మీడియాతో మాట్లాడుతున్న ఫడ్నవిస్. చిత్రంలో డా.కె. లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణను పణంగా పెట్టి కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణకు సంబంధించిన రక్షణ ఒప్పందాలను బయటకు వెల్లడించరాదని తెలిపారు. అయితే దీనిని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకున్నా కుదరలేదని అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా కాంగ్రెస్, రాహుల్‌గాంధీ రఫేల్ డీల్‌పై అనేక ఆరోపణలు చేశారని, అబద్ధాలు చెప్పారని తెలిపారు. వారి ఆరోపణలపై సుప్రీంకోర్టు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రధాని మోదీ పట్ల వారి భాష దారుణంగా ఉందని, అందుకే మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ దళారీ లేడనే రాహుల్‌కు నిరాశ..
దేశ హితం, భవిష్యత్తు కోసం ఆలోచించే మోదీ రఫేల్ ఒప్పందం చేసుకున్నారని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా ఫ్రాన్స్, ఇండియా మధ్య ఒప్పందం జరిగిందన్నారు. అదే కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్, జీప్, అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంల్లో దళారుల ప్రమేయం ఉందని అన్నారు. అయితే రఫేల్ ఒప్పందం తమ దళారీ లేకుండా జరిగినందుకు రాహుల్‌కు నిరాశగా ఉందని ఎద్దేవా చేశారు. వాస్తవానికి 2001లో ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినా, అప్పట్లో తగిన చర్యలు చేపట్టలేని దుస్థితి నెలకొందన్నారు. యూపీఏ హయాంలో దేశ రక్షణకు డబ్బులు లేవని ఈ ఒప్పందాన్ని గాలికొదిలేశారు. చివరకు 2008లో టెండర్లు పిలిస్తే 6 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 2011లో టెండర్లు ఓపెన్ చేయగా డసాల్ట్ తక్కువకు కోట్ చేసిందన్నారు. 2015లో మోదీ ప్రభుత్వం యుద్ధ విమానాల ఆవశ్యకతను గుర్తించి కొనుగోలుకు చర్యలు చేపట్టిందన్నారు.
వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. రఫేల్ డీల్ విషయంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ నెల 18న అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 19న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించి, కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment