ఫాక్స్‌కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్‌కాన్‌కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ తన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!
తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్‌లో ఏటా రెండు కోట్ల స్మార్ట్‌ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్‌కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్‌ల తయారీ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment