సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యమని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేటతెల్లం కావడంతో పార్టీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఓట్ల లెక్కింపు కోసం సన్నద్ధమయ్యారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) నిందిస్తూ నానా యాగీ చేయడంతో పాటు కౌంటింగ్ ప్రక్రియను వీలైనంతగా వివాదాస్పదం చేసి, గొడవలకు దిగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్ర పన్నిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తమ ఏజెంట్లు, నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూచించింది. ప్రతి రౌండ్ ఫలితం లెక్కింపు జరిగేటప్పుడు, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమరుపాటుకు గురి కాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచనలు జారీ చేసింది.
కల నెరవేరబోతోంది
రాష్ట్రంలో నెలన్నర రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. ఐదేళ్లుగా అధికార తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ తెగించి పోరాడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కౌంటింగ్‌లో సానుకూల ఫలితాలు రాబోతున్నాయని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. విజయం పట్ల పార్టీలోని అన్నిస్థాయిల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలన్న తమ కల నెరవేరబోతోందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ఓట్ల కౌంటింగ్ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లుగా మెరికల్లాంటి కార్యకర్తలను ఎంపిక చేసి నియమించారు.
ఈ నెల 16వ తేదీన విజయవాడలో వారికి నిపుణులతో శిక్షణ కూడా ఇప్పించారు. కేంద్రాల వద్ద అల్లర్లు జరగకుండా ఎన్నికల సంఘం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ తగిన జాగ్రత్తల్లో ఉండాలని కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లలో ఎవరైనా నేర చరితులు, గొడవలు సృష్టించే వారు ఉన్నట్లయితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై ఉందని, ఏవైనా అభ్యంతరాలుంటే కౌంటింగ్ సూపర్‌వైజర్లకు, రిటర్నింగ్ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని, అవి వారికి అందినట్లు ధ్రువీకరణలు తీసుకోవాలని చెప్పారు.
ఓట్ల లెక్కింపుపై సీనియర్ నేతల సమీక్ష
పోలింగ్ ముగిశాక ఈవీఎంలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీ, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూశాక రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు జరగబోతున్నాయన్న అనుమానాలు ప్రజల్లో రోజురోజుకూ బాగా బలపడుతున్నాయి. టీడీపీ పన్నాగాలను పసిగట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల నాయకులు, కీలక స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన సూచనలు జారీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా నేతలు, అభ్యర్థులతో మాట్లాడారు. టీడీపీ కుట్రల పట్ల జాగరూకత వహించాలని ఉద్బోధించారు. పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కంతేటి సత్యనారాయణరాజు, నార్నె శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకుని, ఓట్ల లెక్కింపుపై సమీక్షించారు. విజయసాయిరెడ్డి పలు కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
వైఎస్సార్‌సీపీలో విజయోత్సాహం
Published Thu, May 23 2019 5:01 AM | Last Updated on Thu, May 23 2019 5:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment