సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా కేంద్ర సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానం మరోసారి వాయిదా పడింది. హోదాపై తాము ఇచ్చిన నాలుగో నోటీసు కూడా చర్చకు రాకపోవడాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గర్హించారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. అప్పటికే టీఆర్‌ఎస్, ఏఐడీఏంకే ఎంపీలు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ తోట నర్సింహంలు ఇచ్చిన నోటీసులను చదివిన స్పీకర్.. సభ ఆర్డర్‌లో లేనికారణంగా చర్చను చేపట్టలేనని స్పష్టం చేశారు. సభ్యులు ఎవరిస్థానాల్లో వారు కూర్చోవాలని కోరినా ఫలితం రాకపోవడంతో సభను గురువారానికి వాయిదావేశారు.
పరీక్షకు సిద్ధమే కానీ: సభ ఆర్డర్‌లో లేని కారణంగా అవిశ్వాస తీర్మానం చర్చ వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ నేడు లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ సిద్ధంగా ఉందని, ఓటింగ్‌లోనూ నెగ్గుతామని, అయితే చర్చ జరగాలంటేమాత్రం సభ ఆర్డర్‌లో ఉండితీరాల్సిందేనని మంత్రి అన్నారు. ‘‘సభ్యులంతా మీమీ స్థానాల్లో కూర్చుంటే ఎలాంటి చర్చనైనా చేపట్టొచ్చు. అవిశ్వాసం తీర్మానంలో మేమే గెలుస్తాం. సభ సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని స్పీకర్ ద్వారా కోరుతున్నాను’’ అని అనంతకుమార్ పేర్కొన్నారు.
మళ్లీ నోటీసులు: అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ తాము ఇచ్చిన నాలుగో నోటీసులపైనా చర్చ జరగకపోవడంతో మరోమారు నోటీసులు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు భావిస్తున్నారు. చర్చ జరిగేదాకా నోటీసులు ఇస్తూనే ఉంటామని ఆ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment