
సాక్షి, కోటవురట్ల(విశాఖ జిల్లా): సీఎం చంద్రబాబు ఐదు పార్టీలను పెళ్లి చేసుకుని వదిలేశారని.. తాజాగా కాంగ్రెస్‌తో పెళ్లికి సిద్దమయ్యారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ జిల్లాలో 241వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన కోటవురట్ల బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఆయన ప్రసంగం ఇలా కొనసాగింది. ‘బాబు పాలనలో చెరకు రైతులు బాధపడుతున్నారు. అదేంటో ఆయన సీఎం కాగానే షుగర్ ఫ్యాక్టరీలు నష్టాల బాట పడుతాయి. ఇప్పటికే జిల్లాలోని మూడు షుగర్ ఫ్యాక్టరీలను మూసేశారు. తాండవ, ఏటికొప్పాక, చోడవరం షుగర్ ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉన్నాయి. చంద్రబాబు ఒక కథ ప్రకారం అన్నింటిని నష్టాల బాట పట్టిస్తారు. ఏటికొప్పాక ఫ్యాక్టరీ 5 వేల మంది చెరకు రైతులకు బకాయి పడింది. దివంగత నేత వైఎస్‌ఆర్ తన హయాంలో టన్ను చెరుకుకు రూ.300 నుంచి రూ.750 వరకు రాయితీ ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో చెరుకు రైతులు నానావస్థలు పడుతున్నారు.
ఇరువై కోట్లు దోచేశారు..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం ప్రజల ఖర్మ. ఊసరవెల్లి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు రంగులు మారుస్తారు. విశాఖ తర్వాత అధిక భూ అక్రమాలు పాయకరావు పేటలోనే జరిగాయి. మానవత్వం లేని ప్రభుత్వం చంద్రబాబు సర్కార్. భూములు అత్తగారి ఆస్తులన్నట్లు టీడీపీ నేతలు కాజేస్తున్నారు. వరాహా, తాండవ నదుల్లో ఇసుకను తోడేస్తున్నారు. నీరు-చెట్టు కింద రూ.20 కోట్లు దోచుకున్నారు. పాయకరావుపేట నియోజక వర్గంలో ఆ మహానేత వైఎస్‌ఆర్ 20 వేల ఇళ్లు కట్టించారు. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఐదు ఇళ్లు కూడా కట్టించలేదు. నక్కపల్లి ఆస్పత్రిలో ఐదుగురు డాక్టర్లు కూడా లేని పరిస్థితి. ఆ ఆస్పత్రిలో కనీసం మందులు కూడా లేవు. ఇక్కడి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చరా?( లేదు లేదు అని ప్రజల నుంచి సమాధానం) భూములు లాక్కోవడానికి కేబినేట్ సమావేశం నిర్వహిస్తారు. కానీ ఇవ్వడానికి మాత్రం సమావేశం పెట్టరు.
కాంగ్రెస్‌ను పెళ్లి చేసుకోవడానికి..
గతంలో ఓ ఛానల్‌కు చంద్రబాబు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్‌ను బాయ్‌కాట్ చేయలన్నారు. ఇప్పుడు మాత్రం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారు. రాహుల్ రాయబారం కోసం కుటుంబ సభ్యులను పంపారు. ఇప్పటికే బీజేపీతో పెళ్లి చేసుకున్నారు.. వదిలేశారు. టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఆఖరికి జనసేనను కూడా పెళ్లి చేసుకుని వదిలేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ను కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యారు. బాబు పాలనకు బ్రిటీష్ పాలనకు తేడా ఏమీలేదు. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులు బాదుడే బాదుడు.. పెట్రోల్, డీజిల్ వ్యాట్లు బాదుడే బాదుడు.. లోకేష్ పాకెట్ మనీ కోసం ఛార్జీల బాదుడు. పల్నాడు నుంచి ప్రకాశం జిల్లా వరకు చార్జీల పేరిట దోపిడీ చేస్తున్నారు.
అప్పు-నిప్పు అవుతోంది..
రాష్ట్రంలో అప్పు నిప్పు అవుతోంది. అక్రమ మైనింగ్‌కు చంద్రబాబు డాన్. విశాఖలో సమ్మిట్‌లు పెట్టి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. తీరా చూస్తే ఎవరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. అన్యాయంగా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. దుబారా ఖర్చుల్లో కూడా ఆయనకు వాటా ఉంది. అమరావతి బాండ్లకు రూ.2 వేల కోట్లు వచ్చాయని బాబు అనుకూల మీడియా ఆహా.. ఓహో అంటూ పొగుడుతున్నాయి. 8.9 శాతానికి బాండ్లు తీసుకొచ్చారు. పక్కరాష్ట్రాలు తక్కువ వడ్డీకి బాండ్లు తీసుకొస్తే.. చంద్రబాబు మాత్రం 10.32 శాతానికి బాండ్లు తెచ్చారు. వీటిలో కూడా కొంత ఆయన జేబులోకి వెళ్తోంది. ఈయన పాలనలో లంచాలు లేనిదే ఏ పని జరగదు. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క పర్మినెంట్ ఇటుక పడలేదు. ఏం చేసినా తాత్కలికమే. తాత్కాలిక సెక్రటేరియట్ అడుగుకు రూ.10 వేలు ఇచ్చారు. బయట 3 సెంటిమీటర్ల వర్షం పడితే సెక్రటేరియట్‌లో 6 సెంటీమీటర్ల వర్షం లీక్ అవుతోంది. ఆయన నాలుగున్నరేళ్ల పాలనలో అంతా అబద్ధాలు, మోసాలు, అవినీతే ఉన్నాయి.
జగన్ అనే నేను.. సీపీఎస్‌ను రద్దు చేస్తా
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను (సీపీఎస్) రద్దు చేస్తాను. అధికారంలోకి రాగానే చేసే తొలిపని ఇదేనని జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను. రైతన్నకు పెట్టుబడి తగ్గించగలిగితే ఆదాయం పెరుగుతుంది. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. క్రాప్ లోన్లను తీసుకుంటే వడ్డీ భారం లేకుండా చేస్తాం. పెట్టుబడి సాయం కింద ఏటా మే నెలలో రూ. 12500 చెల్లిస్తాం.
ఉచిత బోర్లు.. టాక్స్ మినహాయింపు
రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50కే కరెంట్ ఇస్తాం. పంటలు వేయకముందే మద్దతు ధర ప్రకటించి ఆ మేరకు అన్ని పంటలను కొంటాం. ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తాం. కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. సహకార రంగంలోని పాల కేంద్రాలను పునరుద్ధరిస్తాం. పాడి రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తాం. ఆపరేటివ్ డెయిరీలను పునరుద్ధరిస్తాం. రైతులకు ప్రతి లీటర్‌కు రూ.4 చోప్పున బోనస్ చెల్లిస్తాం. రూ.4 వేల కోట్లతో విపత్తుల నిధి ఏర్పాటు చేసి.. కరువు, వరదల నుంచి రైతులను ఆదుకుంటాం. ప్రమాదవశాత్తు రైతు చనిపోతే ఆ కుటంబానికి రూ. 5 లక్షలు ఇస్తాం. రైతుల ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌లు లేకుండా చేస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామన్నారు.
‘ఎన్నికల సమయంలో డబ్బులిస్తే తీసుకోండి. కానీ ఓట్లు వేసే సమయంలో అబద్ధాల చెప్పే వారిని, మోసాలు చేసేవారిని బంగాళ ఖాతంలో కలిపేయండి. మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి’ అని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment