2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్‌ జగన్‌ | YS Jagan Speech In Palasa Public Meeting | Sakshi
Sakshi News home page

2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : వైఎస్‌ జగన్‌

Published Sat, Mar 23 2019 1:24 PM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

YS Jagan Speech In Palasa Public Meeting - Sakshi

సాక్షి, పలాస(శ్రీకాకుళం) : అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడి పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తామన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే ఇస్తామని, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘మండుతున్న ఎండల్లో కూడా చిక్కటి చిరునవ్వులతో అప్యాయతలను చూపిస్తూ ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరీ ఆత్మీయతకు రెండు చేతులు జోడించి శిరస్సు వహించి నమస్కరిస్తూ.. పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. మీ అందరికి భరోసా ఇచ్చి చెబుతున్నా.. నేను ఉన్నాను.

జీఎస్టీలా టీడీపీ ట్యాక్స్‌..
రాష్ట్రంలో,దేశంలో జీఎస్టీ ట్యాక్స్‌ విన్నామన్నా.. కానీ ఈ పలాసలో టీఎస్టీ అంటూ తెలుగుదేశం వేస్తున్న ట్యాక్స్‌ గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. ఇక్కడి ఎమ్మెల్యే అల్లుడి దోపిడి గురించి చెప్పిన మాటలు విన్నాను. వ్యాపారులపై దాడులు, అధికారులపై వేధింపులు నేను విన్నాను. భావనంపాడు పోర్టులో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మీరు చెప్పిన మాటలు గుర్తుకున్నాయి. తిత్లీ తుఫాను పరిహారం అందలేదని చెప్పిన మాటలు విన్నా. ఆ రోజు మీకు భరోసా ఇస్తూ నేను చెప్పిన మాటలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులకు పరిహారంగా కొబ్బరి చెట్టుకు రూ.3వేలు, హెక్టార్‌ జీడీ తోటకు రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తాం. కిడ్నీ బాధితుల సమస్యలను చూశాను. వారి గాథలను విన్నాను. కిడ్నీ వ్యాధుల రావాడానికి కారణం తాగే మంచి నీరని తెలిసి కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని చూశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లోగా 200 పడకల ఆస్పత్రి, రీసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తాం. కాలువల ద్వారా సాగు, తాగు నీరు అందిస్తాం. 

నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా?
మరో 20 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. నిన్నటి కంటే ఈ రోజు బాగుంటే అభివృద్ధి అంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో నిన్నటి కంటే ఈ రోజు బాగున్నామా? రైతుల రుణమాఫీలు చేశారా? సున్నా వడ్డీలు వచ్చాయా? గిట్టుబాటు ధరలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా? అదే అక్కాచెల్లేమ్మలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయా? నిరుద్యోగ యువకులకు రూ.2 వేల భృతి అన్నారు.. ప్రతి ఇంటికి రూ.1 లక్ష 20 వేలు బాకీ పడ్డారా? లేదా? బెల్ట్‌ షాప్‌ల రద్దు అన్నారు.. మరీ మీ గ్రామాల్లో మందు దొరుకుతుందా? లేదా? ఒక్కసారి ఆలోచించి చంద్రబాబు పాలన చూడమని కోరుతున్నా. బాబు పాలనలో మీరంతా సంతోషంగా ఉన్నారా? అని అడుగుతున్నా. మీ పిల్లల చదువులు, వారిని చదివించేందుకు డబ్బులు ఉన్నాయా? ఆస్తులు అమ్ముకోకుండా చదవించగలరా? కేజీ నుంచి పీజీ దాకా ఉచితమన్నారు.. ఈ రోజు ఆ రకంగా జరుగుతుందా? చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలు, అన్నా తమ్ముళ్లను అడుగుతున్నా. అమరావతి వెళ్తున్నారా? అమరావతిలో ఉద్యోగులన్నాయా? ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరుకు వెళ్తున్నారా? ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఈ రోజు నేను చెబుతున్నా జాబు రావాలంటే బాబు పోవాలి.

2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఆరోజు లెక్కలు ప్రకారం లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ నాటి నుంచి మన రాష్ట్ర యువత ఆ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు తీసుకుంటూ డబ్బులు ఖర్చుపెడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఖాళీలున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఏటా 10వ తరగతి పాస్‌ అయ్యేవారు 5 లక్షల మంది. 4 లక్షల మంది ఇంటర్‌ పాస్‌ అవుతున్నారు. లక్షా 80వేల మంది డిగ్రీ పాసై వస్తున్నారు. లక్షా 10 వేల మంది పీజీ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. వీరందరికి ఉద్యోగాలు కల్పించేలా కార్యచరణ రూపొందిస్తాం.

ప్రత్యేక హోదా వస్తేనే ..
రాష్ట్రంలో ఒక కోటి డెబ్బై లక్షల ఇళ్లు ఉంటే.. నిరుద్యోగ భృతి కింది ప్రతి ఇంటికి నెలకు రెండు వేలు ఇస్తామన్నారు. ఆ డబ్బులు దేవుడెరుగు.. కాస్తో కూస్తో ఉద్యోగాలు వస్తాయనుకున్న ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేకహోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. ట్యాక్స్‌ మినహాయింపులతో పరిశ్రమలు, ఆసుపత్రులు, హోటళ్లు కట్టడానికి వస్తారు. ఇలాంటి హోదా కోసం కూడా గట్టిగా ప్రయత్నిస్తాం. చదువుల కో​సం అప్పులు చేయడం చూశాను. మీ అందరి చల్లని దీవేనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు, చదువుల కోసం హామీ ఇస్తున్నాను. ప్రతి తల్లి ..తండ్రికి చెబుతున్నా. ఏ చదువులు చదివించినా.. ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తాను. చదువులే కాదు.. ఉద్యోగాల కల్పన కోసం కృషి చేస్తాం. 

అధికారంలో వచ్చిన వెంటనే తొలి పనిగా 2 లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది నోటిఫికేషన్‌లు వేస్తాం. వాటి కోసం ఒక క్యాలెండర్‌ కూడా జారీ చేస్తాం. ఉద్యోగాలు రావడం కోసం చేయబోయే విప్లవాత్మక మార్పు. పరిశ్రమల, పోర్ట్‌ల్లో ప్రస్తుతం మనకు ఉద్యోగాలు రావడం లేదు. దీన్ని పూర్తిగా మార్చేస్తాను. స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా.. శాసనసభలో చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు తీసుకునే సర్వీసులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టులకు ఇస్తున్నారు. వీటిని కేశినేని, జేసీ బ్రదర్స్‌ నడుపుతున్నారు. వీటన్నిటిని మార్చేస్తాం. ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకే ఇచ్చేలా చేస్తాం. పెట్టుబడుల కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. నామినేషన్‌ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తాం.

ఊరిలోనే ఉద్యోగం..
గ్రామ సెక్రటరియేట్‌లతో 10 మందికి ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలోని 50 ఇళ్లకు ఒక వాలింటర్‌ను పెడ్తాం. వారికి రూ.5వేల గౌరవ వేతనం ఇస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు ఈ ఉద్యోగం చేయవచ్చు. ఆ గ్రామ వాలంటరీ గ్రామ సెక్రటరీయేట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఆ యాబై ఇళ్లకు డోర్‌ డెలవరీ చేస్తారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే పరిష్కరిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌డెవలెప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవరత్నాల్లో ఇవన్నీ వివరించడం జరిగింది. మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి. కానీ చంద్రబాబు పాలనలో మోసాలు, కుట్రలు, హత్యలు చూస్తున్నాం. వీళ్లే హత్యలు చేస్తారు.. వీళ్లే విచారణ చేస్తారు. వక్రీకరించడానికి వీళ్ల మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనపై ఎన్నికలు రావడం లేదు. హత్యారాజకీయాలతో వస్తున్నారు.

రాబోయే రోజుల్లో మూటలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఓటుకు మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడ్తాయని వివరించండి. పలాస నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌లకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement