
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్‌సీపీతోపాటు ఏడు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు ఏడోరోజు కూడా సభ ముందుకు రాలేదు. మంగళవారం వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో అన్నాడీఎంకే ఎంపీలు నిరసన కొనసాగించారు. సభ ఆర్డర్‌లో లేకుంటే అవిశ్వాసం నోటీసులను ప్రవేశపెట్టబోనని స్పీకర్ యధావిధిగా అన్నారు. దీంతో విపక్షాలన్నీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి.
ఇంకా ఎన్నిరోజులు ప్రభుత్వం ఇలా నాటకాలాడుతుంది? అవిశ్వాసానికి మద్దతుగా ఇంత మంది నిలబడ్డా కనిపించడంలేదా? అంటూ విపక్ష ఎంపీలు గట్టిగా అరిచారు. అయితే, సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లితేగానీ అవిశ్వాసం నోటీసులు ముందుకు తెస్తానని స్పీకర్ సుమిత్ర మహాజన్ స్పష్టం చేశారు. పదే పదే చేసిన విజ్ఞప్తులు విఫలం కావడంతో స్పీకర్.. చివరికి లోక్‌సభను బుధవారానికి వాయిదావేశారు. దీంతో మరోసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ సహా ఇతర పార్టీలు నిర్ణయించాయి.
వాయిదా అనంతరం గలాటా?: కాగా, వాయిదా పడిన తర్వాత కూడా లోక్‌సభలో ఉద్రిక్తత నెలకొంది. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా ఆందోళనలను చేస్తోన్న ఏఐఏడీఎంకే ఎంపీలను విపక్ష సభ్యులు తప్పుపట్టారు. ‘బీజేపీకి ఎంతకు అమ్ముడుపోయారు?’ అని తమిళ ఎంపీలను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ ఒకరు వ్యాఖ్యలు చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈక్రమంలో కాంగ్రెస్ పక్ష నేత ఖర్గేపై దాడికి ఏఐఏడీఎంకే ఎంపీలు యత్నించారని వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment