ప్రజల గుండె చప్పుడు విన్నాను : వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams CM Chandrababu Naidu In Ichapuram Public Meeting | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 9 2019 5:30 PM | Last Updated on Wed, Jan 9 2019 7:09 PM

YS Jagan Slams CM Chandrababu Naidu In Ichapuram Public Meeting - Sakshi

సాక్షి, ఇచ్చాపురం : ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడిని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజలేనని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు.. ఉద్యోగం రాక నిరాశలో ఉన్న యువతను పాదయాత్రలో కలిసానని, వారి గోడును విన్నానని తెలిపారు. ‘ఇలా ప్రతి ఒక్కరిని కదిలిస్తే.. చంద్రబాబు పాలనపై ఏమంటున్నారో తెలుసా..  చంద్రబాబును నమ్మం అంటున్నారు’ అని వైఎస్‌ జగన్‌ తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు.  ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. 

ఇంత ఊహించలేదు..
‘ఇడుపులపాయలో తొలి అడుగువేసినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం లభిస్తుందని ఊహించలేదు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరూ(ప్రజలనుద్దేశించి).. పైనున్న ఆ దేవుడు. నాన్నగారి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రికార్డు స్థాయిలో పాదయాత్ర విజవంతమైందంటే.. మీ ఆశీస్సులేనని నిస్సంకోచంగా చెబుతాను. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంత మందిని కలిసి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర విభజన నష్టం ఒక వైపు.. చంద్రబాబు దోపిడీ మరోవైపు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం ఒక వంకా.. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నైజం మరోవంక. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చేసిన వాగ్ధానాలు. ఆ 600 హామీలు మోసం చేసిన విధానం. ఇవన్నీ చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటిగా మార్చి అడుక్కునే వారికి.. ప్రజలు కష్టాల్లో ఉన్నా.. విపరీతంగా దోచుకుంటున్న చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా? అని అడుగుతున్నా? ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర విషయాలు చెబుతా..

అనంతపురం రైతు శివన్న..
అనంతపురంలో శివన్న అనే రైతు నన్ను కలిశాడు.. రెయిన్‌ గన్‌ల గురించి కంటికి కట్టినట్లు చెప్పాడు. వ్యవసాయం ఎలా కుదేలైందో.. లక్షమంది ఎలా వలుస వెళ్తున్నారో  వివరించాడు. 90వేల అప్పు చేసి తన పొలంలో వేరుశనగ పంట వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. ఇంకేముందన్నా.. బాబుతో కరువు కలిసొచ్చిందన్నా..అని చెప్పాడు. అనంతపురం పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామని, దీనికి ఆయన అయ్యో కరువా? నాకు అధికారులు చెప్పనేలేదని వారిని తిట్టాడని చెప్పాడు. రెయిన్‌గన్‌ల ద్వారా పంటను కాపాడుతానన్నారు. ఆ తర్వాత ఏమైందన్నా.. చంద్రబాబు వచ్చి ఆ రైన్‌ గన్‌ ప్రారంభి.. అలా అలా నాలుగు నీళ్లు చల్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఆయన వెళ్లిపోయాడన్నా.. ఆ సాయంత్రమే అధికారులు వచ్చి రెయిన్‌ గన్‌ పట్టుకుపోయారని .. శివన్నా.. చంద్రబాబుతో దిగిన ఫొటోలు.. పేపర్‌ కట్టింగ్‌లు పట్టుకోని నాకు చూపించాడు. ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేస్తే బస్తా రాలేదన్నా.. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి వడియాలు అమ్ముకుంటున్నా అని తెలిపాడు. ఇక ఈ విషయంపై బహిరంగ సభలో మాట్లాడుతానని మైక్‌ అందుకోని.. క్రిందటి సారి చంద్రబాబుకు ఓటేసా.. మనకు చంద్రబాబు సావాసం వద్దబ్బా అని పిలుపునిచ్చాడు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం జాతీయ రాజకీయాలని కొత్త డ్రామా మొదలుపెడుతాడు. బెంగళూరుకు వెళ్లి కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురం రైతన్నను మాత్రం పట్టించుకోడు. మరుసటి రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్‌తో కలిసి ఇడ్లీ సాంబార్‌ తింటాడు. కానీ పక్కనే ఉన్న సొంత జిల్లా చిత్తూరు రైతులను పట్టించుకోడు. ప్రభుత్వ సొమ్మే కదా అని ప్రైవేట్‌ విమానంలో కోల్‌కతాకు వెళ్లి మమతాబెనర్జీతో చికెన్‌ తింటాడు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోడు.

నమ్మం అంటే నమ్మం బాబు..
రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ ఈ పెద్ద మనషీ నదుల అనుసంధానం అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్‌ వన్‌ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారు. నాబార్డ్‌ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అడుగుతున్నా? (రాలేదు ప్రజల నుంచి సమాధానం.)

దళారీ వ్యవస్థకు కెప్టెన్‌..
హెరిటేజ్‌ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్‌ అయ్యాడు. హెరిటేజ్‌ లాభాల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్‌ చేసి రెండింతల రేట్లకు అమ్ముతున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు చాలా ఫేమస్‌.  ఈ జీడిపప్పును ఇక్కడి రైతులు కేజీ రూ.600కు అమ్ముకోలేని పరిస్థితి. కానీ చంద్రబాబు హెరిటేజ్‌లో కేజీ రూ.1100లకు అమ్ముతున్నారు. ఇలా రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి వారంతా చంద్రబాబు నమ్మం అంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు చెల్లించలేదని మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బందులు దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు తాళిబొట్లు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. 

ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు..
చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. నిరాశలో నిరుద్యోగ యువత ఉన్నారు. బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని, నిరుద్యోగులు నన్ను కలిశారు. బాబు వచ్చాడు.. 30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..? గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్‌ పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. విభజన సమయానికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో మెర 90వేలు ఖాలీ అయ్యాయి. మొత్తం సుమారు 2 లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క  ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. చంద్రబాబు మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. 

ఫీజులు కట్టలేక ఆత్మహత్య..
చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు. 6వేల పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూసించేశారు. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలుగా బిల్లులు చెల్లించని దుస్థితి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గోపాల్‌ అనే వ్యక్తి కలిశాడు. తన కొడుకు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడని, కట్టాల్సిన ఫీజు లక్ష ఉండగా.. రీయింబర్స్‌ మెంట్‌ 30 వేలు ఇచ్చాడన్నా అని ఆవేదన చెందాడు. తొలి ఏడాది అప్పు చేసి రూ. 70వేలు ఫీజు కట్టానన్నాడు. ఫీజులు కట్టలేకపోతున్నానని తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. చంద్రబాబు హయాంలో ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు.

పేదవాడికి వైద్యం అందడం లేదు.. 
చంద్రబాబు పాలనలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ బాధితులుంటే.. కేవలం 1400 మందికి మాత్రమే సాయం చేస్తున్నారు. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్‌ పేషెంట్‌లకు ముష్టి వేసినట్లు రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్‌ చేస్తే.. టైర్‌ పంక్షర్‌ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్‌లు లేక మెంటాడలో బస్సులో ప్రసవించింది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది.

గ్రామాల్లో మాఫియా..
గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఏర్పాటు చేశారు. రేషన్‌ కార్డు, ఇల్లు సహా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్‌ కోసం వృద్ధులు కోర్టుకెళ్లిన పరిస్థితి. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడియే ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబులోభయం పట్టుకుంది. ఆదరణ-2 అంటూ కొత్తనాటాకాలకు తెరలేపుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. 

మీ బిడ్డకు తోడుగా ఉండండి..
ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి.’  అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతిఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఇచ్చాపురంలో వైఎస్‌ జగన్‌ విజయసంకల్పస్థూపం (పైలాన్‌)ను ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement