లా కమిషన్ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్టు వైఎస్సార్ సీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం ఢిల్లీలో లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్‌ను కలసి జమిలి ఎన్నికలపై వైఎస్సార్ సీపీ అభిప్రాయాన్ని తెలియచేస్తూ 10 పేజీల లేఖను అందజేశారు. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయని, మధ్యలో కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల అది కుదరలేదని అందులో పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై మళ్లీ ఇప్పుడు లా కమిషన్ అన్ని వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించడాన్ని వైఎస్సార్ సీపీ అభినందించింది.
తరచూ ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకాలు
2014లో సాధారణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలతో పాటు జరగగా అనంతరం ఇప్పటి వరకు నాలుగేళ్లలో 15 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఇలా ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని వైఎస్సార్ సీపీ పేర్కొంది. ఎన్నికల కోడ్ వల్ల సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం కలగడంతోపాటు అధికార యంత్రాంగం అంతా పాలనాపరమైన అంశాలను పక్కనపెట్టి ఎన్నికల పనుల్లో నిమగ్నమవుతోందని, దీనివల్ల ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయలేకపోతున్నాయని పార్టీ వివరించింది. లోక్‌సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికల నిర్వహణ వల్ల వ్యయం భారీగా పెరుగుతోందని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి 2009 ఎన్నికల నిర్వహణకు రూ. 1,100 కోట్లు, 2014 ఎన్నికలకు రూ. 4 వేల కోట్లు ఖర్చు కాగా ఇక 2019 ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చని లేఖలో పేర్కొంది.
ఓటుకు కోట్లు కేసులు తగ్గుతాయి..
జమిలి ఎన్నికల వల్ల ఖర్చులు తగ్గిపోవడమే కాకుండా అవినీతి తగ్గుతుందని, ఓటుకు కోట్లు లాంటి కేసులు తగ్గిపోతాయని, సమాజాన్ని విడగొట్టే కుల సమీకరణాలు తగ్గిపోతాయని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల ఏటా ఎన్నికల ప్రచారాలకు రాష్ట్రాల్లో తిరగాల్సిన అవసరం లేకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టవచ్చని వైఎస్సార్ సీపీ లేఖలో పేర్కొంది. 1999లోనే జస్టిస్ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ తన 170వ రిపోర్టులో దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేసిందని గుర్తు చేసింది. 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చిందని పేర్కొంది.
ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలి..
మరోవైపు జమిలి ఎన్నికల వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని వైఎస్సార్ సీపీ తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల ఎన్నికలు, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గినా రాజకీయ పార్టీల ఖర్చులు తగ్గుతాయన్న దానిపై హామీ లేదని, పార్టీలు ఒకేసారి మొత్తం నిధులు ఖర్చు పెట్టే అవకాశం ఉందని తెలిపింది. జమిలి విధానంలో ఐదేళ్లకు ఒకసారే ఎన్నికలు జరగడం వల్ల ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు మధ్యలో తీర్పు చెప్పే అవకాశం తగ్గిపోతుందని పేర్కొంది. ఆర్టికల్ 83(2), 172 ప్రకారం ఏదైనా ప్రభుత్వానికి ఐదేళ్లు పాలించే అధికారం ఉంటుందని, కానీ జమిలి ఎన్నికల వల్ల ఆ విధానాన్ని విస్మరించే అవకాశం ఉందని, ఇంకా కాలపరిమితి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను జమిలి ఎన్నికలకు ఎలా ఒప్పిస్తారు? జమిలి ఎన్నికల తరువాత ఒకవేళ అవిశ్వాసం వల్ల ఏదైనా ప్రభుత్వం రద్దై ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే రాజకీయ అనిశ్చితి తలెత్తకుండా ఎలాంటి ప్రత్యామ్నాయాలు తీసుకుంటారని ప్రశ్నించింది.
ఈ విషయాల్లో రాజ్యాంగ సవరణ అవసరమని, అది అంత సులువైనది కాదని పేర్కొంది. దీనిపై లా కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల వల్ల తలెత్తే సమస్యలన్నింటిని పరిష్కరించి ఈ విషయంలో ముందుకెళ్లాలని, లేకుంటే ప్రతికూల ఫలితాలు తప్పవని పేర్కొంది. ఏదైనా కారణాల వల్ల కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రద్దు అయితే అప్పుడు పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా.. రాజ్యసభకు ఎలాగైతే ఆరేళ్ల కాలపరిమితితో మధ్యలో ఖాళీ అయితే మిగిలిన సమయానికి మాత్రమే ఏ రకంగా ఎన్నిక జరుగుతుందో అలాగే ఎన్నికలు జరిగేలా సిఫార్సు చేస్తామని లా కమిషన్ చెప్పినట్టు ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాకు తెలిపారు.
30 రోజుల్లో చర్యలు తీసుకోవాలి
ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇతర పార్టీల్లోకి ఫిరాయించే సభ్యులపై 30 రోజుల్లోగా వారి సభ్యత్వాలు రద్దయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ కోరింది. ఈ అధికారాన్ని స్పీకర్లకు కాకుండా ఎన్నికల కమిషన్‌కే అప్పగించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం అధికారాలు స్పీకర్ల వద్ద ఉండటంతో అధికార పార్టీల వల్ల అవి దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగంలో ఈ సవరణలు అత్యవసరం అని వైఎస్సార్ సీపీ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment