మాయవతి
లక్నో: మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయవతి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోకుంటే మద్దతు విషయంలో పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ‘2018 ఏప్రిల్ 2న చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా అమాయకులైన మా పార్టీ కార్యకర్తలపై అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే వెలుపలి నుంచి మద్దతు కొనసాగింపుపై పునరాలోచించాల్సి ఉంటుంది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలు, ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన ఒకే మాదిరిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌కు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఏర్పడింది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment