
ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా, ప్రజల స్వరం గట్టిగా వినబడాలన్నా ఓటు హక్కు మన చేతిలో ఉన్న వజ్రాయుధం. ఈ విషయాన్ని మహిళలు బాగా తెలుసుకున్నారు. ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం రానురాను పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ, వివిధ రాష్ట్రాలకు జరుగనున్న ఎన్నికల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) లోక్‌నీతి అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు చేస్తుంది. ప్రీపోల్ సర్వేలు, పోస్ట్‌పోల్ సర్వేలు నిర్వహిస్తూ జనం నాడిని తెలియజేస్తూ ఉంటుంది.
ఆ సంస్థ కొన్నేళ్లలో నిర్వహించిన వివిధ సర్వేలు, తాజాగా నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రీపోల్ సర్వే ఫలితాలను సమీక్షిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో 65.5% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే ఎన్నికల్లో పురుషులు 67% మంది ఓట్లు వేశారు. అంటే పురుషుల, మహిళా ఓటర్ల మధ్య వ్యత్యాసం చాలా తగ్గింది. దేశంలో మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్లు 3 కోట్ల కంటే ఎక్కువే. అయినా పోలింగ్ బూత్‌లకి తరలి వెళ్లడంలో మహిళలు ముందంజలో ఉన్నారు. 1970వ దశకంలో ఓటు హక్కు వినియోగించుకున్న పురుషులు 61% ఉంటే, 2014కి వచ్చేసరికి 67% మాత్రమే. అదే మహిళా ఓటర్ల విషయానికొస్తే 1971లో 49% మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటే 2014 వచ్చేసరికి ఏకంగా 65.5 శాతానికి చేరుకుంది.
ఏ పార్టీకి లాభం?
గతంలో జరిగిన ఎన్నికలను పరి శీలిస్తే.. బీజేపీ కంటే కాంగ్రెస్ వైపు మహిళా ఓటర్ల మొగ్గు ఎక్కువగా ఉంది. 2 నుంచి 3 శాతం మహిళా ఓట్లు బీజేపీకి తక్కువగా వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పురుషులు, మహిళల ఓట్ల శాతం సమానం గా ఉంది. కాంగ్రెస్‌కి పోలైన ఓట్లలో 19% పురుషులైతే, మహిళలు కూడా 19% మంది ఓటేశారు. అదే బీజేపీకి పురుషులు 33% మంది ఓటు వేస్తే, మహిళలు 29% మాత్రమే ఓటేశారు. ఇక వివిధ రాష్ట్రాల్లో కూడా బీజేపీది ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పడిన ఓట్లలో 15% పురుషులు ఉంటే, 5% మాత్రమే మహిళలు ఉన్నారు. గుజరాత్‌లో మాత్రం బీజేపీకి మెరుగైన పరిస్థితులే ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలు కూడా ఆ పార్టీని ఆదరిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న రాజకీయ పార్టీ లకే మహిళలు బ్రహ్మరథం పట్టారు. కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ(పీడీపీ), యూపీలో మాయావతి (బీఎస్పీ), తమిళనాట జయలలిత(ఏఐఏడీంకే), పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్టీ (తృణమూల్ కాంగ్రెస్)లకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళలు ఏకంగా 10% ఎక్కువగా జయలలితకు ఓట్లు వేయడం విశేషం.
2019లో బీజేపీ వైపే మహిళా ఓటర్లు?
2014 నుంచి ఇప్పటికీ పరిస్థితులు మారుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల పురుషుల్లోనూ, మహిళల్లోనూ సమాన ఆదరణ కనిపిస్తున్నట్లు లోక్‌నీతి–సీఎస్‌డీఎస్ ఈ ఏడాది నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. మహిళా ఓటర్ల మొగ్గు బీజేపీ వైపు పెరుగుతూ వస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 30 శాతం మహిళలు బీజేపీ వైపు ఉంటారని సీఎస్‌డీఎస్ అంచనా వేసింది. ఈసారి ఎన్నికల్లో హరియాణా, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌లో మహిళా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తారన్న భావన వ్యక్తమవుతోంది. ‘ఉజ్వల యోజన’పేరిట మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, బేటీ బచావో–బేటీ పఢావో లాంటి పథకాల కారణంగానే మహిళలు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల సంఘం మహిళా ఓటర్ల నమోదును పెంచడానికి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో మహిళా ఓటర్లు నమోదు భారీగా ఉంటుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీదే విజయమన్న అభిప్రాయం నెలకొంది.
బీజేపీకి మహిళా ఓటర్లు ప్రతికూలంగా ఉన్న రాష్ట్రాలు...
అస్సాం, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, జార్ఖండ్
బీజేపీకి మహిళల మద్దతు ఉన్న రాష్ట్రాలు..
ఢిల్లీ, మధ్యప్రదేశ్
మహిళా ఓటర్లు జై కొడుతున్న సీఎంలు..
కె.చంద్రశేఖర రావు(తెలంగాణ) నితీశ్ కుమార్(బిహార్) శివరాజ్‌సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్) నవీన్ పట్నాయక్(ఒడిశా)