కనిగిరి నియోజకవర్గం హజీస్‌పురం వద్ద ప్రజానీకానికి అభివాదం చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
చెరువులో తాము కష్టపడి పెంచిన చేపలను అధికారం అండ చూసుకుని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పట్టుకెళ్లారని ప్రకాశం జిల్లా పీసీ పల్లి, కనిగిరి మండలాలకు చెందిన జాలర్లు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో గోడు వెళ్లబోసుకున్నారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం శ్రుతిమించిపోయిందని, అది తమ కడుపుకొట్టే దాకా వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం 95వ రోజు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీ పల్లి, కనిగిరి మండలాల్లో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగించారు.
ఈ సందర్భంగా పామూరు మండలం మోపా డు, పామూరు, నుచ్చుపొద గ్రామాలకు చెందిన యానాది కుటుంబాల్లోని మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర సాగుతున్న ప్రాంతానికి వచ్చి జగన్‌ను కలిశారు. నుచ్చుపొద జాలర్ల సహకార సంఘం పరిధిలోని ఎనిమిది చెరువుల్లో సభ్యులు పెంచుకున్న కోట్లాది రూపాయల విలువైన చేపలను స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు పట్టుకొని అమ్ముకున్నారని వాపోయారు.
జాలర్ల సం ఘంలో సభ్యులుగా ఉన్న తమ ఇళ్ల వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి.. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మోపాడు (రిజర్వాయర్) చెరువులో గత ఆగస్టులో రూ.కోటిన్నర విలువైన చేపలను పట్టుకుపోయారని వివరించారు. తమ సంఘం పరిధిలో ఉండే మరో ఏడు చెరువుల్లో ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే చేపలు ఉన్నాయని, టీడీపీ నేతలు వాటిని కొట్టేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యం, అక్రమాలపై బహిరంగ విచారణ జరిపించాలని వారు కోరారు.
బాధితుల గోడు సావధానంగా విన్న జగన్.. జాలర్ల కుటుంబా లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంద ని హామీ ఇచ్చారు. పీసీ పల్లి మండలం రామాపురం వద్ద గొర్రెల కాపరులు జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గతంలో గొర్రెల కాపరులకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదని.. ఈ ప్రభుత్వంలో గొర్రెలకు బీమా సౌకర్యాన్ని అమలు చేయడం లేదని వారు జగన్‌కు వివరించారు. అందరి కష్టాలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అన్ని వర్గాల వారినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment