14–08–2018, మంగళవారం
డి. ఎర్రవరం జంక్షన్, విశాఖపట్నం జిల్లా
మీ పాలనలోనే సహకార చక్కెర ఫ్యాక్టరీలు, డెయిరీలు నష్టాల ఊబిలో కూరుకుపోతాయెందుకు బాబూ?
గత రెండు నెలలుగా నాతో ఉన్న తూర్పుగోదావరి సహచరులంతా జిల్లా పొలిమేర దాకా వచ్చి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ జిల్లా ప్రజలు, కార్యకర్తల ఆదరణ పదేపదే గుర్తుకొస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద ఘనస్వాగతాల నడుమ విశాఖ జిల్లాలో అడుగుపెట్టాను. పదిహేనేళ్ల క్రితం నాన్నగారు, ఐదేళ్ల క్రితం సోదరి షర్మిల ఇదే గన్నవరం మెట్ట వద్ద ఉత్తరాంధ్రలో అడుగుపెట్టి పాదయాత్ర సాగించారు. ఈ నర్సీపట్నం నియోజకవర్గం ఏజెన్సీకి ముఖద్వారం. ఏజెన్సీ ఉత్పత్తులకు ప్రధాన వాణిజ్య కేంద్రం. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతం. బ్రిటిష్ పాలకులపై విప్లవ శంఖం పూరించిన గడ్డ. ఇక్కడి కృష్ణదేవిపేట దగ్గరే అల్లూరి సమాధి ఉంది. ఆ వీరుడిని గుర్తు చేసేలా మన్యం ప్రాంత చిన్నారులు అల్లూరి సీతారామరాజు వేషధారణలో దారిపొడవునా నిలిచి స్వాగతం పలికారు.
ఉదయం తాండవ సహకార చక్కెర మిల్లు ఉద్యోగులు కలిశారు. అదేమి విచిత్రమో కానీ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ఆ మిల్లు మూతపడే స్థాయికి చేరుకుంటుందట.. వారికి ఇబ్బందులు తప్పవట. పదిహేనేళ్ల క్రితం నాన్నగారు పాదయాత్రగా వచ్చినప్పుడు ఆ మిల్లు కార్మికులు, రైతులు కలిశారట. నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిల్లు దుస్థితిని, ఆ పరిస్థితిని కల్పించి మిల్లును అమ్మేయాలనుకుంటున్న చంద్రబాబు కుట్రలను వివరించారట. నాన్నగారు అధికారంలోకి వచ్చీరాగానే తాండవ మిల్లు ఆర్థిక సమస్యలను తీర్చి రైతులను, కార్మికులను ఆదుకున్నారట. నేడు మళ్లీ అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. అదే చంద్రబాబు పాలన.. మిల్లుకు అవే నష్టాలు.. కార్మికులకు, రైతులకు అవే కష్టాలు.. మిల్లును తన బినామీలకు అమ్మేయడం కోసం చంద్రబాబుగారి అవే కుట్రలు.. అంటూ ఆ సోదరులు వివరించారు. నాన్నగారిలా నేనూ మంచి చేస్తానన్న ఆశతో నన్ను కలిశారు. వారి నమ్మకాన్ని వమ్ము కానీయను.
టూటిపాలకు చెందిన విజయ్‌కుమార్‌కు మెదడు ఎదుగుదల సరిగా లేదు.. మాటలు సరిగా రావు. ఆ మానసిక వికలాంగుడికి మొట్టమొదటిసారిగా నాన్నగారి హయాంలోనే పెన్షన్ వచ్చిందట. అప్పటి నుంచి ఆయనంటే వల్లమాలిన అభిమానం. అదే ప్రేమను నాపై కూడా పెంచుకున్నాడు. నా పాదయాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైనప్పటి నుంచి పేపర్లలో వచ్చే ఫొటోలను సేకరించి ఒక పుస్తకంలో అతికించాడు. టీవీ చూస్తూ నా పాదయాత్ర రోజువారీ కార్యక్రమాలను డైరీగా రాశాడు. ఏ కల్లాకపటం తెలియని, కల్మషం లేని మానసిక దివ్యాంగుడు ఎప్పుడో నాన్నగారు చేసిన చిన్నపాటి సాయాన్ని గుర్తుంచుకుని గుండెల నిండా నాపై ప్రేమను నింపుకోవడం కదిలించివేసింది.
మరోవైపు శృంగవరంలో కలిసిన దేవాడ లావణ్యకు వంద శాతం మానసిక వైకల్యం ఉంది. గుక్కపెట్టి రోదిస్తూ తల్లితోపాటు వచ్చి కలిసింది. అభంశుభం తెలియని, ఏ చిన్నపనీ చేసుకోలేని ఆ దివ్యాంగురాలికి ఆసరాగా ఉన్న పింఛన్‌ను ఆపేశారట. ఆ కష్టం వింటుంటే మనసంతా పిండేసినట్టనిపించింది. ఎంత వ్యత్యాసం? విధివంచితులైన దివ్యాంగులకు పింఛన్‌లాంటి చిన్నసాయమే పెద్ద వరం. అటువంటి వరాన్ని తీసివేయడం వారి పాలిట పెద్ద శాపం.. అది నిజంగా పాపం.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సహకార చక్కెర ఫ్యాక్టరీలు, సహకార డెయిరీలు నష్టాల ఊబిలో కూరుకుపోతాయెందుకు? ఒక పద్ధతి ప్రకారం మీరు వాటిని నష్టాల ఊబిలోకి నెట్టేయడం, తర్వాత మీ బినామీలకు తక్కువ ధరకే అమ్మకానికి పెట్టడం రివాజుగా మారిందని చెబుతున్న కార్మికులకు, రైతన్నలకు ఏం సమాధానం చెబుతారు?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment