బాబూ.. మోసం నీ నైజం విలువలు నానైజం | YS Jagan fires on Chandrababu At Vizianagaram | Sakshi
Sakshi News home page

బాబూ.. మోసం నీ నైజం విలువలు నానైజం

Published Tue, Oct 2 2018 4:49 AM | Last Updated on Tue, Oct 2 2018 5:32 AM

YS Jagan fires on Chandrababu At Vizianagaram - Sakshi

విజయనగరంలో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న విపక్ష నేత జగన్‌

చంద్రబాబూ.. నేను సూటిగా అడుగుతున్నా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చింది నువ్వు కాదా? నీ బావమరిది బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా తీస్తున్నాడు. ఆ షూటింగ్‌ సెట్స్‌లో వెంకయ్యనాయుడు కన్పించడం లేదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన నువ్వు.. బీజేపీతో కక్కుర్తి పడ్డావు కాబట్టే ఇవాల్టి వరకూ అరెస్టు కాకుండా తిరగగలుగుతున్నావనేది నిజం కాదా?    

రాష్ట్రంలో చంద్రబాబు, ఈయన కొడుకు చెయ్యని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టిదాకా.. బొగ్గు, కరెంట్‌ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ అసైన్డ్‌ భూములు.. చివరకు గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదించావ్‌. అయినా నీ మీద సీబీఐ విచారణ జరగకుండా కాలం వెళ్లబుచ్చుతున్నావంటే నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబూ? 

సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మీకు నచ్చిన కాంట్రాక్టర్లను బినామీలుగా తీసుకొచ్చి, నామినేషన్‌ పద్ధతిలో మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి అక్షరాల రూ.1,853 కోట్లు లూటీ చేశారని కాగ్‌ నివేదిక చెప్పినా, నీ మీద సీబీఐ విచారణ జరగడం లేదంటే.. నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లే కదా చంద్రబాబూ? 

నువ్వీమధ్య నీతి ఆయోగ్‌ సమావేశం జరిగినప్పుడు ఢిల్లీకెళ్లావు. అక్కడ మోదీ కన్పిస్తే నువ్వు చేసిందేంటి? ఆయనకు వంగి వంగి నమస్కారం పెట్టడం నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మా మిత్రుడని నిండు లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అనడం నిజం కాదా?  
– వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబూ.. ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా ఆడియో వీడియో టేపుల్లో దొరికిపోయి బీజేపీతో కక్కుర్తి పడి కుమ్మక్కయ్యావ్‌. అందుకే నీ అవినీతి కేసులపై ఇప్పటికీ సీబీఐ విచారణ జరపడం లేదు. అదీ నీ నైజం. ప్రత్యేక హోదా విషయంలో రాజీ పడలేదు కాబట్టే, ఎనిమిదేళ్ల తర్వాత కూడా నా భార్యను కేసుల్లో ఇరికించే పరిస్థితి వచ్చినా ఎదుర్కొంటున్నా. ఇదీ నా నైజం. అబద్ధాలు, మోసాలతో బతకడం నీ నైజం. మాట కోసం, విలువల కోసం బతకడం నా నైజం’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 275వ రోజు సోమవారం ఆయన విజయనగరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
  
బీజేపీతో నీ లాలూచీకి ఎన్ని సాక్ష్యాలు కావాలి? 
‘‘ఓదార్పు యాత్ర చేసేందుకు అప్పట్లో అధికారంలో ఉన్న సోనియా గాంధీతోనే నేను కొట్లాడాను. అప్పుడు నువ్వు, కాంగ్రెస్‌ కలిసి పెట్టిన తప్పుడు కేసులను ఎదుర్కొంటున్నా. నీ నైజమేంటో, నా నైజమేంటో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? నాలుగున్నరేళ్లుగా బీజేపీతో కాపురం చేసింది నువ్వు కాదా? హోదాను తాకట్టు పెట్టింది నువ్వనేది ప్రజలకు తెలియదా? బీజేపీతో తనకున్న కనెక్షన్‌ ద్వారా మహారాష్ట్రలో బాబ్లీ ఆందోళన కేసు తెరపైకి తెచ్చాడు. దాన్నో పెద్ద కేసుగా చిత్రీకరిస్తున్నాడు. సానుభూతి కోసం డ్రామాలాడుతున్నాడు. నిజంగా నువ్వు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే.. ఓటు కోసం కోట్లు వెదజల్లుతూ, నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో సాక్ష్యాలతో దొరికితే... ఆ కేసు లో నీకు నోటీసులు ఇవ్వకుండా.. బాబ్లీ కేసులో ఇస్తున్నారంటే నువ్వు బీజేపీతో మేనేజ్‌ చేసుకున్నట్లే కదా చంద్రబాబూ? బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు మాట్లాడేదేంటి? వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీతో సఖ్యతగా ఉందంటున్నాడు. ఆయన రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది. ఇంత దారుణంగా అబద్ధాలాడే మనిషి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా? 
 
ఆ రోజు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యి కేసులు పెట్టించావు 
అబద్దాలు చెప్పడం, మోసాలతో బతకడం చంద్రబాబు నైజం. మాట కోసం, విలువల కోసం బతికే వ్యక్తి జగన్‌. ప్రజల కోసం నేనెప్పుడూ రాజీ పడలేదు. కాబట్టే ఓదార్పు చేస్తానన్నందుకు అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఒప్పుకోకపోతే కోట్లాడాం. అందుకే కాంగ్రెస్, టీడీపీ ఇద్దరూ కలిసి కేసులు బనాయించాయి. ఈ రోజు కూడా ప్రత్యేక హోదా కోసం రాజీ పడటం లేదు కాబట్టే, ఇదే బీజేపీ నా భార్యను ఎనిమిది సంవత్సరాల తర్వాత కేసుల్లో ఇరికించడానికి చేస్తున్న పరిస్థితిని మళ్లీ ఎదుర్కొంటున్నా. నీ నైజమేంటి? నా నైజమేంటని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనమేంటని చంద్రబాబును అడుగుతున్నా.  
 
ధర్మ పోరాటాలంటూ డ్రామాలు 
చంద్రబాబు తన కేసుల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. ఇలాంటి పెద్దమనిషి హోదా పేరుతో డ్రామాలు చేస్తున్నాడు. మొన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ధర్మపోరాట దీక్ష చేశాడట. అక్కడ ఏమన్నాడో తెలుసా? కేంద్రంపై చంద్రబాబు ధ్వజమట. ఎన్డీఏను గద్దె దించయినా ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పాడు. బుల్లెట్‌ ట్రైన్‌కు లక్ష కోట్లట. అమరావతికి అరకొర నిధులని ఈయన ఆ ధర్మపోరాట దీక్షలో అన్నాడు. జాతీయ విద్యా సంస్థలు మన రాష్ట్రంలో పూర్తవ్వడానికి 30 ఏళ్లు పడుతుందని బీజేపీని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. హైదరాబాద్‌లో ఆస్తులపై కేంద్రం పట్టించుకోలేదని బాధపడ్డాడు. మన్మోహన్‌ సింగ్‌ను మోదీ బెదిరించేలా మాట్లాడుతున్నాడని ఈయన ప్రేమ చూపిస్తాడు.
  
హోదాకు తూట్లు పొడిచింది నువ్వు కాదా? 
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నానని చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నాడు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి నువ్వు కారణం కాదా చంద్రబాబూ? పైగా ధర్మపోరాట దీక్షని అందరి చెవుల్లో కాలిఫ్లవర్లు పెడతావా? 2014 మార్చి 2న రాష్ట్రాన్ని విడగొడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రత్యేక హోదాను అమలు చేయండని ప్రణాళిక సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు జూన్‌లో ముఖ్యమంత్రయ్యారు. సీఎం అయ్యాక హోదా ఫైలు ప్రణాళిక సంఘం వద్ద ఏడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే ఏం చేశారు? గాడిదలు కాశావా చంద్రబాబూ? 2016 సెప్టెంబర్‌ 8న అర్ధరాత్రి.. కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ హోదాకు బదులు అబద్ధపు ప్యాకేజీ ప్రకటించాడు.

ఆ రోజు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు జైట్లీ పక్కనే ఉన్నారు. అదే అర్ధరాత్రి నువ్వు జైట్లీకి కృతజ్ఞతలు చెప్పలేదా? మర్నాడు కేంద్రాన్ని అభినందిస్తూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? అంతటితో ఆగకుండా ఢిల్లీ వెళ్లి జైట్లీకి శాలువా కప్పాడు. అక్కడితోనూ ఆగలేదు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరుగుతుందని రివర్స్‌ గేర్‌లో మాట్లాడాడు. హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఎదురు ప్రశ్న వేశాడు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అన్నదీ చంద్రబాబే. 2017 జనవరి 27న ఈ పెద్దమనిషి విలేకరుల సమావేశంలో.. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా అని అడిగాడు. ఆధారాలుంటే రండి.. చెప్పండన్నాడు. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి సవాలట. పత్రికల్లో హెడ్డింగులు. బీజేపీతో కాపురం చేస్తున్నప్పుడు.. 2014–15, 2015–16, 2016–17 మూడేళ్లు బీజేపీ బ్రహ్మాండంగా చేసిందని, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇచ్చిందని విలేకరుల సమావేశంలో బీజేపీని పొగుడుతూ మాట్లాడటం నిజం కాదా?  
 
అవిశ్వాసంలోనూ నీచ రాజకీయాలే 
హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం తానే పెట్టినట్టు గొప్పలు చెబుతున్నాడు చంద్రబాబు. ఆ రోజు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొట్టమొదట అవిశ్వాసం పెట్టకుండా ఉంటే నువ్వు ముందుకొచ్చే వాడివేనా? అప్పుడు నువ్వన్న మాటలేంటి? సంఖ్యాబలం ఉంటేనే మద్దతు ఇస్తానన్నావ్‌. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేఖలు తీసుకుని అవిశ్వాసానికి అందరి మద్దతు కూడగడితే... వాళ్లంతా మద్దతు ఇవ్వడానికి ముందుకొస్తే అప్పుడు యూటర్న్‌ తీసుకుని, తానే అవిశ్వాస తీర్మానం పెడతానంటూ బొంకడం నిజం కాదా? పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఐదుగురు బీజేపీకి వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి, వాళ్ల మొఖాన కొట్టారు. అప్పుడు నువ్వు కూడా నీ ఎంపీల చేత రాజీనామా చేయించి ఉంటే 25కు 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్షకు కూర్చుని ఉంటే, మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా చంద్రబాబూ?  
 
తల్లిదండ్రులను చంపేసిన ముద్దాయి మల్లే.. 
చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యమేస్తోంది. ఆయన పనులు చూస్తుంటే ఓ కథ గుర్తుకొస్తోంది. అనగనగా ఓ ముద్దాయి ఉన్నాడు. ఆయన్ను కోర్టు బోనులో నిలబెట్టారు. జడ్జి సీటులో కూర్చోగానే బోరున ఏడ్చాడట. సార్‌.. తల్లీదండ్రీ లేనివాడిని, విడిచిపెట్టమన్నాడట. అది చూసిన జడ్జి.. ఎందుకయ్యా ఇతన్ని తీసుకొచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను అడిగాడట. అప్పుడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ‘ఇతని మాటలు నమ్మొద్దు సార్, తన తల్లీదండ్రిని చంపేశాడు కాబట్టే ఈ ముద్దాయి బోనులో నిలబడ్డాడు’ అని చెప్పాడట. చంద్రబాబు పరిస్థితి కూడా అచ్చం ఇలానే ఉంది. అధికారం కోసం సొంతమామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. ఆయన మరణానికి కారణం అయ్యాడు. ఎన్నికలొచ్చినప్పుడు అదే మామగారి చిత్ర పటానికి దండేసి ఓట్లడగడం మొదలు పెడతాడు. ఇలాంటి అన్యాయమైన, అబద్ధాలాడే, మోసాలు చేసే వ్యక్తిని చూస్తున్నారు. ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. నిజాయితీ రావాలి. మరో ఆర్నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎలాంటి నాయకుడు కావాలో మీరే ఆలోచించుకోండి. చెడిపోయిన ఈ  రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ రావాలంటే అది ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. మీ అందరి తోడు, దీవెనలు, ఆశీస్సులు కావాలి.   
 
వేలాది మంది వస్తే కరెంట్‌ తీసేస్తారా?   
ఇవాళ ఇక్కడ మీటింగ్‌ జరుగుతుంటే కరెంట్‌ కట్‌ చేశారంటే.. ఎంత దారుణంగా టీడీపీ పాలన సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని వేల మంది ఇక్కడ జమ అయి ఉన్నప్పుడు కనీసం కరెంట్‌ కూడా ఇవ్వాలన్న ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పాలనను ఎదుర్కొనేందుకు మీ అందరి దీవెనలు, తోడు కావాలి.   

పేదబిడ్డలను నేను చదివిస్తా.. 
ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వులు చూడాలని, పేదవాడి ముఖంలో ఆనందం చూడాలని నవరత్నాలు ప్రకటించాం. పేదవాడు, మధ్యతరగతి వాళ్లు వారి పిల్లలను గొప్పగా చదివించే పరిస్థితి ఇప్పుడుందా? పక్కనే కన్పిస్తోంది మహారాజా ఇంజనీరింగ్‌ కాలేజీ. అక్కడ ఫీజులెంతో తెలుసా? అక్షరాల రూ.81,500. అది ఇదీ వేసి ఏడాదికి రూ.90 వేలు లాగుతారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ముష్టేసినట్టు రూ.30 వేలు, రూ.35 వేలు. అది కూడా రెండేళ్ల నుంచి బకాయిలున్నాయని చాలా మంది పిల్లలు చెబుతున్నారు. ఈ లెక్కన పేదలు నాలుగేళ్లలో మిగతా రూ.2.40 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అందుకే నాడు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశ పెట్టి అండగా నిలిచారు. రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఎన్ని లక్షలు ఖర్చయినా మీ పిల్లలను మేం చదివిస్తాం. హాస్టల్‌ ఖర్చులు, మెస్‌ చార్జీల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం. చిట్టి పిల్లల నుంచే చదువులకు పునాదులు పడాలి. అందుకే వారిని బడికి పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

అభివృద్ధి అంతా రివర్స్‌ గేర్‌ 
విజయనగరం నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో విషయాలు చెప్పారు. 30 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గానికి ఒకే పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక్కడ గెలిచిన వ్యక్తి 17 ఏళ్లు మంత్రిగా, నాలుగేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నారంటే ఎన్నెన్నో పనులు చేసి ఉంటాడని, ఎన్నో ప్రాజెక్టులు వచ్చి ఉంటాయని అనుకుంటాం. కానీ పరిస్థ్దితి అంతా రివర్స్‌ గేర్‌లో ఉందని ప్రజలు చెప్పారు. 1983 నుంచి చెప్పుకోదగ్గ ఒక్క పనీ జరగలేదన్నారు. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి పాలనలో జరిగిన మేలు గురించి చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం వాసులకు కలగానే మిగిలిపోయిన తోటపల్లి ప్రాజెక్టు గురించి తెలిపారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పరిపాలనలో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.3 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు.

వైఎస్‌ హయాంలో 2004 నుంచి ఏకంగా రూ.400 కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టును పరిగెత్తించారని సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 90 శాతం పనులు ఆయన కాలంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చంద్రబాబు చూడలేదని, కమీష¯న్ల కోసం కక్కుర్తి పడ్డారన్నారు. ఇల్లంతా కట్టిన తర్వాత ఇంటి ముందు గేటు పెట్టిన విధంగా.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గేటు పెట్టి తానే ఆ ప్రాజెక్టు కట్టానని చెప్పడం చూశాం. జంధ్యావతి ప్రాజెక్టును రూ.118 కోట్లతో రబ్బరు డ్యామ్‌ను అసియాలోనే ఎక్కడా లేనివిధంగా కట్టిచూపిన ఘనత వైఎస్‌దేనన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే, పెద్దగెడ్డ రిజర్వాయర్‌ ప్రాజెక్టు రూ.104 కోట్లతో ప్రారంభించి, దాన్ని పూర్తిచేసి ఏకంగా 12 వేల ఎకరాలకు నీరందించిన ఘనత వైఎస్‌దేనని ఇక్కడి ప్రజలు గొప్పగా చెబుతున్నారు. విజయనగరం జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో ఆయన వస్తే తప్ప జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా క్యాంపస్, కనీసం జూనియర్‌ కళాశాల రాని పరిస్థితి చూశాం.  

సీఎం ఇచ్చిన హామీలకు దిక్కులేదు 
ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఇచ్చిన హామీలకు దిక్కులేని స్థితిలో విజయనగరం ఉంది. మెడికల్‌ కళాశాల అట.. విజయనగరం స్మార్ట్‌ సిటీ అట.. ఫుడ్‌ పార్క్‌ అట.. గిరిజన యూనివర్సిటీ అట..  లలిత కళల అకాడమీ అట.. ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు అట.. ఇవి ఎక్కడైనా కనిపించాయా? విజయనగరాన్ని పారిశ్రామిక నగరంగా చేస్తాడట ఈ పెద్దమనిషి. ఇప్పటి వరకూ ఉన్న జ్యూట్‌ మిల్లులు మూసివేతకు గురయ్యాయి. కొత్త ఉద్యోగాలు ఇప్పిస్తామనడం దేవుడెరుగు.. విజయనగరంలో రెండు జ్యూట్‌మిల్లులు మూతపడి 12 వేల మంది రోడ్డున పడిన పరిస్థితి చూస్తున్నాం. గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అన్నాడు.. కనిపించాయా  విమానాలు? ఇంతవరకూ విజయనగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదంటే ఇంతకన్నా అధ్వానం ఏదైనా ఉంటుందా? బహుశా డిగ్రీ కళాశాల లేని జిల్లా కేంద్రం ఏదైనా ఉంటే అది విజయనగరం అవుతుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు దారిలో మూతపడ్డ జ్యూట్‌ మిల్లులు కనిపించాయి. అక్కడి ప్రజలు నా దగ్గరకు వచ్చారు. అన్నా.. జిల్లాలో ఎనిమిది జ్యూట్‌ మిల్లులున్నాయన్నా.. అందులో నాలుగు మూతపడ్డాయన్నా.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే అన్నా అనిచెప్పారు. ఒకవైపు మిల్లులు మూతపడుతూ ఉంటే, మరో వైపు చంద్రబాబు ప్రభుత్వం గోనెసంచులు బంగ్లాదేశ్‌ నుంచి తెప్పించుకుంటుంది. ఈ జ్యూట్‌ మిల్లులలో దివంగత నేత హయాంలో కరెంటు యూనిట్‌ రూ.3.15కు ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో రూ.8.15 వసూలు చేస్తున్నారు. ఇలాగైతే మిల్లులు ఎలా నడుస్తాయి చంద్రబాబూ?  
 
తాగునీటికీ కటకటే.. 
చంద్రబాబు 2003లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమసింగి ఫ్యాక్టరీ మూతపడిందని ఇక్కడకు వచ్చేటప్పుడు రైతులు తెలిపారు. తర్వాత వైఎస్‌ హయాంలో రూ.35 కోట్లతో నష్టంలో ఉన్న ఫ్యాక్టరీని దగ్గరుండి ఆదుకున్నారని చెప్పారు. మళ్లీ చంద్రబాబు హయాం రాగానే ఇదే ఫ్యాక్టరీ రూ.48 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోయింది. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీల్లో రిటైరైన వారి పరిస్థితి దారుణంగా ఉంది. అన్నా.. మా డబ్బే పెన్షన్‌ కోసం కట్టాం. మేము రూ.8.33 శాతం కడితే ప్రభుత్వం 8.33  ఇవ్వాలి. మొత్తం  16.66 శాతం ఇవ్వకుండా కేవలం 8.33 శాతానికి సంబంధించి రూ.12 లక్షలు వారిదగ్గరే పెట్టుకుని కేవలం రూ.500 నుంచి రూ.1000 వరకే పెన్షన్‌ ఇస్తున్నారన్నారు. ఆ రూ.12 లక్షలు ఇస్తే బ్యాంకులో వేసుకున్నా కనీసం రూ.9 వేలు వడ్డీ వచ్చే పరిస్థితి ఉండేది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఐదు లక్షల మందికి జ్వరాలు వచ్చి బాధపడితూ 86 మంది  చనిపోయారని చెబుతున్నారు. చంద్రబాబు మాత్రం దోమలపై యుద్ధం అంటాడు. దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను, రోగాలు వచ్చే ప్రాంతాలను డ్రోన్లతో కనిపెడతాడట. 108 వాహనాలు జిల్లాలో 27 ఉంటే ఇందులో 10 అంబులెన్స్‌లు షెడ్‌లలో ఉన్నాయి. వీటిలో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల నుంచి జీతాల్లేవట. విజయనగరంలో రెండు,  మూడురోజులకొకమారు తాగు నీరు వచ్చే పరిస్థితి ఉంది. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు నుంచి తాగునీటిని నిరంతరం సరఫరా చేయడం 2007లో వైఎస్సార్‌ గారు రూ.220 కోట్లతో పనులు ప్రారంభించారు. ఆ నేత బతికుండగా 30 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి చూస్తున్నాం. 

వైఎస్సార్‌సీపీలో బీజేపీ నేతల చేరిక 
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు, ఆయన భార్య బీజేపీ జిల్లా యువ మోర్చా మహిళా మాజీ అధ్యక్షురాలు ముద్దాడ వెంకట రమణీయమ్మలు సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

బాబు బినామీల కోసమే భోగాపురం ఎయిర్‌పోర్టు 
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ గురించి మనందరికీ తెలుసు. ఎయిర్‌పోర్టు చుట్టూ చంద్రబాబు నాయుడు బినామీలకు భూములున్నాయి. ఆయన కొలువులో మంత్రిగా పని చేస్తున్న వ్యక్తికి, ఆయన హయాంలో ఎంపీగా ఉన్న వ్యక్తికీ భూములున్నాయి. కానీ వాటిని ముట్టుకోరు. రైతుల భూములు మాత్రం బలవంతంగా లాక్కుంటారు. అలా లాక్కున్నా అక్కడ ఎయిర్‌పోర్టు కట్టాడా? అదీ లేదు. ఎయిర్‌పోర్టు కట్టడానికి టెండర్లు పిలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అతి తక్కువ కోట్‌ చేసి, పనులు చేజిక్కించుకుంది. కానీ వాళ్లు లంచాలు ఇవ్వరని తెలిసి చంద్రబాబు ఆ టెండర్లను రద్దు చేశాడు. దేశం మొత్తంలో 130పైగా ఉంటే,  126 ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నడుపుతోంది. అలాంటి సంస్థకు టెండర్‌ వస్తే రద్దు చేశారు. మళ్లీ ఈ పెద్ద మనిషి కొత్త టెండర్లు పిలవడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అర్హత సాధించకుండా నిబంధనలు పెట్టాడు. ఇక్కడున్న పెద్ద మనిషి ఆశోక్‌గజపతి రాజు ఆధ్వర్యంలోనే విమానయాన మంత్రిత్వ శాఖ ఉండేది. ఆయన మంత్రిగా  ఉండగానే ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను పక్కనబెట్టాడు. చంద్రబాబు దగ్గరుండి తన శాఖలోనే అవినీతి చేస్తుంటే ఈ పెద్ద మనిషి ఏమీ అనలేదంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా? నాలుగేళ్లుగా కేంద్రంలో బీజేపీతో సంసారం చేశాడు. చిలకా గోరింకల్లా కాపురం చేశాడు. అశోక్‌గజపతి రాజు కేంద్ర కేబినేట్‌లో ఉన్నాడు. కానీ మనకిచ్చిన గిరిజన యూనివర్సిటీ హామీ గురించి ఏ కేబినేట్‌లోనూ అశోక్‌గజపతిరాజు మాట్లాడలేదు. రైల్వే జోన్‌ గురించి మాట్లాడిన పాపానపోలేదు. ప్రత్యేక హోదా ఎందుకివ్వడం లేదని అడగనే అడగడు.  

విజయనగరం కోలగట్లకే 
విజయనగరంలో మొట్ట మొదట అసెంబ్లీ సీటును ప్రకటిస్తున్నాను. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం స్థానం నుంచి పోటీ చేస్తారు. ఆయన మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు ఆయనపై, పార్టీపై, నాపైనా ఉంచాలని కోరుతున్నా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement