
సాక్షి, బెంగళూరు: నేను మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. నన్ను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారు... అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. నగరంలోని డాలర్స్ కాలనీలో ఉన్న యడ్యూరప్ప నివాసంలో మంగళవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌లు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్‌తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి, ఆర్.అశోక్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు సమాచారం. బీజేపీ-జేడీఎస్ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా నేను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు నా పై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారు... అని పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు వెల‍్లడించాయి.
ఇక ఇదే సమావేశంలో ఇటీవల కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంత్‌కుమార్ హెగ్డే చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వివాదాలను పార్టీ నేతల మెడకు చుడుతున్నారని కొందరు నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అనంత్‌కుమార్ హెగ్డేకు భాష మార్చుకోవాల్సిందిగా సూచించాల్సిందిగా నేతలు హైకమాండ్‌ను కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment