సాక్షి, భీమనపల్లి (తూర్పుగోదావరి) : ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమై 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాదయాత్ర చేయగలుగుతామా? అన్న పరిస్థితుల నుంచి సునాయాసంగా ముందుకు సాగగలుగుతున్నామని అన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెన వల్ల మాత్రమే ఇది సాధ్యం అయిందని చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నగారు తోడుగా ఉండి నడిపిస్తున్నట్టు ఉందని వెల్లడించారు.
వేసే ప్రతి అడుగులోనూ ప్రజలు ఆశీర్వదించారని, వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఈ 200 రోజులపాటు నన్ను నడిపించగలిగాయని చెప్పారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా తాను చూసిన సమస్యలు బాధకలిగించాయని వెల్లడించారు. రుణాలు మాఫీ కాక, గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు.
‘రైతులను ప్రభుత్వం మోసం చేసింది. విద్యార్థులు నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య శ్రీ ఉందా? లేదా? అన్న పరిస్థితిని చూసి పేదలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లు లేక పూరి గుడిసెల్లోనే పేదలు నివసిస్తున్నారు. ఇలా ఏ సమస్య చూసినా మనసును కలచివేసే సన్నివేశాలు నాకు పాదయాత్రలో కనిపించాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి.
ప్రజలకు మంచిచేయాలన్న ఆలోచన ఇప్పటి ప్రభుత్వానికి లేదు. దేవుడు ఆశీర్వదించి, కోట్ల మంది ప్రజలు దీవిస్తేనే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అలాంటి సీట్లో కూర్చున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలన్న దానిపై ఇప్పటి ముఖ్యమంత్రికి ఆలోచనలు కరువయ్యాయి. ఇక రేపు లేదు అన్నట్టుగా సీఎం సీట్లో ఉన్న వ్యక్తి ప్రజల కోసం పరితపించాలి. మనం చనిపోయాక ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడాలి. కానీ, అలాంటి పాలన ఇప్పుడు కనిపించడంలేదు. ఈ పరిస్థితులను చూసి నా మనసు చలించిపోతోంది.
వచ్చే మంచి రోజుల గురించి పాదయాత్రలో ప్రజలకు భరోసా నిచ్చాం. నవరత్నాలు వస్తాయి, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాం. ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. 200 రోజుల పాటు ప్రజలు చూపిన ప్రేమాభిమానాలను మరిచిపోలేను. నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. నాన్నగారి పాలన, అంతకన్నా గొప్ప పాలన ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా.
ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, ప్రేమ, ఆప్యాయతలు నన్ను 200 రోజులు నడిపించాయి. ఇంకా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర పోవాలి. దీనికి ముందడుగు.. ప్రజల ఆశీర్వదంతోనే పడుతుంది.’ అని వైఎస్ జగన్ తన పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment