డబ్బుల మూటలతో వస్తారు.. జాగ్రత్త: షర్మిల | YS Sharmila Speech In Nuziveedu Public Meeting | Sakshi
Sakshi News home page

ఏం అర్హత ఉందని లోకేష్‌కు మంత్రి పదవిచ్చారు: షర్మిల

Published Tue, Apr 2 2019 10:18 PM | Last Updated on Tue, Apr 2 2019 10:26 PM

YS Sharmila Speech In Nuziveedu Public Meeting - Sakshi

సాక్షి, నూజివీడు: ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చూపించారు.. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో నారా చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలని వైఎస్సార్‌సీసీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ షర్మిల ప్రసగించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా సంక్షేమ పథకాలు అమలుపరిచారని, కుల, మత, పార్టీలకతీతంగా పేదవారికి మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పదవికి అవమానం తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. అధికారం పోతున్న సమయంలో పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచేశారని  ఆరోపణలు గుప్పించారు.

రాజధానిలో పర్మినెంట్‌ బిల్డింగ్‌లు లేవు

ఐదేళ్లు రాజధానిలో ఉండి ఒక్క పర్మినెంటు బిల్డింగ్ కట్టలేకపోయారని, కనీసం ఐదేళ్లలో దుర్గగుడి ప్లైఓవర్‌ను కూడా పూర్తి చేయలేని చంద్రబాబు ఇంకో ఐదేళ్లు అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడట..శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తాడట.. నమ్ముతారా అని ప్రజలని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు..కానీ లోకేష్‌కు మాత్రమే జాబు వచ్చిందన్నారు. ఏం అర్హత ఉందని లోకేష్‌ 3 శాఖలు కేటాయించారు? ఇది పుత్రవాత్సల్యం కాదా అని సూటిగా అడిగారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడతారు.. పూటకో వేషం వేస్తారు.. బాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని ఎద్దేవా చేశారు.

వైఎస్‌ జగన్‌తోనే ప్రత్యేక హోదా సజీవం
నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో కుమ్మక్కై ప్రత్యేక హోదాను నీర్చుగార్చారని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలన్నారు.. తర్వాత ప్యాకేజీ అన్నారు.. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారు..ఒకే విషయంపై పదేపదే మాట మారుస్తూ యూటర్న్‌లు తీసుకుంటున్న చంద్రబాబును నమ్మాలా వద్దా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ పోరాటాలతోనే ప్రత్యేక హోదా సజీవంగా ఉందని వ్యాఖ్యానించారు. 

సింహం సింగిల్‌గానే వస్తుంది

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పొత్తులు అవసరం లేదని, సింహం సింగిల్‌గానే వస్తుందని షర్మిల అన్నారు. చంద్రబాబు మాత్రం 2014లో బీజేపీతో, 2019లో కాంగ్రెస్‌తో, పరోక్షంగా జనసేనతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ఎన్నికల కోసమే చంద్రబాబు, మీ(ప్రజల) భవిష్యత్‌ నా బాధ్యత అంటున్నారు.. ఈ ఐదేళ్లు మీ బాధ్యత కనిపించలేదా? లోకేష్‌ బాధ్యతే కనిపించిందా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో లోకేష్‌, హెరిటేజ్‌ కోసమే చంద్రబాబు పనిచేశారని విమర్శించారు.

డబ్బుల మూటలతో వస్తారు..జాగ్రత్త

ఎన్నికలకు ఒక రోజు ముందు గ్రామాల్లో టీడీపీ నాయకులు డబ్బుల కట్టలతో వస్తారు.. చేతిలో రూ.3 వేలు పెడతారు.. డబ్బులు తీసుకుని ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయండని ప్రజలకు సూచించారు. చంద్రబాబు ఆడపిల్ల పుడితే రూ.25 వేలు, విద్యార్థులకు ఐప్యాడ్‌లు, మహిళలకు స్మార్ట్‌ఫోన్‌లు ఇస్తానన్నాడు.. ప్రతి నిరుద్యోగి కుటుంబానికి రూ.లక్షా ఇరవై వేలు బాకీ ఉన్నారు.. టీడీపీ నాయకులు ఓటేయాలని అడిగితే ఈ బాకీలన్నీ ఎన్నికల ముందే తీర్చాలని అడగండని సూచించారు.

ప్రతి రైతుకు రూ.12,500 ల పెట్టుబడి సాయం
ప్రతి రైతు కుటుంబానికి మే నెలలోనే రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామని, అలాగే పిల్లలను బడులకు పంపిన తల్లులకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు అందిస్తామని తెలిపారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు పింఛన్‌ అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు నాలుగు దఫాల్లో పూర్తిగా చెల్లిస్తామని, అలాగే సున్నా వడ్డీకే మళ్లీ రుణాలు ఇప్పిస్తామని చెప్పారు.  ప్రజలకు మేలు చేసేవాడు  కావాలంటే జగనన్న రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఎప్పుడు వస్తే అప్పుడు రాష్ట్రంలో కరవు వస్తుందని అన్నారు. బైబై చంద్రబాబు..ఇదే ప్రజాతీర్పు కావాలన్నారు. ఫ్యాన్‌ గుర్తు మీద ఓటేసి వైఎస్సార్‌సీపీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ను, నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావుని గెలిపించాలని కోరారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement