సాక్షి, అమరావతి: ఆపరేషన్ గరుడ పేరుతో సినీనటుడు శివాజీ పాత్రధారిగా ఆడిస్తున్న కుట్రపూరిత నాటకం సూత్రధారి చంద్రబాబేనని ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమయ్యింది. విశాఖపట్నం విమానాశ్రయంలోని లాంజ్‌లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు వాటికి మరింతగా బలం చేకూరుస్తున్నాయి. సినీ నటుడు శివాజీ చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే ఆపరేషన్ గరుడ అమలు చేస్తున్నారని అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రులు చేస్తోన్న ప్రకటనలపై అధికార వర్గాలే విస్తుపోతున్నాయి. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చేసిన కుట్రపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ కుట్రకు కర్త.. కర్మ.. క్రియ తానే అవడం వల్లే సీఎం చంద్రబాబు విచారణ మాటెత్తడం లేదని సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారమే ఆశగా.. శ్వాసగా.. పరమావధిగా రాజకీయ వ్యవహారాలు నడిపే సీఎం చంద్రబాబు.. నాలుగున్నరేళ్లుగా తాను చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ‘ఆపరేషన్ గరుడ’కు పురుడు పోశారు. తన అడుగులకు మడుగులొత్తే సినీ నటుడు శివాజీ ద్వారా ఈ రాజకీయ నాటకాన్ని ఏడు నెలల క్రితం విజయవాడ వేదికగా ఎల్లో మీడియా ముందు ప్రదర్శింపజేసి, విస్తృత ప్రచారం కల్పించేలా చక్రం తిప్పారు. ప్రభుత్వాన్ని అస్తిర పరిచేందుకు ఐటీ, సీబీఐలతో దాడులు చేయిస్తారని, ముఖ్య రాజకీయ పార్టీ నేతపై ప్రాణాపాయం లేని దాడి చేస్తారని.. అనంతరం రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తారని చంద్రబాబు మస్తిష్కం నుంచి జాలువారిన అత్యద్భుత రాజకీయ దృశ్య కావ్యాన్ని మార్చి 22న సినీ నటుడు శివాజీ ఆవిష్కరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా సరే సీఎం చంద్రబాబు, మంత్రులు మీడియా ముందుకు వచ్చి ఇదంతా ఆపరేషన్ గరుడలో భాగమేనేని ప్రకటించడం.. ఈ అంశాన్ని తాను ముందే చెప్పానంటూ సినీ నటుడు శివాజీ చెప్పడం రివాజుగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీ బీద మస్తాన్‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన పోతుల రామారావుల సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు ఇదే రకమైన రీతిలో వ్యవహరించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు కూడా ఈ రాజకీయ నాటకాన్ని మరింతగా రక్తి కట్టించారు.
పరాకాష్టకు చేరిన రాజకీయ క్రీడ
విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్‌లో గురువారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కడతేర్చే ఘాతుకానికి బరితెగించడంతో ఈ క్రీడ మరింత పరాకాష్టకు చేరుకుంది. టీడీపీ నాయకుడికి చెందిన రెస్టారెంట్‌లో వ్యూహాత్మకంగా శ్రీనివాసరావు అనే యువకుడి ద్వారా వైఎస్ జగన్ మెడపై కత్తితో దాడి చేయించి, అంత మొందించడానికి పక్కాగా స్కెచ్ వేశారు. ప్రొఫెషనల్ కిల్లర్‌ను తలదన్నే రీతిలో అత్యంత పదునైన కత్తితో దాడి చేస్తున్న యువకుడి నుంచి వైఎస్ జగన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. ఈ ఘటన అనంతరం సీఎం చంద్రబాబు.. ఒక్కో మంత్రిని మీడియా ముందుకు పంపుతూ.. రాజకీయ క్రీడను పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచి.. రాష్ట్రపతి పాలన విధించేందుకే ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం చేయించారని ప్రకటనలు చేస్తూ వచ్చారు. మంత్రులు మీడియా ముందుకు వచ్చిన సమయంలో కలెక్టర్ల సదస్సులో ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంత్రుల వంతు పూర్తయ్యాక సీఎం చంద్రబాబు రాత్రి 9.10 గంటలకు మీడియా ముందుకు వచ్చి సినీ నటుడు శివాజీ చెప్పినట్లుగా ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ఆపరేషన్ గరుడలో భాగంగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారని ప్రకటించడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి.
విచారణకు జంకు ఎందుకు?
ఏడు నెలల క్రితమే ఆపరేషన్ గరుడ గురించి సినీ నటుడు శివాజీ బయటపెట్టారని సీఎం చంద్రబాబు, మంత్రులు పదేపదే చెబుతున్నారు. అది వాస్తవమని సీఎం చంద్రబాబు, మంత్రులు విశ్వసించినప్పుడు ప్రభుత్వాన్ని అస్థిపరిచే కుట్రపై విచారణకు ఎందుకు ఇప్పటి వరకు ఆదేశించలేదని ఐపీఎస్ అధికారులే ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేతపై ప్రాణహానిలేని రీతిలో దాడులు చేసేందుకు గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీలు నిర్వహించారని.. ఈ దాడిని రాయలసీమలో ఒక ముఖ్య నేత కుటుంబంపై వేస్తారని, ఒడిశా, బీహార్‌లకు చెందిన వారితో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తారని ఏడు నెలల క్రితమే సినీ నటుడు శివాజీ చెప్పారని సీఎం చంద్రబాబు గురువారం మరోసారి వల్లె వేశారు. గుంటూరు, హైదరాబాద్‌లో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించారని ముందే తెలిసినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు విచారణకు ఆదేశించలేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు. అంటే ప్రతిపక్ష నేతకు ఏ ప్రమాదం జరిగినా ఫర్వాలేదనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దలకు ఉందా? అనే సందేహాన్ని ఆ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఈ కుట్రను నిఘా విభాగం ఎందుకు గుర్తించలేదని, ఈ వైఫల్యానికి బాధ్యత ఎవరు వహించాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అసహనం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశిస్తే ఆపరేషన్ గరుడ తన అద్భుత సృష్టేనన్నది బయటపడుతుందనే నెపంతోనే సీఎం చంద్రబాబు రాజకీయ నాటకాన్ని రక్తి కట్టించడం ద్వారా ప్రజల దృష్టి ఏమార్చాలనే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం ఐఏఎస్, ఐపీఎస్ అధికార వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment