సాక్షి, కడప : ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు ఆయనను మోస్తున్న ఎల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నుతున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. (అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్)
గురువారం కడపలో సమర శంఖారావం సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘31 ఏళ్లుగా ఈ జిల్లా వైఎస్సార్‌ను గుండెల్లో పెట్టుకుంది. ఆయన అకాల మరణం తర్వాత నాకు, నా కుటుంబానికి అండగా ఉంది. జగన్ అనే నన్ను కొడుకుగా ఆదరించింది. మీ దీవెనలే నాకు కొండంత అండ. పదేళ్లుగా మీరు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసు. కొందరు ఆస్తులు పోగొట్టుకున్నారు. మరికొందరు అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాపై ఉంది. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందించడంలో మీ పాత్ర క్రియాశీలకం’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... ‘చంద్రబాబు మోసాలు గుర్తించాలి. ఎన్నికలకు ముందే ఆయనకు ప్రజా సంక్షేమం గుర్తుకు వస్తుంది. మరేం ఫర్వాలేదు. ఎవరూ అధైర్యపడవద్దు. అన్న వస్తాడని చెప్పండి. పిల్లలను బడికి పంపిస్తే ఏటా 15 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తాడని చెప్పండి. ప్రతీ మే నెలలో రైతుకు రూ.12,500 ఇస్తాడని చెప్పండి. అవ్వా, తాతకు నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇస్తాడని చెప్పండి’ అని హామీ ఇచ్చారు. (వృద్ధాప్య పింఛన్ రూ.3,000)
బాబు రోజుకో కొత్త డ్రామా ఆడతారు..
ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా వెనుకాడరని వైఎస్ జగన్ విమర్శించారు. డబ్బు మూఠలతో గ్రామాల్లో చొరబడతారు.. ఓటుకు రూ. 2 వేలు. రూ. 3 వేలు అంటూ మభ్యపెట్టడానికి సిద్ధమవుతారని దుయ్యబట్టారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బాబులో ఆందోళన పెరుగుతోంది. ఓటర్ల లిస్టులో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పేర్లు తొలగిస్తున్నారు. దొంగ సర్వేలు చేసి వైఎస్సార్ సీపీకి ఓటు వేసే వాళ్లు ఎవరని ప్రశ్నిస్తున్నారు. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. ఓటరు లిస్టు చూసుకుని.. మన ఓటు తొలగిపోయినట్లైతే మరోసారి నమోదు చేసుకోవాలి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. తనకు అనుకూలంగా ఉండేందుకు దొంగ ఓట్ల కార్యక్రమానికి చంద్రబాబు తెరతీశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా రోజూ లగడపాటి దొంగ సర్వేలతో సరికొత్త డ్రామాలకు తెరతీస్తారని విమర్శించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు రూ. 10 వేలు
తన ప్రసంగం అనంతరం వైఎస్ జగన్ ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ క్రమంలో బద్వేలుకు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని తిరిగి ప్రజలకు ఎలా చేరువ చేస్తారని ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్... ‘ ఈరోజు 108కు ఫోన్ చేస్తే అంబులెన్సు వచ్చే పరిస్థితి ఉందా. ఆరోగ్య సేవలు కొనసాగాలంటే ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు 8 నెలలుగా బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు జబ్బు ఏదైనా చేస్తే పెద్దాసుపత్రికి వెళ్లలేకపోతున్నారు. ఆరోగ్య శ్రీ పరిస్థితి మెరుగవ్వాలంటే వైఎస్ జగన్ రావాలని ప్రజలకు చెప్పండి. వెయ్యి రూపాయల ఖర్చు దాటితే దానిని ఆరోగ్య శ్రీ కిందకి తీసుకువస్తారని చెప్పండి. కుటుంబ పెద్ద జబ్బు పడితే ఆపరేషన్ చేయించంతో పాటు... రెస్టు పీరియడ్‌లో కూడా కుటుంబ సభ్యులకు అన్న అండగా ఉంటాడని ధైర్యంగా చెప్పండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి నెలనెలా 10 వేల రూపాయలు ఇస్తానని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పండి’ అంటూ హామీ ఇచ్చారు.
ప్రత్యేక హోదా, సీపీఎస్, నిరుద్యోగ సమస్య, ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై ప్రజలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా.. ‘ 25 ఎంపీ స్థానాలు గెలిస్తే ప్రత్యేక హోదా సాధించవచ్చు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తాం. 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. గ్రామ సెక్రటేరియట్ ద్వారానే సుమారు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పుతాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment