సాక్షి, అమరావతి: ఇక నుంచి రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా స్పష్టం చేశారు. ఇటీవల పుణేలో, న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలను నిర్వహించిందని ఆయన సోమవారం సచివాలయంలో ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తున్నామని వెల్లడించారు. పుణేలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఓటర్లను అనుసంధానం చేసే ఈఆర్‌వో నెట్‌ను రూపొందించిందని, దీని ద్వారా ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే మరో రాష్ట్రంలో ఓటు లేకుండా తొలగించనున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండేసి రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన ఓటర్లకు ఆంధ్రప్రదేశ్‌లోనే ఓటు హక్కు ఉంటుందని, తెలంగాణలో ఉండదని, అలాగే హైదరాబాద్‌లో ఉన్నవారికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటుందని, వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు ఉండేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజకీయ కారణాలతో ఓట్లు తీసేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఎస్‌ఎంఎస్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని, ఓటు హక్కు లేకపోతే ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు కొనసాగుతోందని, ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు గడువును నవంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.49 కోట్ల ఓటర్లున్నారని వెల్లడించారు. ఇప్పుడు సాగుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు.
ఇక రెండేసి రాష్ట్రాల్లో ఓటు కుదరదు
Published Tue, Oct 16 2018 3:36 AM | Last Updated on Tue, Oct 16 2018 4:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment