సాక్షి, రాయవరం : అధికారంలోకి రాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఇళ్ల స్థలంతో పాటు, ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంతో సోమవారం 209వ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై మండి పడ్డారు. ఎన్నికలకు ఆరు నెలల ముందుగా డ్రామాతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సభలో జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
నాలుగేళ్లుగా మోసాలు.. అవినీతి
‘నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, మోసాలతో ముగిసింది. మట్టి, ఇసుకతో సహా అన్నింటిలోను దోపిడీ చేశారు. నీరు-చెట్టు పథకం ద్వారా మట్టిని కూడా దోచేశారు. పేదలను కూడా వదలకుండా దోచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత నేత వైఎస్సార్ హయంలో మండపేట నియోజక వర్గంలో 14 వేల ఇళ్లు కట్టించారు. ఇళ్లస్థలాలను అందించారు. వైఎస్సార్ పేదల కోసం సేకరించిన స్థలాలలో ఇప్పుడు బాబు అవినీతి ప్లాట్లు నిర్మిస్తామంటున్నారు. అడుగుకు రూ. వెయ్యి అయ్యే ప్లాటును బాబు 2వేల రూపాయలకు అమ్ముతాడట. మూడు లక్షలు అయ్యే ప్లాటును బాబు 6లక్షలకు అమ్ముతాడట. మూడు లక్షలు ప్రభుత్వం మాఫీ చేయగా.. మరో 3 లక్షలు పేద ప్రజలు 20 ఏళ్ల వరకూ నెలకు రూ.3 వేలు కట్టాలట. మీకు ప్లాటు ఇస్తే కాదనకుండా బంగారంలా తీసుకోండి. అధికారంలోకి రాగానే ఆ డబ్బులను మాఫీ చేస్తాం. ఎన్నికల సమయంలో రూ. 87వేల 612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బాబు ఇచ్చిన డబ్బుతో వడ్డీలు కూడా మాఫీ కాలేదు. పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నారు..కానీ రూపాయి కూడా మాఫీ చేయలేదు’ అని ఆరోపించారు.
వారికి మాత్రమే ఇసుక ఫ్రీ
రాష్ర్ట వ్యాప్తంగా ఇసుకదోపిడీని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పోలీసులు దగ్గర ఉండి మరీ లారీలలో ఇసుకను రవాణ చేయిస్తున్నారు. ఏ కలెక్టరూ వాటిని అడ్డుకోరు. కోట్ల కొద్ది లంచాలు తీసుకుంటూ ఇసుకను తరలిస్తున్నారు. పేరుకేమో ఇసుక ఫ్రీ అంటుంన్నారు. ఎవరికైనా ఫ్రీగా వస్తుందా..? ప్రతి పేదవాడు లారీ ఇసుకను 7వేల నుంచి 12వేలకు పెట్టి కొంటున్నాడు. కేవలం చంద్రబాబుతో లంచాలను పంచుకునేవారికి మాత్రమే ఫ్రీగా వస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇసుక ప్రక్షాళన చేస్తామని మాయ మాటలు చెబుతున్నారు.
కోడి కూర పెడతాడట
నాలుగేళ్లుగా మెస్ ఛార్జీలను పెంచలేని చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు విద్యార్థులకు కోడి కూర పెడతామని అంటున్నారు. అదిగో అన్నాక్యాంటీన్లు అంటూ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం రావాలంటే బాబు అధికారంలోకి రావాలి అన్నారు. వచ్చాయా ఇప్పుడు..? ఆయన అధికారంలోకి వచ్చారు కానీ అక్కా చెల్లెళ్ల మంగళసూత్రాలు మాత్రం ఇంటికి రాలేదు. బ్యాంకుల్లోని బంగారం రాలేదు కానీ ఇంటికి మాత్రం నోటీసులు వచ్చాయి.
హామీలు నెరవేర్చకుంటే రాజీనామా చేయాలి
నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన చూశాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎలాంటి నాయకుడు అవసరమో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసే వాడు మనకు నాయకుడుగా కావాలా? చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత తీసుకు రావాలి. నిజాయితీ తీసుకు రావాలి. ప్రజలు ఇచ్చిన హామీలను నాయకుడు నెరవేర్చకుంటే సిగ్గుతో రాజీనామా చేసే వ్యవస్థను రూపొందించాలి. ఇవి జరగాలంటే జగన్ ఒక్కడి వల్లే సాధ్యం కాదు. నాకు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అపుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారుతుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. చంద్రబాబును క్షమిస్తే.. తాను ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశానని చెప్పి మన చెవుల్లో క్యాలీఫ్లవర్ పెట్టే యత్నం చేస్తారు. చిన్న అబద్ధాలు, మోసాలకు నమ్మరని ఇంటికి కేజీ బంగారం, ఒక బెంజీ కారు ఇస్తానని వాగ్దానం చేస్తారు. కానీ అది మీరు నమ్మరని ప్రతి ఇంటికీ మహిళా సాధికార మిత్రలను పంపుతాడు. వారు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిందే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓట్లేయండి. అబద్ధాలు చెప్పే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు తీసుకు రండి. మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం’’ అని వైఎస్ జగన్ అన్నారు.
మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం..
- సీపీఎస్‌ను రద్దు చేస్తాం
- ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లను ఇస్తాం
- డీఏలు సమయానికి అందేలా చూస్తాం
- ఇళ్ల ప్లాట్‌కు కట్టాల్సిన డబ్బును మాఫీ చేస్తాం
- పేదవాడి పిల్లలకు ఉచిత విద్యను అందిస్తాం
- హాస్టల్ మెస్ ఛార్జీకోసం ఏడాదికి రూ.20వేలు అందిస్తాం
- పాఠశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఏడాదికి రూ.15వేలు అందిస్తాం
Comments
Please login to add a commentAdd a comment