sidha ramaiah
-
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
ఫాక్స్‌కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్‌కాన్‌కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ తన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్లో ఏటా రెండు కోట్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్‌కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్ల తయారీ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. -
కాంగ్రెస్‌కే జై కొడుతున్న కన్నడిగులు.. సీఎంగా మాత్రం ఆయనే కావాలట..!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీఎంగా ఆయనే.. ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు. కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు. చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్.. -
కర్ణాటక సీఎం అసమర్థుడు.. ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అసమర్థుడని తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ కమలం ద్వారా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, ప్రజలు ఎన్నుకోలేదని ఆరోపించారు. మైసూరులో మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు ఎక్కుపెట్టారు ప్రతిపక్షనేత సిద్ధరామయ్య. రాష్ట్రంలో ప్రభుత్వం, పాలన లేవని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ మంత్రి మధుస్వామే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వం 40శాతం కమీషన్ అడుగుతోందని రాష్ట్ర కాంట్రాక్టర్ల సమాఖ్య ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యాతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజలే బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. మంత్రి మధుస్వామి టెలిఫోనిక్ సంభాషణ ఇటీవలే లీకైంది. రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, ఏదో తామే అలా నెట్టుకొట్టుస్తున్నామని ఆయన అన్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అధికార బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చదవండి: బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్ -
కన్నడనాట ముక్కలాట
ఏప్రిల్–మేలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవడానికి పాలకపక్షమైన కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. గత కొన్ని మాసాలుగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న వ్యూహాలు ఈ దిశగానే సాగుతున్నాయి. కాని, 1985 నుంచీ ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ ఎన్నికల్లోనూ పాలకపక్షం ఓడిపోయింది. ఈ ఆనవాయితీ కొనసాగుతుందనే ఆశతో కాషాయపక్షం గెలుపుపై ధీమాతో పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల తరచు కర్ణాటక పర్యటిస్తున్నారు. కిందటేడాది జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల తర్వాత కర్ణాటక అసెంబ్లీ సమరానికి రెండు జాతీయ పార్టీలూ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇటీవల ఈశాన్యంలో ప్రధానంగా త్రిపురలో తొలిసారి ఘనవిజయం సాధించిన బీజేపీ దూకుడుకు యూపీ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి కళ్లెం వేసింది. మళ్లీ ఈ ఏడాది ఆఖరులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఎప్పటిలా పాలకపక్షాన్ని ఓడించడం అంత తేలిక కాదని, సీఎం సిద్దరామయ్య ఎత్తుగడలు తమ పార్టీని గట్టెక్కిస్తాయన్న కాంగ్రెస్ అంచనాల ఫలితంగా బీజేపీ అసెంబ్లీ పోరులో విజయానికి పకడ్బందీగా సమాయత్తమౌతోంది. ఎటూ తేల్చని ఎన్నికల సర్వేలు! ఈ ఏడాది జనవరిలో వెల్లడించిన మూడు సంస్థల ఎన్నికల సర్వేల ఫలితాల్లో ఏదీ కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పలేదు. కాంగ్రెస్‌కు కాషాయపక్షం కంటే స్వల్ప సంఖ్యలో ఎక్కువ సీట్లొస్తాయని తెలిపాయి. ఫిబ్రవరి రెండున ఫలితాలు ప్రకటించిన క్రియేటివ్ సెంటర్ ఫర్ పొలిటికల్ అండ్ సోషల్ స్టడీస్ అనే సంస్థ ఒక్కటే మొత్తం 224 సీట్లలో బీజేపీకి 113, కాంగ్రెస్‌కు 85, జేడీఎస్‌కు 25 స్థానాలు రావచ్చని జోస్యం చెప్పింది. అదీగాక, కర్ణాటకలో బీజేపీకి సాధారణ మెజారిటీ (113 సీట్లు) వస్తే వచ్చే డిసెంబర్లో జరిగే మూడు హిందీ రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరిపించే అవకాశాలున్నాయనే అంచనాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం కర్ణాటకతో పాటు పంజాబ్, మిజోరంలో మాత్రమే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు మే ఎన్నికల్లో గెలుపు అత్యవసరం. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి 110 సీట్లు కైవసం చేసుకుని ఇండిపెండెంట్ల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. సాధారణ మెజారిటీ సాధనకు బీజేపీ ఈసారి మొత్తం 56 వేల పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను తరలించడానికి ఏడు లక్షల మంది కార్యకర్తలను నియమించింది. ఈ ఐదేళ్లలో కాషాయపక్షం సభ్యులుగా కొత్తగా 75 లక్షల మంది చేరారు. ఆరున్నర కోట్ల జనాభా ఉన్న కర్ణాటకలో 80 లక్షల మంది రైతులే ఎన్నికల్లో జయాపజయాలు ఈసారి నిర్ణయిస్తారని భావిస్తున్నారు. అందుకే బీజేపీ తాను అధికారంలోకి వస్తే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తామని హామీ ఇస్తోంది. లింగాయత్‌లపై కాంగ్రెస్ వల సిద్దరామయ్య సర్కారు ఈ నాలుగేళ్లలో ఉచిత బియ్యం పథకంతోపాటు స్కూళ్లలో ఉచితంగా పాలు, గుడ్లు సరఫరా, విద్యార్థులకు ఉచిత బస్సు పాసులు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇంకా వర్షాధార ప్రాంతాల్లో రైతులకు నేరుగా నిధులు సమకూర్చుతోంది. సహకార బ్యాంకులు రుణాల మాఫీ చేశాయి. తక్కువ ధరకు భోజనం, ఆహారపదార్థాల సరఫరాకు ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్లు కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు బీజేపీకి గట్టి మద్దతుదారులైన లింగాయతుల్లో చీలిక తెచ్చే లక్ష్యంతో వీరశైవ–లింగాయతుల ధర్మా న్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్కారు సిఫార్సును కేంద్రం సానుకూలంగా ఆమోదిస్తేనే కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుంది. వివాదాస్పదమైన ఈ నిర్ణయం బీజేపీకి కూడా ఇబ్బందికరంగానే మారింది. కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తే లింగాయతులు అధికసంఖ్యలో నివసించే ఈశాన్య కర్ణాటక ప్రాంతాల్లో బీజేపీకి విజయావకాశాలు తగ్గుతాయి. ప్రస్తుతం పాత మైసూరు ప్రాంతంలో పరిస్థితి కాంగ్రెస్, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌కు అనుకూలంగా ఉందని అంచనా. 2004 ఎన్నికల నాటి నుంచీ రాజధాని బెంగళూరు ప్రాంతం బీజేపీకి కంచుకోటలా ఉంది. ఇంకా కోస్తా కర్ణాటకలో కూడా బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలింగ్ తేదీ నాటికి కాషాయపక్షానికి జనాదరణ పెరిగితే బీజేపీ మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు సాధించిన పెద్ద పార్టీగా అవతరించవచ్చు. అప్పుడు 25–35 సీట్లు సాధించే వీలున్న జేడీఎస్ కొత్త సర్కారు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు
ఊహించినట్లుగానే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీర్ఘకాలంగా ఉన్న ఈ డిమాండ్‌కు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోక్షం లభించింది. పథకం సాకారమైతే 30 కిలోమీటర్ల ట్రాఫిక్ కష్టాల నుంచి నగరవాసులకు విముక్తి లభిస్తుంది. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. సాక్షి, బెంగళూరు: కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించడానికి రాష్ట్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సోమవారం విధానసౌధలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మీడియాకు వివరించారు. నాగవార, హెగ్డే నగర, జక్కూరు మీదుగా మెట్రో రైలు మార్గాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ నిర్మిస్తామన్నారు. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గం నిర్మాణానికి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో పంచుకుంటాయన్నారు. కేంద్రం వాటా సుమారుగా రూ.6 వేల కోట్లు వరకూ ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే కేంద్రానికి నివేదిక అందించామన్నారు. ఈ రైలు మార్గం నిర్మాణం వల్ల బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొంతవరకూ పరిష్కారమవుతుందని తెలిపారు. కేబినెట్ భేటీ నిర్ణయాల్లో ముఖ్యమైనవి ఇలా... ♦ స్మార్ట్ సిటీ పథకంలో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు భాగంగా స్మార్ట్‌సిటీ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుకు అనుమతి. ♦ రాష్ట్రంలో అగ్రికల్ జోన్ల ఏర్పాటుకు అనుమతి ♦ విక్టోరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు విడుదల ♦ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలుకొని జిల్లా ఆసుపత్రుల వరకూ ఆప్తాల్మాలజీ (కంటి విభాగం) ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.06 కోట్లు విడుదల. ♦ రాష్ట్రంలో 500 గ్రామపంచాయతీల్లో వై–ఫై ఏర్పాటుకు అంగీకారం. ♦ మురుగునీటిని సంస్కరించి పునఃవినియోగానికి వీలుగా ప్రత్యేక పాలసీని రూపొందించడానికి అంగీకారం. ♦ రూ.200 కోట్లతో చిన్ననీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో పశ్చిమవాహిని అనే పథకం అమలు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. బుక్కరాయసముద్రానికి చెందిన సిద్ధరామయ్య (50) గాలి మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం బైకుపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో సిద్ధరామయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.