సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తారనే నమ్మకముందని ఉద్యోగులు తెలిపారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం కొత్తపెంట వద్ద వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్యోగులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వినతి పత్రం కూడా అందజేశారు. వైఎస్ జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నమ్ముతున్నామని పేర్కొన్నారు. తమ సమస్యల కోసం ఉద్యమం చేస్తుంటే టీడీపీ సర్కార్ ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి తమను అక్రమ అరెస్ట్‌లు చేయిస్తుందని తెలిపారు.
253వ రోజు ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కోడా సింహాద్రి వైఎస్ జగన్‌ను కలిశారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమస్యలను ఆయన జననేతకు వివరించారు. మరోవైపు మాడుగులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
చిన్నారుల చేత ఉట్టి కొట్టించిన వైఎస్ జగన్
కొత్తపెంటలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. బాలకృష్ణుడి వేషధారణలో ఉన్న పలువురు చిన్నారులు ఆయన్ని కలిశారు. వారితో కలిసి వైఎస్ జగన్ ఉత్సవంలో పాల్గొన్నారు. కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఆయన ఉట్టి కొట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment