సాక్షి, గుంటూరు: ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు, ఆయన పాట్నర్ యాక్టర్ (పవన్ కళ్యాణ్) కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎవరికి చెబితే ఆ యాక్టర్ వారికే టికెట్లు ఇస్తున్నారని, ముసుగు కప్పుకుని టీడీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి కూడా డిపాజిట్లు రావని తెలిసి టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి ఎంటో చెప్పకుండా.. చంద్రబాబు నాయుడు ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో మహిళలకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలలేదని, మహిళలకు కనీసం రక్షణ కూడా కరువైందని అన్నారు. డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజినీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘సుధీర్ఘ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు పాలన ఏవిధంగా ఉందో చూశాను. అన్ని వర్గాల ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. స్థానిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. పేదల సొమ్మును దోచుకున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. ఐదేళ్ల కాలంలో రూ.600 కోట్లు దోచుకున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలను ఇచ్చారు. ముఖ్యంగా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి.. నిలువునా ముంచారు. మహిళలు, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదగాలి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది. చంద్రబాబు పాలనతో మోసపోయిన ప్రతిఒక్కరికి మాట ఇస్తున్న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాం.
అలా చేయకపోతే ఓట్లు అడగం..
93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు అండగా ఉంటాం. పావలా వడ్డీకే రుణాల ఇస్తాం. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం. వైఎస్సార్ కలలను సాకారం చేస్తాం. వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలకు 75వేల ఆర్థిక సహాయం చేస్తాం. చంద్రబాబు పాలనలో ప్రతి గ్రామంలోకి మద్యంషాపులను తీసుకొచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు విడతల్లో మద్యం పూర్గిగా నిషేధిస్తాం. అలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను. ఆర్థికంగా వెనుకబడినవారు పిల్లల్ని చదించలేని పరిస్థితి. వారందరికీ నేను ఉన్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత పిల్లల్ని బడికి పంపిస్తే చాలు ఏడాదికి 15వేలు అందిస్తాం. ఆర్థికంగా చదువుకునే స్తోమత లేనివారిని ఇంజనీరింగ్, డాక్టర్ చదవులను చదవిస్తాం. వారందరి కుటుంబంలో చిరునవ్వు చూడటటే నా లక్ష్యం. మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు అబద్ధాలతో మరోసారి మోసం చేయడానికి వస్తున్నాడు. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు. అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.
లా అండ్‌ఆర్డర్ ఎక్కడా?
ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారు. హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు. ఆయనే చంపించి హత్యను చిత్రీకరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాపాడుకోవడానికి చంద్రబాబు కుట్రలు అనేక చేస్తున్నారు. ఆయన మోసాలను ప్రజలందరూ గమనించాలి. ఎన్నికల ముందు ఆయనిచ్చే మూడు వేలు తీసుకోని మరోసారి మోసపోవద్దు. చంద్రబాబు పాలనలో లా అండ్ ఆర్డర్ పనిచేయదు. ప్రభుత్వ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేయి చేసుకున్నా చర్యలు తీసుకోరు. రిషితేశ్వరి అనే యువతి హత‍్య జరిగినా కనీసం విచారణ కూడా చేపట్టరు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలను రక్షణ లేకుండా పోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే లా అండ్ ఆర్డర్‌ను అదుపులో పెడతాం. మహిళ రక్షణకు కఠిన చట్టాలను తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment