12–08–2018, ఆదివారం
డి.పోలవరం, తూర్పుగోదావరి జిల్లా
నాన్నగారి హయాంకు, చంద్రబాబు జమానాకు ఉన్న తేడా ఇదే..
తునికి చెందిన చిన్నారి వర్షిత పుట్టుకతోనే మూగ, చెవుడు. వైద్యం కోసం చెన్నై వెళితే రూ.10 లక్షలు అవుతుందన్నారట. దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆ పాప తల్లిదండ్రులకు నాన్నగారు ఆపద్బాంధవుడయ్యారు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్‌ను ఉచితంగా చేయించారు. జీవితంలో మాటలే రావనుకున్న ఆ బిడ్డ చక్కగా మాట్లాడుతోంది. బడికెళ్లి బాగా చదువుకుంటోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం శిబిరం వద్దకొచ్చి కృతజ్ఞతలు చెప్పింది. రేఖవా నిపాలెంలో నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటలక్ష్మి కలిసింది. భర్త తాపీ మేస్త్రీ. ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి గుండె జబ్బుచేస్తే.. ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. నాన్నగారి చలవతో ఆపరేషన్ ఉచితంగా జరిగింది. ఇప్పుడు ఆ బిడ్డ కాలేజీకి వెళుతున్నాడు. ‘ఎప్పుడో నాన్నను కోల్పోయిన నాకు.. తండ్రిలా సాయపడ్డారు మీ నాన్నగారు’ అంటూ ఆ సోదరి చెబుతుంటే మనసుకెంతో గర్వంగా అనిపించింది.
పాయకరావుపేటకు చెందిన గంగాధర్ అనే పిల్లాడికి గుండె జబ్బు. వాళ్ల నాన్న స్థానిక ఎమ్మెల్యేను పట్టుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే.. రూ.లక్షన్నర మంజూరు చేసినట్టు లెటర్ ఇచ్చారట చంద్రబాబుగారు. అది పట్టుకుని ఆస్పత్రికెళితే.. ఆ లెటర్ చెల్లదు.. డబ్బు కట్టి ఆపరేషన్ చేయించుకోవాలన్నారట. పాపం.. ఓమామూలు లారీ డ్రైవర్‌గా పనిచేసే ఆ తండ్రి చేసేదిలేక, చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక.. అప్పులు చేసి మరీ వైద్యం చేయించాడట. నాన్నగారి హయాంకు, చంద్రబాబు జమానాకు ఉన్న తేడా ఇదే.
మరువాడలో ఉన్న తాండవ నది తెలుగుదేశం ఇసుకాసురుల విచ్చలవిడి అక్రమార్జనకు సాక్ష్యంగా అనిపించింది. నదిలోని ఇసుకనే కాదు.. నది గట్టున ఉన్న పేదల భూముల్ని సైతం దౌర్జన్యంగా తవ్వేస్తున్నారట పచ్చనేతలు. ఇదేంటని ప్రశ్నించిన మహిళలపై సైతం అక్రమ కేసులు బనాయిస్తున్నారట.
మరువాడ గ్రామంలో స్కూలుకెళ్లే బాలలు నా వద్దకొచ్చి ‘అన్నా.. మందు వల్ల ఊరంతా పాడైపోతోంది.. దుకాణాలు మూయించండి’ అని కోరారు. అక్కడే నలుగురు బాలికలు.. మద్యం వల్ల గ్రామంలో కుటుంబాలు పడుతున్న బాధల్ని చెబుతూ కన్నీరు పెట్టుకున్నప్పుడు చాలా బాధేసింది. ‘అన్నా.. మా నాన్న రోజూ తాగొచ్చి నన్ను, మా అమ్మను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తాగి రోడ్డు మీద పడిపోయిన నాన్నను ఇంటికి తీసుకురావాలంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగకుంటే మంచోడే.. కానీ అది లేకుండా ఒక్క పూటా ఉండలేడు’ అని ఓ పాప ఏడుస్తూ చెప్పింది. ‘కూలి డబ్బు మొత్తం మద్యానికే ఖర్చయిపోతోంది.
ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండటంతో మా అన్న చదువు ఆపేసి అమ్మతో పాటు కూలికెళుతున్నాడు. నేను కూడా చదువు మానేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉందన్నా’ అంటూ ఆ చిట్టి తల్లి కన్నీళ్లు పెట్టుకోవడం మనసును కలచివేసింది. ఆ ఊళ్లో తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి దాకా మద్యం అందుబాటులో ఉంటుందట. ఇడ్లీ హోటళ్లు, కిళ్లీ కొట్లు, కిరాణా షాపుల్లో సైతం మద్యాన్ని అమ్ముతారట. బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్వహించి లక్షల్లో పాడుకుంటున్నారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి. ఎన్ని జీవితాలు నాశనమైపోయినా, ఎన్ని కుటుంబాలు ఛిద్రమైపోయినా, ఎందరు పిల్లల బంగారు భవిష్యత్తు అంధకారమైపోయినా.. మద్యం మీద ఆదాయమే ప్రధానం.. అని భావించే బాబుగారి పాలనలో ప్రజలకు ఈ కన్నీళ్లు తప్పవేమో.
గుంటూరు నుంచి కాపునాడు ప్రతినిధులు, కోనసీమ నుంచి కాపు సోదరులు వచ్చి కలిశారు. కాపు సోదరులపై అక్రమ కేసులు ఎత్తివేస్తానన్నందుకు, రూ.పదివేల కోట్లు ఇస్తానన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. రెండేళ్లున్న మద్యం షాపుల లైసెన్స్‌ల కాలపరిమితిని ఏకంగా ఐదేళ్లకు పెంచడం.. లైసెన్స్ ఫీజును నాలుగో వంతుకు తగ్గించడం.. ఎవరి బాగు కోసం? బెల్టు షాపులకు సైతం వేలం పాటలు నిర్వహించడం.. బెల్టు షాపులపై ఫిర్యాదులను మీరు పెట్టిన కాల్ సెంటర్లు స్వీకరించకపోవడం.. దేనికి సంకేతం?
-వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment