
సాక్షి, కనిగిరి (ప్రకాశం జిల్లా) : ‘20 ఏళ్ల కిత్రం వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారు. 9 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోగొట్టుకున్నాం. ఎవరినీ నిందించనుగానీ వైఎస్సార్ మృతిపై అనుమానాలున్నాయి. 4 నెలల క్రితం నా బిడ్డ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంపాలనుకున్నారు. మొన్న నా మరిది వైఎస్ వివేకానందరెడ్డిని అతి కిరాతకంగా చంపారు. మా కుటుంబం ప్రజల కోసం నిలిచింది. అయినా మా కుటుంబం పట్ల ఎందుకంత పగబట్టారో ఆ దేవుడికే తెలియాలి. ఇలా పరిస్థితుల్లో జనం మధ్యకు నేను రావడానికి కారణం మీపై అభిమానమే’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వమని, రాజన్న రాజ్యం తీసుకొస్తాడని, నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాడని కోరారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..
ఒక్కసారి ఆలోచించండి..
‘మరో 13 రోజుల్లో ఓటేయబోతున్నాం.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తు చేసుకోవాలని అందరినీ కోరుతున్నా. నేడు ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్దం జరుగుతోంది. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నాను. వైఎస్సార్ ఆశయాల స్పూర్తితోనే వైఎస్సార్‌సీపీ పుట్టిందని మీ అందరికీ తెలుసు. వైఎస్సార్ కుటుంబానికి, ప్రజలకు మధ్యన 40 ఏళ్ల అనుబంధం ఉంది. వైఎస్సార్‌లా జగన్ కూడా నిత్యం ప్రజలతోనే ఉన్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఈ సారి అలాంటి పొరపాటుకు తావు లేకుండా చూసుకోవాలి. వైఎస్సార్ లేకపోవడం వల్ల మా కుటుంబానికి వచ్చిన నష్టం కంటే ఈ రాష్ట్రానికి వచ్చిన నష్టమే ఎక్కువ అనిపిస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం వైఎస్సార్, జగన్ మంచివాళ్లు. కాంగ్రెస్ నుంచి జగన్‌మోహన్ రెడ్డి బయటకు రాగానే.. అన్ని రకాల కేసులు, వేధింపులు మొదలయ్యాయి. మా కుటుంబాన్ని చాలా బాధ పెట్టారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను జగన్‌మోహన్ రెడ్డి ఓదార్చాలనుకున్నారు. జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు.
వైఎస్సార్ బతికున్నంత కాలం ఏనాడు నేను బయటకు రాలేదు. ఆయన మరణం తర్వాత ఏర్పడిన పరిస్థితుల వల్ల నేను జనంలోకి రావాల్సి వచ్చింది. నా బిడ్డ జగన్‌ను జైల్లో పెట్టారు. నాటి ఉపఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజల్లోకి వచ్చాను. వైఎస్సార్ బతికున్నంత కాలం ప్రజలే ముఖ్యమనుకున్నారు. జగన్ కూడా ప్రజలే ముఖ్యమని జనంలో ఉన్నారు. 9 ఏళ్ల కాలంలో కుటుంబంతో గడిపింది చాలా తక్కువ. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను.. జగన్ ఏదైనా చెబితే అది చేస్తాడు.. ఏదైనా అనుకుంటే అది సాధిస్తాడు.
నీచమైన ఆరోపణలు..
నా మరిది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. మా కుటుంబం ఇంట్లో వాళ్లనే కాదు బయట వాళ్లకు ప్రాణమిచ్చే కుంటుంబం. ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేక చంద్రబాబు మాపై ఆరోపణలు చేస్తున్నారు. మా మరిది హత్యకేసులో మేం కోరుతున్న థర్డ్ పార్టీ ఎంక్వైరీ. కానీ సీఎం చంద్రబాబు వినిపించుకోవడం లేదు. ఓటు అడిగే నాయకుడు తాను ఫలానాది చేశాను. ఫలానాది చేయబోతానని చెప్పుకునేలా ఉంటాలి. చెప్పింది చేశాను.. చెప్పనది కూడా చేశానని 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ప్రజల మధ్యకు వెళ్లారు. నా పాలన చూసి ఓటు వేయండని ప్రజలను సవినయంగా కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చెప్పారు. కొత్త హామీలు ఇవ్వకుండానే 2009లో వైఎస్సార్ ప్రజలను ఓట్లు అడిగారు. ఇవాళ చంద్రబాబు ఎంత సేపు జగన్ జగన్.. అంటూ జపం చేస్తున్నారు.
పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు చేస్తే కొడుకని కూడా చూడకుండా వైఎస్సార్ సీబీఐ దర్యాప్తు చేయించారు. మరి మీరేందుకు మా మరిది హత్యపై సీబీఐ దర్యాప్తు వేయడం లేదు. చంద్రబాబుపై బాంబు దాడి జరిగేతే వైఎస్సార్ అక్కడికెళ్లి ఆయనను ఓదార్చారు. దాడిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. ఈరోజు మా మరిది హత్యకు గురైతే చంద్రబాబు పుత్రరత్నం పరవశించిపోతున్నారట.. ఎందుకు పరవశించపోతున్నారని అడుగుతున్నా. వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో 70 శాతం పూర్తయింది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ 98 శాతం పూర్తయింది. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మిగిలిన పనులు కూడా చేయలేకపోయారు. నవరత్నాలను ప్రతి ఇంటికి అందించాలని జగన్ తపన పడుతున్నారు. 9 ఏళ్లుగా జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో చూస్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం తీసుకొస్తాడు. కనిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులను ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.’ అని వైఎస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment