అక్కచెల్లెమ్మలకు మంచి రోజులు ఖాయం | YS Jagan Mohan Reddy Promise To Dwcra Groups | Sakshi
Sakshi News home page

నవరత్నాలతో కొత్త వెలుగు

Published Sat, Mar 30 2019 9:17 AM | Last Updated on Sat, Mar 30 2019 11:13 AM

YS Jagan Mohan Reddy Promise To Dwcra Groups - Sakshi

డ్వాక్రా మహిళలను ఐదేళ్లుగా నమ్మించి ముంచారు పాలకులు. బేషరతుగారుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి.. వడ్డీ గుంజుతున్నారు. ఎన్నికలు రాగానే ‘పసుపు కుంకుమ’ అంటూ.. ఆడపడుచులను మళ్లీ వంచించేందుకు సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా పల్లె పల్లెలో మహిళలతో స్వయంగా మాట్లాడి.. వారి సాదకబాధకాలు తెలుసుకున్న జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి... అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ప్రకటించారు. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా.. ప్రతి డ్వాక్రా మహిళకు 2019 ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తం ఆమె చేతికే ఇస్తానని హామీ ఇచ్చారు. తద్వారా ప్రతి డ్వాక్రా మహిళకు కనీసం రూ.50వేల నుంచి రూ.70 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సున్నా వడ్డీల విప్లవం తెస్తానని వాగ్దానం చేసారు. జగన్‌ మాటంటే మాటేనని.. తమ జీవితాల్లో వెలుగులు ఖాయమని సంబరపడుతున్నారు రాష్ట్రంలోని లక్షలాది మంది అక్కచెల్లెమ్మలు!!

వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాల్లో.. అక్కచెల్లె్లమ్మల చేతికే ఇస్తానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానని జననేత హామీ ఇవ్వడంపై మహిళల్లో సంతోషం కనిపిస్తోంది. రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా.. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రకటించడాన్ని మహిళలు స్వాగతిస్తున్నారు. 

నేరుగా మహిళల చేతికే డబ్బు
2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల పేరిట ఉన్న అప్పుల మొత్తాన్ని తాను అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరం నుంచి నాలుగు దఫాల్లో చెల్లిస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ డబ్బులను కూడా బ్యాంకుల్లో జమ చేయడం కాకుండా.. నేరుగా మహిళల చేతికే ఇస్తామని 2017 జూలైలో జరిగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారు. జగన్‌ హామీతో బెంబేలెత్తిన చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలను మభ్యపెట్టడానికి హడావుడిగా పసుపు–కుంకుమ పథకం తెచ్చారు. 

90 లక్షల మందికిరూ.27 వేల కోట్ల పైనే ప్రయోజనం
2019 జనవరిలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వివరాల ప్రకారం–రాష్ట్రంలో 9,67,620 రుణ ఖాతాల ద్వారా డ్వాక్రా సంఘాల పేరిట రూ.25,424కోట్లు అప్పు ఉంది.  2018 సెప్టెంబరు నెలాఖరుతో ముగిసిన త్రైమాసికం గణాంకాలు మాత్రమే ఆ బ్యాంకర్ల సమావేశంలో చర్చకు వచ్చాయి. వైఎస్‌ జగన్‌ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా వారి చేతికే ఇస్తామని చెప్పారు. ఆ మేరకు ఉన్న అప్పు, వడ్డీలు అన్నీ కలుపుకొని మొత్తం రూ.27వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాల అంచనా. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 95 లక్షల మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ.. బ్యాంకు రుణాలు పొందిన డ్వాక్రా సంఘాల్లో 90లక్షల మంది సభ్యులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు  వైఎస్సార్‌ ఆసరా పథకంతో.. 90లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్లకు పైగానే ప్రయోజనం చేకూరుతుంది.   

అక్కచెల్లెమ్మలకు జగన్‌ హామీ..
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తారు.
సున్నా వడ్డీకే రుణాలవిప్లవం తెస్తారు.  
ఆ వడ్డీ డబ్బులను మహిళల తరఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేఏర్పాటు చేస్తారు.
45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ అక్కలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా రూ.75వేలు ఉచితంగా అందిస్తారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా అందజేస్తారు.  

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ
పరిధిలోని కనుగుపూడి గ్రామ సమాఖ్య–4 పరిధిలో.. అగ్ని మారెమ్మ మహిళా సమాఖ్య పొదుపు సంఘం పేరిట కుప్పం కెనరా బ్యాంకులో 2714225001113 ఖాతా నెంబరులో అప్పు ఉంది. 2018 డిసెంబరు 4వ తేదీ నాటికి ఆ అప్పు రూ.6.50 లక్షలు ఉంది. సంఘంలో మొత్తం 9 మంది
మహిళలు సభ్యులుగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన వైఎస్సార్‌ ఆసరా ద్వారా ఆ సంఘానికి రూ.6.50 లక్షల లబ్ధి
చేకూరుతుంది. సంఘంలోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.72 వేల చొప్పున నేరుగా చేతికి అందుతుంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ‘ఉండి క్రాంతి’ గ్రామ సమాఖ్య పరిధిలోని కనకదుర్గ డ్వాక్రా సంఘం.. అక్కడి ఆంధ్రా బ్యాంకులో 058013100026458 ఖాతా నెంబరులో రుణం తీసుకుంది. 2018 నవంబరు 28వ తేదీ నాటికి ఆ సంఘం పేరిట రూ.5 లక్షల అప్పు ఉంది. ఆ సంఘంలో మొత్తం పది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ అమలు ద్వారా.. కనకదుర్గ డ్వాక్రా సంఘానికి రూ.5లక్షల లబ్ధి చేకూరుతుంది. అంటే.. సంఘంలోని ఒక్కొక్క సభ్యురాలికి రూ.50వేల మేర ప్రయోజనం అందుతుంది.  

మొన్న..1995 –2004   బాబు చీకటి పాలన
గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం 1982–83లో డ్వాక్రా(డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌) పథకాన్ని  దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో ప్రారంభించి.. 1994–95 నాటి కల్లా అన్ని జిల్లాలకు విస్తరించింది. వాస్తవం ఇలా ఉంటే.. డ్వాక్రా సంఘాలకు ఆద్యుడిని తానేనని పదే పదే  చెప్పుకునే చంద్రబాబు పాలనలో.. డ్వాక్రా మహిళలకు ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెట్టేవి. బ్యాంకులో ఖాతా తెరవడం దగ్గరన్నుంచి రుణం మంజూరు వరకూ.. అడుగడుగునా అవాంతరాలే. ఏదో రకంగా రుణం మంజూరైతే.. అది తిరిగి చెల్లించే వరకూ వెంటపడే పరిస్థితి. ఆ విధంగా డ్వాక్రా సంఘాలు ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా చంద్రబాబు చీకటి పాలన నాడు.  

నిన్న.. 2004–2009  వైఎస్‌ స్వర్ణయుగం
2004లో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న లక్ష్యంతో.. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ పథకానికి రూపకల్పన చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనమై.. పెద్ద సంఖ్యలో మహిళలు పొదుపు సంఘాల్లో చేరారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు పిలిచి రుణాలు ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. ఫలితంగా లక్షలాది మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేరి ప్రభుత్వ తోడ్పాటుతో.. ఆర్థికంగా పరిపుష్టి సాధించారు. అవి వైఎస్‌ స్వర్ణయుగం రోజులు.

నేడు..2014–2019   బాబు నమ్మించి మోసం
2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు, నిశ్చింతగా ఉండండి అంటూ నమ్మబలికారు. నిజమని నమ్మిన డ్వాక్రా మహిళలు అప్పులు చెల్లించడం ఆపేశారు. తీరా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రుణమాఫీ ఊసే ఎత్తలేదు. మరోవైపు అప్పులు కట్టాల్సిందేనంటూ బ్యాంకులు ఒత్తిడిచేయడంతోపాటు అవమానాలకు గురిచేస్తుండటంతో.. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాల్సిన దుస్థితి. అప్పులు పెరిగిపోయి.. అధిక వడ్డీల భారంతో మహిళలు కన్నీటిపర్యంతం.. నమ్మించి మోసం చేశారని ఆవేదన..

రేపు.. అక్కచెల్లెమ్మలకు  జగన్‌ అండ
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానన్నారు. ఆ వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించే ఏర్పాటు చేస్తారు. వైఎస్సార్‌ ఆసరా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని జగన్‌ హామీ ఇవ్వడంపై లక్షల మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు మాఫీ.. పచ్చి మోసం
నా పేరు ఈ.జ్యోతి. మాది చిత్తూరు జిల్లా బి.కొత్తకోట. నేను భరత్‌ మహిళా సంఘంలో సభ్యురాల్ని. 2013 సెప్టెంబర్‌లో సంఘానికి మంజూరైన రూ.5లక్షల రుణంలో నేను రూ.50వేల రుణం తీసుకున్నా. నెలవారీ రుణ కంతు రూ.1,600 చెల్లిస్తున్నా. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మేం తీసుకొన్న రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన 2014 జూన్‌ వరకు 14,400 కంతుల రుణం, రూ.3,687 వడ్డీని బ్యాంకుకు చెల్లించాను. ఇక మిగిలింది రూ.35,600 రుణం, దానికయ్యే వడ్డీని చంద్రబాబు మాఫీ చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు పసుపుకుంకుమ పేరుతో రూ.10వేలు ఇచ్చినా.. మిగిలిన రూ.30వేలు మాఫీ చేయకుండా మోసమే చేశారు. ఇందులోనూ రూ.6వేలే  చేతికందింది. పసుపుకుంకుమ సొమ్ముకూడా అప్పేనని చెప్పుకొంటున్నారు. వడ్డీలేని రుణాలు కూడా మోసమే. 2016 అక్టోబర్‌లో సంఘానికి రూ.7.50లక్షల రుణం మంజూరైంది. ఇందులో నేను రూ.75వేల రుణం తీసుకున్నా. ప్రతినెలా రూ.3వేలు కంతు కట్టి రుణం మొత్తం చెల్లించి, దానికి రూ.11,160 వడ్డీ చెల్లించాను. ఈ వడ్డీని ప్రభుత్వం ఇప్పటిదాక చెల్లించలేదు. ప్రభుత్వం మహిళలు తీసుకొన్న రుణాలు మాఫీ చేయకుండా నిలువునా మోసం చేసింది. రుణమాఫీ లేదు, వడ్డీలేకుండా రుణం ఇస్తున్నది లేదు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల రుణాలను మాఫీ చేసి నాలుగు విడతల్లో చేతికే ఇస్తామని మాటిచ్చారు. ఈ మాటమీద మాకు నమ్మకముంది. అధికారం కోసం చంద్రబాబులా నమ్మించి మోసం చేయరన్నది మా విశ్వాసం. అందుకే నమ్ముతున్నాం – ఈ.జ్యోతి, చిత్తూరు జిల్లా బి.కొత్తకోట.

మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం
2014 ఎన్నికలప్పుడు  డ్వాక్రా రుణాలన్ని బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు.. ఏ ఒక్క డ్వాక్రా సంఘం అప్పులో కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి పసుపు–కుంకుమ పథకం అంటూ హడావుడి చేస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. మరోవైపు పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేస్తున్నారని వాపోతున్నారు. అంతర్గత సర్క్యులర్‌ ప్రకారం–ప్రభుత్వం పసుపు–కుంకుమ చెక్కులను మహిళలకు అప్పుగా ఇస్తూ.. ఎన్నికలు వచ్చాయని టీడీపీ నేతలు దానిని ఉచితమని ప్రచారం చేసుకుంటున్నారని మహిళా సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఇచ్చేది ఉచితమైతే నేరుగా మహిళల చేతికి డబ్బులు ఇవ్వకుండా.. పొదుపు సంఘంలోని సభ్యులందరికి కలిపి ఉన్న ఖాతాలో ఎందుకు జమ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు వేర్వేరుగా ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు.  

ఆర్థికాభివృద్ధికి తొలిమెట్టు  
డ్వాక్రా రుణాల మొత్తాలను చెల్లించడం, వడ్డీ లేని రుణాలు అందించడం  మహిళల ఆర్థికాభివృద్ధికి తొలిమెట్టు అవుతుంది. నాలుగు విడతల్లో రుణాల మొత్తాలను తిరిగి అందించి, వడ్డీలను కూడా చెల్లిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన భరోసా.. ప్రతి డ్వాక్రా మహిళలో ఆత్మస్థైర్యం నింపినట్లయింది. మాటతప్పకుండా హామీని నెరవేర్చుతారనే నమ్మకం మాలో ఉంది. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తున్నాడని మహిళలు భావిస్తున్నారు. – హైమావతి, చిత్తూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement