ఏప్రిల్–మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి పాలకపక్షమైన కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. గత కొన్ని మాసాలుగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న వ్యూహాలు ఈ దిశగానే సాగుతున్నాయి. కాని, 1985 నుంచీ ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ ఎన్నికల్లోనూ పాలకపక్షం ఓడిపోయింది. ఈ ఆనవాయితీ కొనసాగుతుందనే ఆశతో కాషాయపక్షం గెలుపుపై ధీమాతో పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల తరచు కర్ణాటక పర్యటిస్తున్నారు. కిందటేడాది జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత కర్ణాటక అసెంబ్లీ సమరానికి రెండు జాతీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల ఈశాన్యంలో ప్రధానంగా త్రిపురలో తొలిసారి ఘనవిజయం సాధించిన బీజేపీ దూకుడుకు యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కళ్లెం వేసింది. మళ్లీ ఈ ఏడాది ఆఖరులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఎప్పటిలా పాలకపక్షాన్ని ఓడించడం అంత తేలిక కాదని, సీఎం సిద్దరామయ్య ఎత్తుగడలు తమ పార్టీని గట్టెక్కిస్తాయన్న కాంగ్రెస్ అంచనాల ఫలితంగా బీజేపీ అసెంబ్లీ పోరులో విజయానికి పకడ్బందీగా సమాయత్తమౌతోంది.
ఎటూ తేల్చని ఎన్నికల సర్వేలు!
ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన మూడు సంస్థల ఎన్నికల సర్వేల ఫలితాల్లో ఏదీ కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పలేదు. కాంగ్రెస్‌కు కాషాయపక్షం కంటే స్వల్ప సంఖ్యలో ఎక్కువ సీట్లొస్తాయని తెలిపాయి. ఫిబ్రవరి రెండున ఫలితాలు ప్రకటించిన క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ అనే సంస్థ ఒక్కటే మొత్తం 224 సీట్లలో బీజేపీకి 113, కాంగ్రెస్‌కు 85, జేడీఎస్‌కు 25 స్థానాలు రావచ్చని జోస్యం చెప్పింది. అదీగాక, కర్ణాటకలో బీజేపీకి సాధారణ మెజారిటీ (113 సీట్లు) వస్తే వచ్చే డిసెంబర్‌లో జరిగే మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిపించే అవకాశాలున్నాయనే అంచనాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కర్ణాటకతో పాటు పంజాబ్, మిజోరంలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మే ఎన్నికల్లో గెలుపు అత్యవసరం. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి 110 సీట్లు కైవసం చేసుకుని ఇండిపెండెంట్ల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. సాధారణ మెజారిటీ సాధనకు బీజేపీ ఈసారి మొత్తం 56 వేల పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించడానికి ఏడు లక్షల మంది కార్యకర్తలను నియమించింది. ఈ ఐదేళ్లలో కాషాయపక్షం సభ్యులుగా కొత్తగా 75 లక్షల మంది చేరారు. ఆరున్నర కోట్ల జనాభా ఉన్న కర్ణాటకలో 80 లక్షల మంది రైతులే ఎన్నికల్లో జయాపజయాలు ఈసారి నిర్ణయిస్తారని భావిస్తున్నారు. అందుకే బీజేపీ తాను అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తామని హామీ ఇస్తోంది.
లింగాయత్‌లపై కాంగ్రెస్ వల
సిద్దరామయ్య సర్కారు ఈ నాలుగేళ్లలో ఉచిత బియ్యం పథకంతోపాటు స్కూళ్లలో ఉచితంగా పాలు, గుడ్లు సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇంకా వర్షాధార ప్రాంతాల్లో రైతులకు నేరుగా నిధులు సమకూర్చుతోంది. సహకార బ్యాంకులు రుణాల మాఫీ చేశాయి. తక్కువ ధరకు భోజనం, ఆహారపదార్థాల సరఫరాకు ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు బీజేపీకి గట్టి మద్దతుదారులైన లింగాయతుల్లో చీలిక తెచ్చే లక్ష్యంతో వీరశైవ–లింగాయతుల ధర్మా న్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్కారు సిఫార్సును కేంద్రం సానుకూలంగా ఆమోదిస్తేనే కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుంది. వివాదాస్పదమైన ఈ నిర్ణయం బీజేపీకి కూడా ఇబ్బందికరంగానే మారింది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తే లింగాయతులు అధికసంఖ్యలో నివసించే ఈశాన్య కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీకి విజయావకాశాలు తగ్గుతాయి. ప్రస్తుతం పాత మైసూరు ప్రాంతంలో పరిస్థితి కాంగ్రెస్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌కు అనుకూలంగా ఉందని అంచనా. 2004 ఎన్నికల నాటి నుంచీ రాజధాని బెంగళూరు ప్రాంతం బీజేపీకి కంచుకోటలా ఉంది. ఇంకా కోస్తా కర్ణాటకలో కూడా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ నాటికి కాషాయపక్షానికి జనాదరణ పెరిగితే బీజేపీ మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు సాధించిన పెద్ద పార్టీగా అవతరించవచ్చు. అప్పుడు 25–35 సీట్లు సాధించే వీలున్న జేడీఎస్ కొత్త సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది.
-- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment