
సాక్షి, ఇచ్చాపురం: ‘నిన్నటి దినం ప్రజాసంకల్ప యాత్ర.. రేపు వైఎస్ జగన్ పట్టాభిషేక యాత్ర. ఈ ప్రజాసంకల్పయాత్ర ఇంత పెద్దఎత్తున విజయవంతం కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దివంగత నేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ అభిమానీ ఆశీస్సులే..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై, టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
‘పేద రైతు కుటుంబానికి చెందిన నాలాంటి వాడిని ఎమ్మెల్యే చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది. అయితే.. సంతలో పశువులను కొన్నట్టు 23 మంది ఎమ్మెల్యేలను కొన్న నీచ చరిత్ర చంద్రబాబుది. మరోసారి గెలవడానికి చంద్రబాబు తన అక్రమ సంపాదనతో ఓట్లను కొనడానికి ప్రయత్నిస్తాడు. కానీ జగన్ సునామీలో చంద్రబాబు అక్రమ సంపాదన కొట్టుకపోవడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను గెలిపించడానికి మా ధన మాన ప్రాణాలను లెక్క చేయం. అక్రమ సంపాదనతో చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తల సహాయంతో నేలమట్టం చేద్దాం’అంటూ రాచమల్లు ఉద్ఘాటించారు.