సాక్షి, ఏలూరు : బీసీల దశదిశ మార్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇచ్చిన మాట తప్పని నైజం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానిదని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన మహాసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. ‘ మహానేత వైఎస్‌ఆర్ హయంలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట తప్పని తత్వం వైఎస్‌ఆర్ కుటుంబానిది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో అన్ని వర్గాలు ఉన్నత చదువులు కొనసాగించేలా వైఎస్సార్ ఆ పథకం ప్రవేశపెట్టారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని వైఎస్సార్ గుర్తించే ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించాలి.
ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో సుమారు 110 హామీలు ఇచ్చినా, అందులో ఒక‍్కటి కూడా అమలు చేయలేదు. అమలుకానీ హామీలతో చంద్రబాబు బీసీలను మోసం చేశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు బీసీల మభ్యపెడుతున్నారు. ప్రస్తుతం కుల వృత్తులన్నీ మరుగునపడుతున్నాయి. ఎస్సీ కమిషన్‌కు ఉండే అధికారాలే బీసీ కమిషన్‌కు కూడా ఉండాలి. నామమాత్రపు బీసీ కమిషన్‌ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వెనుకబడిన కులాల జనగణన జరిగితేనే బీసీలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు హయాంలో వెనకబడిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన 40 కులాలకు ఏం చేసిందో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment