
58వ రోజు
10–01–2018, బుధవారం
గుండుపల్లి,
చిత్తూరు జిల్లా
ఉదయం నడక ప్రారంభించే సమయానికి వాతావరణం చాలా చల్లగా అనిపించింది. అల్పపీడన ప్రభావం ఈ రోజు కూడా కొనసాగినట్లుంది. జెట్టివానిఒడ్డు సమీపంలో మోపిరెడ్డిపల్లెకు చెందిన కొందరు రైతులు వినతిపత్రంతో నా వద్దకు వచ్చి ‘అన్నా.. మా పొలాల్లో బోరు వేసుకున్నాం. నీళ్లు పడ్డాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి, డబ్బులు కూడా చెల్లించి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకూ కరెంటు రాలేదు. పొలాలను బీడు పెట్టుకుంటున్నాం’ అన్నారు. ‘కరెంటు కనెక్షన్ల కోసం అధికారుల చుట్టూ చాలాసార్లు తిరిగాం. కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చాం. మంత్రి గారికి కూడా మొరపెట్టుకున్నాం. వచ్చే నెల, ఇంకో నెల అంటూ తిప్పుకొంటున్నారు.. ఫలితం మాత్రం లేదు’ అని వాపోయారు.
ఈ పాదయాత్రలో ఇదే విషయాన్ని దాదాపు 40 నుంచి 50 మంది రైతులు నా వద్ద ప్రస్తావించారు. ఏమిటీ రైతుల దయనీయ పరిస్థితి? విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రుణాలు, గిట్టుబాటు ధర.. అన్నీ సమస్యలే. ఈ ఇబ్బందులన్నీ తట్టుకుని ఏదో విధంగా కష్టపడి సేద్యం చేసుకుందామనుకుంటే.. కరెంటు కనెక్షన్లు ఇవ్వడంలేదట. ఏ ప్రభుత్వమైనా వ్యవసాయానికి పెద్దపీట వేయాలి. రైతుల వ్యవసాయ కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో తాగునీటి వసతులు లేని, వర్షాధార ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. కనెక్షన్ల కోసం డబ్బులు కట్టించుకుని, ఏళ్ల తరబడి మంజూరు చేయకపోవడం ఏమిటి? లక్షల్లో విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఏం చేయాలనుకుంటోంది? ఉచిత విద్యుత్ పథకం ఏమైంది? ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా మిగతా పథకాల్లాగా నిర్వీర్యం చేయాలనుకుంటోందా?
సాయంత్రం శిబిరానికి చేరేముందు ఓ కౌలు రైతు నన్ను తన బెల్లం బట్టీ వద్దకు తీసుకెళ్లాడు. ఆయన పేరు ఆర్ముగం. ఆయన ఒక ఎకరం పొలం కౌలుకు తీసుకుని, రూ.50 వేలు అప్పుచేసి చెరకు వేశాడట. విత్తనం వేసిన మొదట్లో వర్షాల్లేక, ఆ తర్వాత పంటకు తెగులు సోకి.. ఈ సంవత్సరం దిగుబడి బాగా తగ్గిపోయిందట. నిరుడు ఎనిమిది బండ్లు దాకా అయిన దిగుబడి ఈసారి ఐదు బండ్ల కన్నా మించకపోవచ్చట. బెల్లం మీద ఆంక్షల వల్ల రేటు కూడా తగ్గిపోయిందట. లక్ష రూపాయలు కూడా ఆదాయం రాకపోవచ్చట. అందులో దాదాపు రూ.50 వేలు కౌలు చెల్లిస్తే.. ఇక అప్పు ఎలా తీర్చాలి? తామెలా బతకాలంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.
‘కష్టపడి వండిన బెల్లాన్ని అమ్ముకోడానికి లేకుండా ఆంక్షలు విధించడంతో, కొనేవాడు ముందుకు రాకపోవడంతో, వచ్చిన కాడికి తెగనమ్మి తీవ్రంగా నష్టపోయాను’ అన్నాడు. ‘ఈ కష్టాలన్నీ తెలిసి కూడా చెరకు ఎందుకు వేశావన్నా..’ అని అడిగాను. ‘ఏం చేయాలన్నా.. నేను కౌలు రైతునని ఏ బ్యాంకూ నాకు రుణం ఇవ్వలేదు. ప్రయివేటు వ్యక్తుల వద్ద ప్రయత్నం చేస్తే.. ఒక్క బెల్లం వ్యాపారి తప్ప వేరే ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో చెరకు పంట వేసుకోవాల్సి వచ్చింది’ అన్నాడు. ఇది ఎంత అన్యాయం?
ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కౌలు రైతులు ఇదే రకంగా బ్యాంకు అప్పులు అందక, ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేసి, భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తే.. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల పాలై.. అటు కౌలు కట్టలేక, ఇటు అప్పు తీర్చలేక నలిగిపోతున్నారు. కౌలు రైతుకు బ్యాంకు రుణం ఇప్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కౌలు రైతులున్నారు. వారిలో కనీసం పదిశాతం మందికైనా బ్యాంకు రుణం ఇప్పించగలిగారా? అసలు కౌలు రైతుల సమస్యలు మీకు తెలుసా? తెలిసినా తెలియనట్టు నిద్ర నటిస్తున్నారా?
గుండుపల్లి వద్ద బెల్లం వండుతూ చెరకు రైతుల సమస్యలు వింటున్న వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment