సాక్షి, తూర్పుగోదావరి : ‘ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరిగింది. ప్రతి పథకంలోనూ కరప్షనే. ప్రతి ప్రాజెక్టులోనూ కమిషనే. లిక్కర్ నుంచి ఇసుకదాక పత్రి దాంట్లో మాఫియా, కరప్షన్లే. భూములను మింగేశారు. మళ్లీ ఇప్పుడు ‘మీ భవిష్యత్ - నా బాధ్యత’ అంటూ వస్తున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత చంద్రబాబుది కాదా? లోకేష్ భవిష్యత్ మాత్రమే చంద్రబాబు బాధ్యతా? ఈ ఐదేళ్లు లోకేష్ కోసం పనిచేసి ఇప్పుడు మీ భవిష్యత్ నా బాధ్యత అంటున్నారు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలట. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేసి గెలిపిస్తే మీ భవిష్యత్ నాశనం చేస్తారు. జాగ్రత్త.. ఈ నారాసుర రాక్షసులను నమ్మి మోసపోకండి’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రజలను కోరారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటనియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. అవినీతి పాలన పోయి..రైతే రాజు కావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలన్నారు. అమలాపురం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ సభాలో ఆమె ఇంకా ఏమన్నారంటే...
చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు
కొత్తపేట నియోజకవర్గప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. మన పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన వ్యక్తి ఒక్క వైఎస్సార్ మాత్రమే. ఒక్క రూపాయి పన్ను పెంచకుండా గొప్ప పరిపాలన అందించిన రికార్డు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. కానీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎలా ఉన్నారు? ఒక ముఖ్యమంత్రి ఎలా ద్రోహం చేయకూడదో ఈ ఐదేళ్లలో చంద్రబాబు మనకు చూపించారు. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ భిక్షం వేస్తున్నట్లు ఇస్తున్నారు. ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. అక్కా చెల్లెళ్లు మోసపోకండమ్మా. కేవలం మహిళలను మభ్యపెట్టడానికి చంద్రబాబు డబ్బులు ఇస్తున్నారు.
చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు
ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ ఆస్పత్రులను తీసేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు అయితే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకోవాలట. సామాన్యులు అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవాలట. ఇదెక్కడి న్యాయం?ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు కట్టలేక తల్లిదంద్రులు కట్టలేక అప్పులు పాలు అవుతున్నారు. తల్లిదంద్రులను అప్పుల పాలు చేయకుండా మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. పోలవరం.. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు. ఈయన కమిషన్ మింగొచ్చనని ప్రాజెక్టును తీసుకున్నారు. 15వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును 60వేలకోట్లకు పెంచారు. మూడేళ్లలో పూర్తి చేస్తా అన్నారు. చేశారా? చిత్తశుద్ది ఉంటే పోలవరాన్ని నిర్మించేవారు. అమరావతిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ అయినా కట్టారా? కేంద్ర ప్రభుత్వం 2500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ కట్టలేదు. ఏమైంది ఆ డబ్బంతా? ఆ డబ్బంత చంద్రబాబు బొజ్జలో ఉంది. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెట్టిస్తాడట. ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతి ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ ఇంకో ఐదేళ్లు ఇస్తే అమెరికా చేస్తారాట. మన చెవిలో పూలు పెడతాడట. నమ్ముతారా? నిన్ను నమ్మం బాబు అని తేల్చి చెప్పండి.
ఇది పుత్ర వాత్సల్యం కాదా?
బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చెశారు. ఈ పప్పుగారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు రాదు. ఈ పప్పు లోకేష్‌కు కనీసం వర్ధంతికి , జయంతికి తేడా కూడా తెలియదు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకు ఏమో మూడు ఉద్యోగాలు అట. మాములు ప్రజలకు ఏమో ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు.
ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి
గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. నిజానికి టీడీపీ వాళ్లు ఎంత డబ్బు ఇచ్చిన మీ అప్పు తీర్చలేరు.
వ్యవసాయం పండుగ కావాలంటే జగనన్న రావాలి
ఈ అవినీతి పాలన పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. చెప్పింది చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు. గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు ఆర్థిక సహాయం చేస్తాం. మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. జగనన్నను ఆశీర్వదించాలని నా ప్రార్థన. బాబు వస్తే జాబు అన్నారు. ఎం వచ్చింది? కరువు వచ్చింది. అందుకే చంద్రబాబు బై బై బాబు అని చెప్పాలి. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థిగా అనురాధ, కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డిని జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలి’ అని ప్రజలను కోరారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment