
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌పై కొద్ది రోజులుగా పార్లమెంట్‌లో ఎంపీలు పోరాటం చేస్తుండటం, ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రజా సంకల్ప యాత్రలో తాను విడిది చేసిన శిబిరం వద్ద సోమవారం వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో సమావేశమవుతారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ఈ భేటీ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ప్రధానంగా ప్రత్యేక హోదా డిమాండ్‌ను మరింత ఉధృతం చేయడం, హోదాకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టడం, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఎంపీలకు సలహాలు, సూచనలివ్వనున్నారు.