ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం | YS Jaganmohan Reddy Marvelous Victory in AP Says Analysts | Sakshi
Sakshi News home page

ఆంధ్రాలో జగన్‌ అద్భుత విజయం.. విశ్లేషకుల మాట

Published Tue, May 21 2019 2:58 AM | Last Updated on Tue, May 21 2019 9:00 AM

YS Jaganmohan Reddy Marvelous Victory in AP Says Analysts - Sakshi

సాక్షి, అమరావతి, సాక్షి హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ మీడియా చానళ్లు పునరుద్ఘాటించాయి. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతకు పట్టంగట్టారని, మూడింట రెండు వంతులకుపైగా మెజార్టీతో ఆయన అత్యధిక స్థానాలను సాధిస్తారని పేర్కొన్నాయి. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలైన నేపథ్యంలో ‘ఇండియా టుడే’ సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై చర్చావేదిక నిర్వహించింది. పలు టీవీ చానళ్లలోనూ ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ సెఫాలజిస్టులు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ జర్నలిస్టులు తదితరులు వైఎస్సార్‌సీపీని రాష్ట్ర ప్రజలు ఆదరించటానికి కారణాలను విశ్లేషించారు.

ఏపీలో జగన్‌ను ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలంటూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ తాజా సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, అవినీతి, శాంతి  భద్రతల వైఫల్యంపై జగన్‌ గట్టిగా పోరాడారని, నవరత్నాల ద్వారా అన్ని వర్గాలకు జగన్‌ చేరువయ్యారని హిందూస్తాన్‌ టైమ్స్‌ విశ్లేషించింది. వైఎస్సార్‌సీపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్‌ పోల్స్‌లో తేలడంపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. టీడీపీ ద్వంద్వ వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒకపక్క లగడపాటి సర్వేను విశ్వసిస్తున్నట్లు చెబుతూ మరోవైపు ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేలను నమ్మబోమనడం ఏం సంకేతాలనిస్తోందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తమకు అనుకూలంగా ఉంటే సర్వేలను నమ్ముతామని లేదంటే వాటికి విశ్వసనీయత లేదనే ధోరణితో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు.

క్లీన్‌స్వీప్‌ పార్టీల్లో అగ్రస్థానంలో వైఎస్సార్‌సీపీ
ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్‌ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటుందని స్వరాజ్‌ ఇండియా జాతీయ అధ్యక్షుడు యోగీంద్ర యాదవ్‌∙ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుందని ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎండీ ప్రదీప్‌ గుప్తా చెప్పారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందు నుంచి జగన్‌ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్‌ వర్క్‌ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేరువ కావడం వైఎస్సార్‌సీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలని చెప్పారు. చంద్రబాబు కప్పదాటు వైఖరి కూడా మరో కారణమన్నారు. జగన్‌ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో క్షేత్ర స్థాయిలో బలపడిందని రాజకీయ విశ్లేషకుడు సందీప్‌ శాస్త్రి అన్నారు. 2014 ఎన్నికల్లో జగన్‌ పార్టీ ఉత్తర కోస్తాలో కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో సీట్లు కోల్పోయిందన్నారు.ఈసారి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 45 శాతం, టీడీపీకి 38 శాతం ఓట్లు పడ్డాయన్నారు. ఓట్లలో 8 శాతం మార్పు వచ్చినా 70 సీట్ల వరకు తేడా వస్తుందన్నారు. రాజకీయ అభద్రతతోనే చంద్రబాబు ఢిల్లీ వైపు చూస్తున్నారని సీనియర్‌ జర్నలిస్టు టీఎం వీరరాఘవన్‌ పేర్కొన్నారు.

డబ్బు ప్రామాణికం కాదు.. ఇమేజ్‌ పోతే మళ్లీ రాదు: సెఫాలజిస్ట్‌ భమిడిపాటి రామ్మూర్తి
‘ఎన్నికల సర్వేలకు డబ్బు ప్రామాణికం కాదు. వాస్తవ విరుద్ధమైన ఫలితాలు ప్రకటిస్తే సంస్థ ప్రతిష్ట  దెబ్బ తింటుంది. ఒకసారి ఇమేజ్‌ పోతే మళ్లీ రాదు.  సర్వేల్లో నిబద్దత ఉండాలి. ప్రజల్లో విశ్వసనీయ పెంచుకునేలా ఉండాలి. సర్వే నిర్వహణలో వ్యయప్రయాసలు ఉంటాయి కాబట్టి డబ్బు అవసరమే. అయితే డబ్బు ఒక్కటే ప్రామాణికం కాకూడదు. కొందరు ఒపీనియన్‌ పోల్‌ను కూడా ఎగ్జిట్‌ పోల్స్‌ అంటూ వైరల్‌ చేస్తున్నారు. ఇది సరికాదు. రాజకీయ పార్టీలు ఎ, బి, సి, డి పేరుతో ఇచ్చే ప్రశ్నలతో చేసే సర్వేల్లో కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశంలేదు. సైంటిఫిక్‌గా సర్వే చేయాలి. సర్వే ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు? ఎలా చేశారు? అనే వివరాలు ప్రజలకు నిష్పక్షపాతంగా అందించాలి. నేను ఐ న్యూస్‌ ఛానల్‌కు ఐ పల్స్‌ సర్వే చేశా. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పనిచేసే ఒక యాప్‌ క్రియేట్‌ చేసి ఫ్రాక్సీ బ్యాలెట్‌ మెథడ్‌లో ఓటర్ల అభిప్రాయాలు సేకరించాం. రాష్ట్రవ్యాప్తంగా 1,100 మంది ప్రతినిధులు 50 వేల మంది ఓటర్ల(శాంపిల్స్‌) పోలింగ్‌ ఒక్క రోజులోనే సర్వే చేశాం. ఓటేసి వచ్చిన ఓటర్లను కలిసి ఏ పార్టీకి ఓటు వేశారో? ఆ మొబైల్‌ యాప్‌లో నొక్కమని చెప్పాం. మేం కూడా చూడకుండా నేరుగా ఓటరుతోనే యాప్‌లో ఓటు వేయించేలా చేశాం. మా సర్వే ఫలితాలను విశ్లేషిస్తే ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజార్టీతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తారని తేలింది. ఎన్నికల ప్రచారం నుంచి పోల్‌ మేనేజ్‌మెంట్‌ వరకు అన్ని దశల్లోను వైఎస్సార్‌సీపీ అద్బుతంగా చేసింది. ప్రజల నమ్మకాన్ని పొందిన జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటారని మా సర్వేలో అంచనాకు వచ్చాం’ 

వైఎస్సార్‌ సీపీకి 110 సీట్లు: ఫ్రొఫెసర్‌ వెంకటేష్, సీఎస్‌డీఎస్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో 110 స్థానాలు వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల శాంపిల్స్‌ సర్వేలో తీసుకున్నాం. 2014లో తెలుగుదేశం పార్టీకి 42 శాతం ఓట్లు ఉంటే 2019లో 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అభివృద్ధిపై చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మలేదు. అన్ని జిల్లాలను సమానంగా చూడటం లేదని గుర్తించారు. టీడీపీ మొదటి నుంచి పొత్తులతో మాత్రమే గెలుస్తూ వస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీలు పెట్టిన పథకాలను కాపీ కొట్టింది. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుంది. మా సర్వేను ఆంధ్రజ్యోతి పత్రిక వక్రీకరించి ప్రచురించింది. దీనిపై కేసు పెట్టాం. మా వద్ద నుంచి వారికి కాపీలు ఎలా వెళ్లాయి? పైగా తప్పుడు రాతలు రాశారు. 

అవి ఫ్యాషన్‌ సర్వేలు: ‘ఆరా’ మస్తాన్‌వలి
‘ఫ్యాషన్‌గా చేసే సర్వేల్లో శాస్త్రీయత ఉండదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ‘ఆరా’ సర్వే నిజమైంది. ఆంధ్రప్రదేశ్‌లో మా సర్వే పూర్తి శాస్త్రీయంగా సాగింది. నియోజకవర్గానికి 50 మంది అభిప్రాయాలతో కచ్చితమైన ఫలితం నిర్ణయించవచ్చు. అయినా సరే ఆరా ప్రతి నియోజకవర్గంలో 1,000 మంది అభిప్రాయాలు సేకరించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ తరువాత వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ బాగా పెరిగింది. మేం పలు రాష్ట్రాల్లో సర్వేలు చేసినా కొద్ది కాలంలోనే ఇంత గణనీయమైన మార్పు ఎక్కడా చూడలేదు. 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 0.67 శాతం మాత్రమే ఓటింగ్‌ శాతం పెరిగింది. పురుషుల ఓటింగ్‌ శాతం అంతే స్థాయిలో పెరిగింది. మా సర్వేలో వైఎస్సార్‌ కాంగెŠస్‌ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంలో 47 శాతం మహిళల ఓట్లున్నాయి. అదే సమయంలో టీడీపీకి వచ్చిన మొత్తం ఓట్ల శాతంలో కేవలం 43 శాతం ఓట్లే మహిళలవి. నెల్లూరు జిల్లాలోనే మహిళల ఓట్లు అత్యధికంగా పోల్‌ అయ్యాయి. అక్కడ టీడీపీ ఒక్క సీటు కూడా గెలవదు. ఈసారి టీడీపీకి బీసీలు దూరమై 65–70 శాతం మంది వైఎస్సార్‌సీపీకి దగ్గరయ్యారు. కాపులు అత్యధికులు పవన్‌కల్యాణ్‌కు రాజ్యాధికారం దక్కదని వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. 

అయోమయంలో చంద్రబాబు: ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ (సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) 
చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో విధంగా పొంతనలేకుండా మాట్లాడుతున్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌ అయ్యాయని ఒకసారి, ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరించిందని మరోసారి, 150 సీట్లలో విజయం సాధిస్తామని ఇంకోసారి అంటున్నారు. ఓట్ల లెక్కింపు వరకూ పార్టీ కార్యకర్తలను, ఏజెంట్లను నిలుపుకోవడం కోసం, వారిలో ఆత్మస్థయిర్యం కల్పించడానికే బాబు ఇలా అంటున్నారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాలు వెళ్లి నాయకులను కలుస్తూ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని బాబుకు తెలిసినట్లు లేదు. అయితే బాబు ఇంట (రాష్ట్రంలో) గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో టీడీపీకి 2– 3 ఎంపీ సీట్లు కూడా వస్తాయనే నమ్మకం లేదు. సర్వేలకు చంద్రబాబే ఆద్యుడు. ఏపీలో ప్రతినెలా వైఎస్సార్‌సీపీ పుంజుకుంటూ వచ్చినట్లు మేం శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేల్లో తేలింది. మహిళలు, డ్వాక్రా మహిళలు టీడీపీకే ఓట్లేశారనుకోవడం తప్పు.

ఈ విషయాన్ని పక్కా డేటాతోనే  చెబుతున్నా. ఫిబ్రవరి మధ్యలో ఒకసారి, మార్చిలో మరోసారి మేం సర్వే చేశాం. డ్వాక్రా మహిళల్లో 45 శాతం మంది టీడీపీకి, 46 శాతం మంది వైఎస్సార్‌సీపీకి, మొత్తమ్మీద మహిళలను తీసుకుంటే 8 శాతం మంది అధికంగా బైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. పసుపు – కుంకుమ కింద రూ. 10 వేలు ఇస్తే డ్వాక్రా మహిళలు తీసుకుని ఉండవచ్చు. వారు జగన్‌ ఇచ్చిన రుణమాఫీ, ఇతర హామీల ద్వారా కూడా ప్రయోజనం పొందాలని ఆశించారు. జగన్‌ – ఫ్యాన్‌’ అనే అంశం జనంలోకి రిథమిక్‌గా వెళ్లింది. పొలిటికల్‌ మేనేజిమెంట్, పబ్లిక్‌ మేనేజిమెంట్‌ ఇలా ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో నిలిచింది.

ఎన్నికలకు పది రోజుల ముందు నాటికి టీడీపీ కంటే వైఎస్సార్‌సీపీని బలపరిచిన ఓటర్ల సంఖ్య 5 శాతానికి పెరిగింది. ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ ఓటు షేర్‌ టీడీపీ కంటే 9 శాతం ఎక్కువైంది.  ఇవన్నీ శాస్త్రీయంగా చేసిన సర్వే గణాంకాలు. ఫోన్లలో చేసే సర్వేలు వాస్తవాలను ఏమాత్రం ప్రతిఫలించవు. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఎన్డీయేకి అనుకూలంగా ఉండటంతో సోమవారం సెన్సెస్‌ 1400 పాయింట్లుపైగ పెరిగింది. నిన్న ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు రాగానే ఒకరు  నాతో రేపు సెన్సెస్‌ పరుగులు తీస్తుందన్నారు. అదే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా సెన్సెస్‌ను ప్రభావితం చేసింది.టీడీపీకి 92 ప్లస్‌ ఆర్‌ మైనస్‌ 10 వస్తాయని లగడపాటి సర్వే పేర్కొంది. ఆ పది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవు. ఇలా సర్వే ఫలితాలు ఉండరాదు. 

జగన్‌ అభ్యర్థులను బాగా ఎంపిక చేశారు
జగన్‌ పార్టీ సీట్లు ఆశిస్తున్న వారి పేర్లు దగ్గర పెట్టుకుని ఎవరికి సీట్లు ఇస్తే బాగుంటుందనే అంశాన్ని చాలా చక్కగా అంచనా వేశారు. మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. స్వల్ప మెజార్టీలు ఉన్న చోట్ల గొడవలు జరుగుతాయి. అందువల్ల బాబు చివరివరకూ పార్టీ క్యాడర్‌ను నిలుపుకోవడం కోసం విజయం టీడీపీదే అంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈవీఎంల పంచాయతీ ఎజెండాగా చంద్రబాబు పది రోజులు రాజకీయాలు నడిపిస్తారు. కొందరు డబ్బులకోసం, సొంత ప్రయోజనాల కోసం సర్వేలు చేయిస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. ఏమాత్రం శాస్త్రీయత, నెట్‌ వర్క్‌ లేని సంస్థలు సర్వేలు చేసినట్లు ఫలితాలు ప్రకటించడం ఇందుకు నిదర్శనం. బెట్టింగుల కోసం కూడా సర్వేలను వాడుకుంటున్నారు. ఊరూపేరూలేని వారు సర్వేలు చేస్తూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి. 2006 నుంచి మేం శాస్త్రీయంగా సర్వేలు చేస్తున్నాం. శాస్త్రీయ సర్వేలు ఎప్పుడూ ఫెయిల్‌ కావు. ఎన్నికల కమిషన్‌ కోడ్‌ విధించినట్లే ఎగ్జిట్‌పోల్‌ సర్వే సంస్థలకూ కోడ్‌ ఉండాలి. మోడల్‌ కోడ్‌ లేకపోతే మైండ్‌ గేమ్‌ సర్వేలు నడుస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement