సిద్ధరామయ్య సక్రమంగా పరిపాలించి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు అంత తక్కువ సీట్లు వచ్చాయి? అని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ విమర్శించడం, దానికి సిద్ధు తీవ్రంగా స్పందించడంతో సంకీర్ణ సర్కారులో ఏదో జరుగుతోందని చాటిచెప్పింది. ఇరు పార్టీల నేతలు కూడా విమర్శలకు పదునుపెట్టారు. సర్కారును ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్సే తమ తలుపు తట్టిందని జేడీఎస్ నేతలు ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైనా ఆశ్చర్యం లేదు.
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణం విభేదాలతో కుతకుతలాడుతోంది. సోమవారం ఉదయం సంకీర్ణ సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య చేసిన ట్వీట్ కలకలం సృష్టించింది. జేడీఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ‘మొదట జీటీ దేవెగౌడ, ప్రస్తుతం హెచ్.విశ్వనాథ్, రానున్న రోజుల్లో ఇంకెవరు విమర్శిస్తారో తెలియదు’ అని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్ – జేడీఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలకు ముందు వరుసలో ఉంటారు, ఆయనకు వివరణ ఇచ్చేందుకు సంకీర్ణ ధర్మం అడ్డు వస్తోందని సిద్ధరామయ్య తెలిపారు. అయితే సమన్వయ సమితి సమావేశంలో సమాధానం చెబుతానని పేర్కొన్నారు. దీనిపై జేడీఎస్ నాయకుల నుంచి ప్రత్యారోపణలు వచ్చాయి. అధికారం కోసం జేడీఎస్ నేతలు ఎవ్వరూ కాంగ్రెస్ వద్దకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పెద్దలే స్వచ్ఛందంగా తమకు మద్దతు కావాలని కోరినట్లు తెలిపారు.
అన్నింటా సిద్ధూ విఫలం: విశ్వనాథ్
సిద్ధరామయ్య ట్వీట్‌పై జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించారు. సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఐదేళ్లుగా సీఎంగా పని చేసినప్పటికీ ఏ ఒక్క సరైన నిర్ణయం తీసుకోలేకపోయారన్నారు. ఐదేళ్లు మంచి పాలన అందించి ఉంటే కాంగ్రెస్ 80 సీట్లకే ఎందుకు పరిమితం అవుతుందని ప్రశ్నించారు. తాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసినట్లు గుర్తు చేశారు. తనకు 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పారు. సిద్ధరామయ్య చెప్పినట్లు తాను నీతిమాలిన రాజకీయాలకు పాల్పడే రకం కాదని అన్నారు. కాగా, సిద్ధరామయ్య గురించి తాను ఏకవచనంతో సంబోధించలేదని మంత్రి జీటీ దేవెగౌడ అన్నారు. సిద్ధరామయ్య మరోసారి సీఎం కావాలని కోరుకునే వారి జాబితాలో తాను కూడా ఉన్నట్లు తెలిపారు.
బీజేపీకి లాభం: ఈశ్వరప్ప
కాంగ్రెస్ – జేడీఎస్ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంతో తమకు లాభమని బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. సిద్దరామయ్య ఈ జన్మలో సీఎం కాలేరని, అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
సంకీర్ణంలో కల్లోలం
Published Tue, May 14 2019 10:44 AM | Last Updated on Tue, May 14 2019 12:34 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment