బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో మే 10 న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈసారి అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. స్థానిక పార్టీ జేడీఎస్ కూడా సత్తా చాటి కింగ్ మేకర్‌గా అవతరిస్తుందనే అంచనాలున్నాయి.
కానీ సీఓటర్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సాధించి అధికారం చేజిక్కించుకుంటుందని ఈ సర్వే తేల్చింది. అధికార బీజేపీ ప్రభుత్వంపై 57 శాతం మంది తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు పేర్కొంది. సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు పేలవంగా ఉందని సర్వేలో పాల్గొన్న 47శాతం మంది అభిప్రాయపడ్డారు. కేవలం 26.8 శాతం మంది ఆయన పాలన బాగుందన్నారు.
మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు 115-127 సీట్లు, బీజేపీకి 68-80, జేడీఎస్‌కు 23-35 సీట్లు వస్తాయని సీఓటర్ సర్వే తెలిపింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం (29.1 శాతం) మౌలిక సదుపాయాల కల్పన(21.5శాతం)పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
సీఎంగా ఆయనే..
ఈ ఒపీనియన్ పోల్‌లో కర్ణాటక తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందనే విషయంపైనా ఓటింగ్ నిర్వహించారు. 39.1శాతం మంది కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకే జై కొట్టారు. బసవరాజ్ బొమ్మై కావాలని 31.1 శాతం మంది తెలిపారు. హెచ్‌డీ కుమారస్వామికి 21.4 శాతం మంది ఓటేశారు. ఇక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు కేవలం 3.2 శాతం మంది అనుకూలంగా ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ చాలా కాలంగా బలమైన పార్టీగా ఉంటోంది. 2008 ఎన్నికల్లో ఓడిపోయి 80 సీట్లే గెలిచిన ఆ పార్టీ.. 2013లో తిరిగి పుంజుకుని 122 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. 2018లో మళ్లీ 80 సీట్లే గెల్చుకుంది. అయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఏడాదికే ఈ సర్కార్ కూలిపోవడంతో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది.
మరోవైపు మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించారు. తనకు 80 ఏళ్లు దగ్గరపడుతున్నందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం మాత్రం తనవంతు కృషి చేస్తానన్నారు.
కాగా.. ఈసారి కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని ఇటీవలే కన్నడ వార్త పత్రిక సర్వేలో తేలిందని వార్తలొచ్చాయి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అది ఫేక్ అని తేలింది. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం బసవరాజ్‌బొమ్మైతో పాటు ఇతర బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేపై మండిపడ్డారు.
చదవండి: రాహుల్ గాంధీని కోర్టుకు ఈడుస్తా.. కాంగ్రెస్ నేతపై లలిత్ మోదీ ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment