22–02–2018, గురువారం
హజీస్‌పురం, ప్రకాశం జిల్లా
బాబుగారి మార్కు రుణమాఫీ అంటే ఇదేనా?!
ఈ రోజు నుచ్చుపొద జాలర్ల సహకార సంఘం సభ్యులు కలిశారు. తమ జీవనోపాధికొచ్చిన కష్టాల గురించి చెప్పుకున్నారు. ‘సార్.. మేము ఎస్టీ తెగకు చెందిన యానాదోళ్లం. మా సహకార సంఘం తరఫున మోపాడు రిజర్వాయర్, చుట్టుపక్కల చెరువుల్లో చేపలు పట్టుకుని జీవించేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పార్టీ నేతల ఆగడాలు ఎక్కువైపోయాయి. నిబంధనలకు విరుద్ధంగా మా సంఘం అధ్యక్షుడిని, సభ్యులను తొలగించారు. స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా అర్హతలు లేనివారిని సభ్యులుగా చేర్చుకుని, కోట్లాది రూపాయల మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు.
మమ్మల్ని రానీయకుండా బయట జిల్లా నుంచి కూలీలను తెచ్చి, పోలీసు బందోబస్తు మధ్య చేపలు పడుతున్నారు. నిబంధనల ప్రకారం మాకు రావాల్సిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఈ అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించినందుకు మా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులతో వేధింపులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారు. దీనిపై కోర్టుకెళ్లినా.. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, ఎస్టీలు అని కూడా చూడకుండా వారి కడుపు కొడుతున్న ఈ అధికార పార్టీ నాయకుల దురాగతాలు ఇంకెన్నాళ్లు?
గుదేవారిపాలెం కొత్తూరులో చెంచయ్య అనే అన్న నన్ను తన గొర్రెల మంద దగ్గరకు తీసుకెళ్లాడు. ‘సార్.. వర్షాలు పడక, నీళ్లులేక వ్యవసాయం భారమైంది. అది చేయలేక గొర్రెలుకొని వ్యాపారం చేసుకుందామంటే.. అదీ బరువైపోతోంది. ఈ జీవాలకు నీళ్లు లేవు, మేత కూడా దొరకడం లేదు. ప్రభుత్వం అందించే మందులూ లేవు.. బీమా కూడా లేదు. ఎలా బతకాలో అర్థంకావడం లేదు’ అని ఆ అన్న చెబుతుంటే.. భుజం మీద చెయ్యి వేసి ధైర్యం చెప్పాను. ఈ ప్రభుత్వం పంటల బీమానే కాదు.. సన్న జీవాల బీమాను కూడా నిర్లక్ష్యం చేస్తోంది. వ్యవసాయం లేక, పాడీ లేక, సన్న జీవాలనూ పెంచుకోలేక.. రైతన్నలు ఎలా బతకాలి?
అగ్రహారానికి చెందిన కేశవస్వామి అనే రైతన్నది మాఫీ కాని రుణ బాధ. 2012లో పాసు పుస్తకాలు పెట్టి రూ.60 వేలు అప్పుగా తీసుకున్నాడట. ఈ రైతన్న రుణ మాఫీకి అర్హుడంటూ బ్యాంకు వాళ్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా.. ఒక్కపైసా కూడా మాఫీ కాలేదట. ఏమైందో కనుక్కోడానికి తిరగని చోటంటూ లేదని, విసుగొచ్చేసిందని చెప్పాడు. చివరికి, ఓసారి ముఖ్యమంత్రిగారు దర్శికి వచ్చినప్పుడు ఆయనను కలిసి తన సమస్య చెప్పుకుంటే.. ఆయన భుజం మీద చెయ్యేసి ‘అయిపోతుంది తమ్ముడూ..’ అన్నాడట. ‘ఏమైందో.. ఏమైపోతుందో.. ఏమీ అర్థం కాలేదు. నాకు మాత్రం రుణ మాఫీ కింద ఒక్కపైసా కూడా రాలేదు’ అని ఆ రైతన్న బాధగా చెప్పుకున్నాడు.
ఎన్‌ఎన్ కండ్రికకు చెందిన వద్దినేని శ్రీహరిరావుదీ అదే వ్యధ. ఆ అన్న 2011లో బ్యాంకులో బంగారం పెట్టి రూ.88 వేలు రుణం తీసుకున్నాడట. 2013లో బంగారం పెట్టి మారో రుణం కింద ఇంకో రూ.88 వేలు తీసుకున్నాడట. ఆయనకూ ఒక్క పైసా కూడా మాఫీ కాలేదట. ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్గాల ద్వారా విన్నవించాలో.. అన్ని మార్గాల్లోనూ విన్నవించాడట. ఆఖరుకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనూ అర్జీ పెట్టాడట. దానికి కనీసం సమాధానం కూడా లేదని విచారం వ్యక్తం చేశాడు.
మొత్తానికి బాబుగారి రుణమాఫీ దెబ్బకు వ్యవసాయమే మానేశాడట. ‘బ్యాంకులో బంగారం వేలం వేస్తారని భయపడ్డాను సార్.. పరువుపోతుందని వేరేవాళ్ల దగ్గర అప్పుచేసి, బర్రెల మీద లోను తీసుకుని బ్యాంకు అప్పు కట్టేశాను. బయట అప్పుల పాలయ్యాను. ఆ ప్రయివేటు అప్పును తీర్చడం కోసం బ్యాంకు నుంచి తీసుకున్న బంగారాన్ని వాళ్లకే ఇచ్చేశాను’ అని ఆ అన్న చెబుతుంటే.. ముఖ్యమంత్రి దృష్టికి పోయినవాటికే దిక్కులేకపోతే ఇక ఇలాంటి బాధితులు ఎవరిని ఆశ్రయించాలో.. ఎవరిని నిలదీయాలో కదా!
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా, సంపూర్ణంగా మాఫీ చేస్తానన్నారు. మీరు ప్రభుత్వ పగ్గాలు చేపట్టేప్పటికి రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు. కాగా, కమిటీలని, సవాలక్ష షరతులు, ఆంక్షలు పెట్టి వాటిని కాస్తా.. రూ.24 వేల కోట్లకు కుదించారు. కనీసం వీటిని కూడా మాఫీ చేయకపోవడం వాస్తవం కాదా? చేసిన అరకొర మాఫీ వడ్డీలకు కూడా సరిపోకపోవడం నిజం కాదా? ఇదేనా బాబుగారి మార్కు రుణమాఫీ అంటే? మీ మాటలు నమ్మి రైతన్నలు అప్పుల ఊబిలో కూరుకుపోయి వ్యవసాయం చేయలేని పరిస్థితికి రావడం దారుణం కాదా?
Comments
Please login to add a commentAdd a comment