ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి. చిత్రంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యత్వాలకు ఏప్రిల్ 6వ తేదీన తాము సమర్పించిన రాజీనామాలను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే ఆమోదించాలని వైఎస్సార్ సీపీ లోక్‌సభ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మరోసారి విజ్ఞప్తి చేశారు. సభాపతి పిలుపు మేరకు ఢిల్లీ చేరుకున్న ఎంపీలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సభాపతి కోరినా ఎంపీలు ససేమిరా అన్నారు. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి స్పీకర్‌తో భేటీ అయినవారిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా వారి వెంట వచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు స్పీకర్‌ను కలిసేముందు, ఆ తరువాత పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
కేంద్రం వైఖరితో విసిగిపోయాం: మేకపాటి
‘ఎవరైనా రాజీనామా చేస్తే స్పీకర్ గారు ఎగ్జామిన్ చేస్తారు. ఆమెపై ఆ బాధ్యత ఉంటుంది. కర్ణాటక వ్యవహారం వేరు. ఇది భిన్నమైన అంశం. ఐదుగురం ఒకేసారి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించాం. ఎందుకు రాజీనామా చేస్తున్నారని అడిగారు. మీ ఆందోళనలను పార్లమెంటు వేదికపై వినిపించవచ్చు కదా అన్నారు. మేం అన్ని ప్రయత్నాలూ చేశామని, కేంద్రం వైఖరితో విసిగి వేసారి పోయామని చెప్పాం. పార్లమెంటులో చేసిన వాగ్దానాలు అమలుకాకపోతే ఎలా? అని అడిగాం. తక్షణం రాజీనామాలు ఆమోదించాలని కోరాం. మూడు నాలుగు రోజుల్లోగా ఆమోదించకుంటే మళ్లీ కలసి అడుగుతాం. సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కైన ప్రత్యేక హోదాను నీరుగార్చేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజలను చైతన్యపరుస్తుంటే చంద్రబాబు యువభేరి కార్యక్రమాలకు వెళ్లేవారిపై పీడీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టించారు. జగన్ పోరాటానికి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు మద్దతు పలకడంతో భయపడ్డ చంద్రబాబు రాత్రికి రాత్రి యూటర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ప్రత్యేక హోదా పాట పాడుతున్నారు’ అని మేకపాటి పేర్కొన్నారు.
ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
‘ఈరోజు స్పీకర్ ఇచ్చిన సమయం ప్రకారం ఆమెను కలిసి దాదాపు గంటసేపు మాట్లాడాం. మా రాజీనామాలు తక్షణం ఆమోదించండి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పాం. మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు తెస్తున్నారు. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని గట్టిగా కోరాం. అసెంబ్లీకి ఎన్నికైన వారు 14 రోజుల్లోపు ఇక్కడైనా రాజీనామా చేయాలి లేదా అక్కడైనా రాజీనామా చేయాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. అక్కడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పక్షంలో నిబంధనల ప్రకారం తాను రాజీనామాలను ఆమోదించాల్సిన పని లేకుండానే ఆమోదించినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని కర్ణాటక విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం ఆమె సెక్రటరీ జనరల్‌తో చర్చించారు. రాజీనామాలు ఆమోదం పొందేందుకు వీలుగా స్పీకర్ ఫార్మాట్‌లోనే సమర్పించాం. మేం చిత్తశుద్ధితో రాజీనామాలు చేశాం. రాజీనామాలు ఆమోదింప చేసుకుని ఉప ఎన్నికలకు వెళ్తాం. హోదా అనేది ఎంత బలమైన అంశమో ఉప ఎన్నికల ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియచేస్తాం’ అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
త్వరలో మళ్లీ కలుస్తాం: ఎంపీ వరప్రసాదరావు
‘ఇప్పటికే ఆలస్యమైంది. తక్షణమే రాజీనామాలు ఆమోదించాలని కోరాం. నాలుగైదు రోజుల్లో మళ్లీ కలసి రాజీనామాలు ఆమోదించాలని అడుగుతాం. అది మా హక్కు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కేంద్రం నిధులిస్తే ఇష్టం వచ్చినట్టు అవినీతికి పాల్పడవచ్చనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో గత 60 ఏళ్లలో రూ. 80 వేల కోట్లు అప్పు చేస్తే.. గత నాలుగేళ్లలోనే ఏపీపై రూ. 1.20 లక్షల కోట్ల అప్పు భారం పడింది. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు’ ’ అని వరప్రసాదరావు పేర్కొన్నారు
ఉప ఎన్నికలకు మేం సిద్ధం: ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
‘రాజీనామాలను ఎట్టిపరిస్థితుల్లోనైనా సరే ఆమోదింపజేసుకొని ఉప ఎన్నికల యుద్ధానికి వెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా పోరులో వైఎస్ జగన్ ప్రతి నిర్ణయాన్ని సవాల్‌గా స్వీకరించి అమలు చేశారు. కేంద్రంపై అవిశ్వాసం, ఎంపీలతో రాజీనామాలు చేయించడం లాంటి నిర్ణయాలను మాట తప్పకుండా నిలబెట్టుకున్నారు. చంద్రబాబు హోదా విషయంలో ఎన్ని యూటర్నులు తీసుకున్నారో యావత్తు రాష్ట్రానికి తెలుసు’ అని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు.
ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీకి బుద్ధి చెప్పాలి: ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
‘ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు తదితర ప్రధాన హామీల సాధన కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి రాజీనామాలు చేశాం. హోదా పోరులో కలసి రావాలని, అందరం కలసి ఎంపీ పదవులకు రాజీనామాలు చేద్దామని ప్రతిపక్ష నేత జగన్ ప్రజాక్షేత్రంలో పిలుపునిస్తే చంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉప ఎన్నికలు అనివార్యమయ్యే పరిస్థితి ఉన్నందున రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. భావి తరాల కోసం హోదా సాధించాలి. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ప్రజలంతా అండగా నిలవాలి’ అని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇదేనా ప్రజాస్వామ్యానికి గౌరవం?
అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి ఇప్పుడు పార్లమెంట్ సభ్యత్వాలకు రాజీనామా చేస్తున్నారు. ప్రజలకు ఏం చెబుతారు? అని కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ ‘ప్రభుత్వాల తీరు అలా ఉంది. కాబట్టే ఇలా చేస్తున్నాం. అసెంబ్లీలో 23 మంది మా పార్టీ సభ్యులను లాక్కొని అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇదేనా ప్రజాస్వామ్యానికి గౌరవం? ఇక్కడ కూడా అలాగే నలుగురిని లాక్కున్నారు. ఎందుకు పోవాలి మనం అక్కడికి? నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే మన వాదన వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇవ్వకుండా ఒంటెత్తు పోకడ పోతుంటే ప్రజలకు నమ్మకం ఉంటుందా? అందుకే రాజీనామాలు చేశాం.. ఎన్నికలు వస్తాయి. ప్రజల మనోభావం వీళ్లకు తెలుస్తుంది. కేంద్రం, రాష్ట్రం కళ్లు తెరుస్తాయి. మాకు స్వార్థ ప్రయోజనాలేమీ లేవు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించుకునే దిశగా పోరాటం చేస్తాం. ప్రజల ఆశీస్సులు కోరుతాం’ అని వైవీ పేర్కొన్నారు.
ఆ రోజుకు 14 నెలల సమయం ఉంది...
ఇప్పుడు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రావంటూ వస్తున్న వార్తలపై స్పందించాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని మీడియా కోరగా ‘మేం ఏప్రిల్ 6న రాజీనామాలు చేశాం. ఆ రోజుకు పదవీకాలానికి ఇంకా 14 నెలల సమయం ఉంది. మేం వాళ్లలాగా డ్రామాలు ఆడటం లేదు. చంద్రబాబులా యూటర్న్ తీసుకునే అలవాటు మాకు లేదు..’ అని బదులిచ్చారు. రాజీనామాలు ఆమోదం పొందకుంటే వచ్చే పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారా? అని మీడియా ప్రశ్నించగా ‘మా రాజీనామాలు తప్పకుండా ఆమోదం పొందుతాయి. సెషన్ ఉన్నా మేం వచ్చే ప్రశ్నే లేదు..’ అని వైవీ చెప్పారు.
పార్టీ ఫిరాయింపులపై ప్రస్తావన...
మీడియా అడిగిన మరో ప్రశ్నకు వైవీ బదులిస్తూ ‘వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎంపీలపై మేం ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ వద్ద మరోసారి ప్రస్తావించాం. దానికి ఆమె స్పందిస్తూ ప్రివిలేజ్ కమిటీకి పంపామని చెప్పారు. మూడేళ్లుగా ఇదే చెబుతున్నారని, రాజ్యసభలో ఇదే పరిస్థితి తలెత్తితే ఛైర్మన్ వెంకయ్య నాయుడు వెంటనే నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశాం. అలా జరిగిందా? అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సంగతి దేశం మొత్తం చూసింది. అయినా ఈ అంశంపై తదుపరి కార్యాచరణకు సెక్రటరీ జనరల్‌తో మాట్లాడుతానని స్పీకర్ హామీ ఇచ్చారు..’ అని ఎంపీ వైవీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment