పాదయాత్రలో జగన్‌తో కలసి నడుస్తున్న రైతు
ప్రజా సంకల్ప యాత్ర నుంచిసాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘నాన్న ఉన్నప్పుడు అంతా బాగుంది.. పంటలు బాగా పండాయి.. మంచినీళ్లకు ఇబ్బంది రాలేదు.. ముసలి వాళ్లకు పింఛన్లు ఇచ్చారు.. రోగులకు వైద్యం చేయించారు.. ఎవరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చారయ్యా.. అలాంటి మనసున్న వాళ్లు కావాలయ్యా.. అలాంటి రామరాజ్యం రావాలంటే నువ్వు ముఖ్యమంత్రి కావాలయ్యా’అని ఓ వృద్ధురాలు పల్లకి హనుమాయమ్మ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎదుట తన ఆకాంక్షను వెలిబుచ్చింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం 104వ రోజు ఆయన ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు.
ఈ సందర్భంగా దారిపొడవునా పలు చోట్ల మహిళలు గుమ్మడి కాయలపై కర్పూరం వెలిగించి దిష్టితీశారు. వివిధ వర్గాల ప్రజలు జగన్‌తో తమ సమస్యలు చెప్పుకున్నారు. జె.పంగులూరు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన హనుమాయమ్మ వైఎస్ పాలనను గుర్తు చేస్తూ.. ప్రస్తుత ఇబ్బందులను ఏకరువుపెట్టింది. నాగులపాడు వద్ద జగన్ 1400 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. అందుకు గుర్తుగా అక్కడ రావి మొక్కను నాటారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. వెంకటాపురంలో అద్దంకి చైతన్య మహిళా మండలికి చెందిన చెవుడు, మూగ పాఠశాల విద్యార్థులు జగన్‌ను కలిసి యాత్రకు మద్దతు ప్రకటించారు.
వైద్యుల సంఘీభావం
ఫిజియో థెరపిస్ట్‌లు పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు’అంటూ ప్లకార్డులు పట్టుకొని జగన్‌తో కలిసి కొద్దిదూరం నడిచారు. ఫిజియో థెరపీని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొల్లం దీపక్ సాహిత్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎల్ అరుణ్‌కుమార్‌లు కోరారు. అలవలపాడులో ఇటుకబట్టీ కార్మికులు జగన్‌కు తమ సమస్యలు వివరించారు.
శనగ, పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేదని పంటను జగన్‌కు చూపించి రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ ప్రాంతంలో శనగ ఎక్కువగా పండిస్తున్నామని, దళారులు దోచుకోవడం తప్ప రైతన్నకు న్యాయం జరగటం లేదన్నారు. పాదయాత్రలో వైద్య విభాగం ప్రతినిధులు జగన్‌ను కలిశారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment