చింతమనేని బెదిరింపులకి భయపడొద్దు : షర్మిల | YS Sharmila Sharmila Speech In Denduluru Public Meeting | Sakshi
Sakshi News home page

చింతమనేని బెదిరింపులకి భయపడొద్దు : వైఎస్‌ షర్మిల

Published Wed, Apr 3 2019 1:12 PM | Last Updated on Wed, Apr 3 2019 3:35 PM

YS Sharmila Sharmila Speech In Denduluru Public Meeting - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి జిల్లా : ‘ఇసుక తనిఖీలకు వెళ్లిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన టీడీపీ ఎమ్మెలే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అసలు మనిషేనా? ఆయన ఒక తల్లికి పుట్టలేదా? ఆమె మహిళ కాదా? ఆయన భార్య మహిళ కాదా? మహిళలపై గౌరవం లేని ఇలాంటి దుర్మార్గుడికి మళ్లీ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించండి. చింతమనేని బెదిరింపులకి భయపడవద్దు. ఈ ఎన్నికలే మీకు ఆయుధం. మీ ఓటుతో చింతమనేనికి గట్టిగా బుద్ది చెప్పండి’ అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...

చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు
దెందులూరు నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. ఇది ఎన్నికల జిమ్మిక్కు. ఈ సారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండి. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?

అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం దారుణం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు.  అమరావతిలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ ఇయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్‌ కట్టలేదు. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. అమరావతి ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది?  కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు.  అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వరు. 

చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా రాలేదు
ప్రత్యేక హోదా ఎంత అవసరం. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి వంటింది. అలాంటి హోదాన్ని నీరు గార్చిన వారు చంద్రబాబు. ఈ రోజు రాష్ట్రానికి హోదా రాలేదంటే చంద్రబాబే కారణం. బీజేపీతో కుమ్మకై ప్యాకేజీకి ఒప్పకున్నారు. గత ఎన్నికల ముందు హోదా అన్నారు. తర్వత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు. రేపు ఏమి అంటారో అతనికే తెలియదు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు.. రోజుకో మాట..పూటకో వేషం చంద్రబాబుది. చంద్రబాబు ప్రత్యేక హోదాను నీరుగార్చడానికి చేయని ప్రయత్నం లేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హోదా కోసం చేయని పోరాటం లేదు. హోదా కోసం రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. 

దమ్ముంటే ఆ బాకీలు చెల్లించి ఓట్లు అడగమనండి
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఓట్లు కొనడానికి టీడీపీ డబ్బులతో వస్తారు. అమ్ముడు పోకండి. గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా?  ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా?  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారా. మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? రైతులు, మహిళలకు, చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ డబ్బు మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. దమ్ముంటే ఆ బాకీలను కట్టి ఓట్లు అడమని చెప్పండి.

సేవ చేయడానికి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి
చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేస్తూ కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని ఆరోపిస్తున్నారు. మాకు ఎవరితో పొత్తు అవసరం లేదు. సింహం సింగిల్‌ గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు కాంగ్రెస్‌, జనసేనతో కలిసి వస్తున్నారు. ఏ పొత్తు లేకుండా చంద్రబాబు ఇంతవరకు ఎన్నికలకే రాలేదు. రాబోయే రాజన్న రాజ్యలో రైతే రాజు అవుతారు. జగన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు మూడు వేల పెన్షన్‌ ఇస్తాం. వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా యువకుడు కొటారు అబ్బయ్య చౌదరిని, ఎంపీ అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వైఎస్ షర్మిల ప్రజలను కోరారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement