాలతో అలరారే అందమైన లోగిలి. అయితే.. ఇదంతా ఐదేళ్లకు ముందు మాట. ఇప్పుడు రాష్ట్రంలోనే రూ.వేల కోట్ల భూకుంభకోణాలకు, అక్రమాలకు లోగిలిగా మారిపోయింది. టీడీపీ నేతల అరాచకాలకు, దందాలకు నెలవైంది. డీ పట్టాలు, పోరంబోకు, ఈనాం, భూదాన భూములు.. ఇలా వేటినీ వదలకుండా భీమిలిని చెరపట్టేశారు. అడ్డగోలుగా.. అధికారం అండతో ఖాళీగా కనిపించిన భూమినల్లా కబ్జా చేసేశారు. ఒకరి బ్యాంకు ఖాతా నుంచి మరొకరి బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ అయినంత సులువుగా భూరికార్డులు మారిపోయాయి. రైతు తన భూమిలో సాగు చేస్తుండగానే.. అక్కడ తహశీల్దార్ కార్యాలయ రికార్డుల్లో ఆ భూమి వేరొకరికి ధారాదత్తమైపోయింది. సొంతదారు భూమిలో ఉండగానే మరొకరు వచ్చి ఇది నాది అని దబాయించే దారుణ పరిస్థితులు ఐదేళ్లుగా ఇక్కడ రాజ్యమేలాయి. అందుకే ఇప్పుడు భీమిలి పేరు చెబితే టీడీపీ నేతలు సృష్టించిన భూదందాల విలయమే గుర్తుకు వస్తుంది. అలాంటి భీమిలిలో తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో ఓటరు ఎటువైపు మొగ్గుచూపనున్నాడో ఓసారి పరిశీలిద్దాం.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం (విశాఖపట్నం లోక్‌సభ పరిధి) పరిధిలోని మండలాలు:
భీమిలి అర్బన్ (జీవీఎంసీ), రూరల్ మండలం, ఆనందపురం మండలం, పద్మనాభం మండలం, విశాఖ రూరల్ మండలం (జీవీఎంసీ మధురవాడ జోన్ 4, 5 వార్డులు పూర్తిగా 6, 72 వార్డులు పాక్షికంగా).
జనాభా సుమారు 4 లక్షలు. 2017 ఓటర్ల జాబితా ప్రకారం..
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,64,520. ఇందులో అత్యధికంగా కాపులు 48,290 మంది, యాదవులు 47,500, మత్స్యకారులు 17,300 మంది, ఎస్సీలు 16,900 మంది, రెడ్లు 19,300 మంది ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ నుంచి అవంతి
2009లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచిన ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు ఆ తర్వాత పీఆర్పీ విలీనంతో కాంగ్రెస్‌లోకి, అటు నుంచి టీడీపీలోకి వెళ్లి 2014లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు భీమిలి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అవంతి విద్యాసంస్థల చైర్మన్‌గా సుపరిచితులైన అవంతికి వివాదరహితుడిగా పేరుంది. భీమిలి నియోజకవర్గాన్ని పట్టి పీడించిన గంటా గ్యాంగ్ అరాచకాలు, అక్రమాలు, పాలకులపై విసిగివేసారిపోయిన స్థానిక ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ గత సెప్టెంబర్‌లో జరిగిన పాదయాత్రలో కనీవినీ ఎరుగని విధంగా పోటెత్తారు. వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకే తాను భీమిలి వచ్చానంటూ అవంతి ప్రజలతో మమేకమై పర్యటిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బలానికి తోడు అవంతి రాకతో నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందనే చెప్పాలి.
టీడీపీ.. గంటా శ్రీనివాసరావు లేదా నారా లోకేష్
భీమిలి నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఐదేళ్లలో సీఎం చంద్రబాబు, లోకేష్‌లకు ధీటుగా అప్రతిష్టను మూటకట్టుకున్నారు. విశాఖ జిల్లాకే చెందిన మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా మంత్రి గంటా భూదందాలు, అక్రమాలపై బహిరంగంగా ఆరోపణలు చేసి పెను సంచలనం సృష్టించారు. ఈ ఐదేళ్లలో భీమిలిలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకపోగా, భూదందాలతోపాటు బంధువులు, అనుచరుల అరాచకాలు, ఇద్దరు తహశీల్దార్ల సస్పెన్షన్‌తో గంటా ఇమేజ్ మసకబారిపోయింది. దీంతో గంటాను భీమిలి నుంచి తప్పించాలని కొన్నాళ్లుగా చంద్రబాబు భావిస్తూ వస్తున్నారు. ఆర్నెల్ల కిందట ఇదే ప్రతిపాదన తీసుకురాగా గంటా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో అప్పటికి తాత్కాలికంగా ఊరుకున్నారు. అయితే ఇప్పుడు భీమిలి నుంచి నారా లోకేష్‌ను బరిలోకి దించాలన్న ప్రతిపాదనను పెట్టి గంటాకు వేరే చోటు వెతుక్కునే పనిపెట్టారు.
నారా లోకేష్ గెలవగలరా?
భీమిలిలో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2009లో ప్రజారాజ్యం విజయం సాధించగా, 2014లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఈసారి నారా లోకేష్ పోటీ చేసినా గెలిచే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతోపాటు భీమిలిలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో లోకేశ్ ఓటమి తప్పదని అంటున్నారు. ఇక సామాజికవర్గ సమీకరణల నేపథ్యంలో కూడా లోకేశ్‌కు భీమిలి సరైన స్థానం కాదనే వాదన స్వయంగా టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. గంటాను తప్పించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బంధువు, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారామ్‌ను రంగంలోకి దించాలన్న యోచన కూడా బాబు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఎమ్మెల్యేగా హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన కుంభకోణాలతో ప్రజల్లో బాగా పలుచనైన కర్రి అభ్యర్థి అయినా టీడీపీది కోలుకోలేని పరిస్థితే.
ప్రధాన సమస్యలు
- చిట్టివలస జ్యూట్‌మిల్లు లాకౌట్ సమస్య: 2009, ఏప్రిల్ నుంచి లాకౌట్‌లో ఉన్నప్పటికీ నేటికీ పరిష్కారం కాలేదు. ఇప్పటికీ కార్మికులకు రావలసిన పీఎఫ్, గ్రాట్యుటీ తదితర రూ.150 కోట్లు బకాయిలను యాజమాన్యం ఇవ్వలేదు.
- తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం: 30 ఏళ్లుగా ఇక్కడ నిర్మిస్తామన్న ఆర్టీసీ కాంప్లెక్స్ సాకారం కాలేదు. 2016, జూన్‌లో మంత్రి గంటా భూమిపూజ చేశారు. కానీ ఫలితం శూన్యం.
- తగరపువలసలో రైతు బజారు: 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాసరావు రైతుబజారు నిర్మిస్తామని హామీనిచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పువ్వులు విరివిగా సాగవుతున్నా రైతుబజారు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- ఆనందపురం, తగరపువలసలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు.
- ఆనందపురం మండలంలో జగ్గమ్మగెడ్డ రిజర్వాయర్ సమస్య అలాగే ఉంది. ఇది పూర్తయితే గానీ మండలంలోని తాగు, సాగునీటి అవసరాలు తీరవు.
- పద్మనాభం మండలంలో అల్లూరి జన్మించిన పాండ్రంగి గ్రామ పంచాయితీ గోస్తనీ నదికి వరదలు వస్తే మునిగిపోతుంది. ఇక్కడ నదిపై వంతెన నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
- జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తగరపువలసలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ సమస్య అలాగే ఉంది.
- భీమిలిని శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ కలగానే మిగిలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment