సాక్షి/అమరావతి: రాష్ట్రంలో కరోనా కంటే చంద్రబాబే అతి పెద్ద వైరస్ అని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన కులాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కుప్పకూలుస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
బాబు కుట్రను నిమ్మగడ్డ అమలు చేశారు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికల్ని వాయిదా వేశారని జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. ఈ విషయంలో కనీసం వైద్య, ఆరోగ్య శాఖను కూడా సంప్రదించలేదని తప్పుపట్టారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను సంప్రదించకుండా ఎన్నికల్ని ఎలా వాయిదా వేస్తారు.
- హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను సంప్రదించకుండానే ఎలా నిర్ణయం తీసుకుంటారు.
- ఫ్రాన్స్‌లో 5,500 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదై.. 127 మంది చనిపోయినా అక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించారు.
- విచక్షణాధికారం ఉందని, విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం కమిషనర్‌కు ఎక్కడిది?
రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీయడం ఏమిటి
వ్యవస్థలను ఖూనీ చేస్తున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను అడ్డుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ఎన్నికలు వాయిదా వేయించిన చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే..
- బంధుత్వం ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలే గానీ రాష్ట్రాభివృద్ధిని దెబ్బతీయడం దుర్మార్గం.
- నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చంద్రబాబు తొత్తులా వ్యవహరించారు.
వాళ్లకి ముందే ఎలా తెలిసింది?
స్థానిక ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ ప్రకటించక ముందే పచ్చ మీడియా అయిన టీవీ 5, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ కార్యకర్తలకు ముందుగానే ఎలా తెలిసిందని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషనర్ టీవీ 5కు ముందుగానే చెప్పారా? అని నిలదీశారు. ఆయన ఏమన్నారంటే..
- కరోనా గురించి తనకే తెలుసని.. ప్రజా సంక్షేమం కాంక్షించే వ్యక్తిని తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను ఊరేగింపులతో ఎలా వేయించారు?
- ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదిస్తారా.. బెదిరిస్తారా అంటున్న చంద్రబాబు తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని ఉద్దేశించి ఎలా ఆరోపణలు చేశారు?
వ్యవస్థల్ని మేనేజ్ చేయడమే చంద్రబాబు నైజం
అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు నైజమని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. ఆయన
ఏమన్నారంటే..
- 40 ఏళ్ల క్రితం పుట్టిన చంద్రబాబు వైరస్ ఇది. ఈ వైరస్ మొదట్లో ఎన్టీఆర్‌ను ఈ లోకం నుంచే పంపించేసింది.
- బాబు వైరస్ సోకిన వ్యక్తులు న్యాయ, పాలనా వ్యవస్థల్లోనూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
- ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment