మానవమాత్రులు ఇన్ని రోజులు దీక్ష చేయలేరు! | YSR Kadapa Ukku Deeksha CM amesh Fake Deeksha Story | Sakshi
Sakshi News home page

ఇన్ని రోజులు ఎలా!

Published Fri, Jun 29 2018 10:45 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSR Kadapa Ukku Deeksha CM amesh Fake Deeksha Story - Sakshi

కడప కార్పొరేషన్‌: మానవమాత్రులు ఇన్ని రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేయలేరని, బీపీ, షుగర్‌ ఉన్నవారు ఒక్కరోజు కూడా దీక్ష చేయడం కష్టమని, ఇది ఎలా సాధ్యమని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. గురువారం కడపలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కమలాపురం, కడప ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్‌కి దేవుడు అతీంద్రియ శక్తులు ఇచ్చాడో, చంద్రబాబు శక్తి ఇచ్చాడో తెలియదుగానీ ఇన్ని రోజులు దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. భారతదేశంలో పొట్టి శ్రీరాములు తర్వాత అత్యధిక రోజులు చేసిన దీక్ష ఇదేనన్నారు. సీఎం రమేష్‌ దీక్షపై వైద్యులు ప్రతిరోజూ హెల్త్‌ బులెటిన్‌ ఎందుకు విడుదల చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ రోజులు దీక్ష చేస్తే కీటోన్స్‌ పెరిగిపోయి కిడ్నీలపై ప్రభావం చూపి ప్రాణాలకే ప్రమాదమని, కానీ సీఎం రమేష్‌ మాత్రం ఎంతో చలాకీగా, నిత్య పెళ్లికొడుకులా చెవిలో హియర్‌ ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్నాడని ఎద్దేవా చేశారు.

అధికారాన్ని దుర్వినియోగం చేసి సంఘీభావం పేరుతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నుంచి అ«ధికారులను, డ్వాక్రాసంఘాల సభ్యులను, ఆశా వర్కర్లను, డిగ్రీ కాలేజీ లెక్చరర్లను తరలించడం అత్యంత దారుణమన్నారు. అదేమైనా ప్రభుత్వ కార్యక్రమమా...ప్రభుత్వ శాఖల అధికారులను అక్కడికి ఎందుకు పంపుతున్నారు, కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సీఎంరమేష్‌ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీవారు. నాలుగేళ్లుగా పోలవరం, అమరావతి పేరుతో లక్షల కోట్లు దండుకొని ఇప్పుడు తగుదునమ్మా అని దీక్ష చేయడం హాస్యాస్పదమన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం తమ ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అందుకు సిద్ధమవుతారేమో చెప్పాలని సవాల్‌ విసిరారు. నాలుగేళ్లు ప్రజలను మోసం చేసిన టీడీపీ ప్రజలకు క్షమాపణ చెప్పి పోరాటం చేయాలని సూచించారు.

అధికారులు విధులు మరిచి ప్రవర్తించవద్దు: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విధులు మరిచి ప్రవర్తించవద్దని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి హితవు పలికారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదని, వన్‌సైడ్‌గా వ్యవహరించిన అధికారులు జవాబు చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని హెచ్చరించారు. బాబు కనుసన్నల్లో సీఎం రమేష్‌ దీక్ష కొనసాగుతోందని, అధికారులను ఆఫీసుల్లో పనిచేయకుండా వారి చుట్టూ తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో డ్వాక్రా మహిళలను తరలించేవారని, ఇప్పుడు ఆ పరిధి దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగులను తరలిస్తున్నారన్నారు. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ వైఖరి ఎలా ఉందో ప్రజలకు బాగా తెలుసని, సీఎం రమేష్‌ చేస్తున్నది నయవంచన దీక్ష అని విమర్శించారు.

షుగర్, బీపీ లేనివారే ఏడు రోజులు దీక్ష చేయడం కష్టమని, 250 షుగర్‌ ఉన్న సీఎం రమేష్‌ 9 రోజులు దీక్ష చేయడం  ఆశ్చర్యకరమన్నారు. ఆయన వాడే నీళ్ల బాటిల్‌ రూ.3వేలట, ప్రతి అరగంటకొకసారి లోపలికి పోయి వస్తుంటారట, ఇదేమి దీక్ష అని ఎద్దేవా చేశారు. మనిషికి రూ.500నోటు, మద్యం, బిర్యానీ ఇచ్చి దీక్షకు పిలిపించుకోవడాన్ని ఎవరూ హర్షించరని చెప్పారు. అది కార్పొరేట్‌ దీక్ష అని, ప్రభుత్వ ధనాన్ని కూడా దీనికి ఖర్చుపెట్టడం దారుణమన్నారు. ప్రతిరోజూ దీక్షకు ఎంత ఖర్చు చేస్తున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆరేళ్లలో ఒక్కసారైనా నోరు విప్పారా: ఎమ్మెల్యే అంజద్‌బాషా
ఆరేళ్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్న సీఎం రమేష్‌ ఏనాడైనా ఉక్కు పరిశ్రమ గూరించిగానీ, ఈ ప్రాంత అభివృద్ధి గూర్చి నోరు విప్పారా అని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ప్రశ్నించారు. సీఎంకి సన్నిహితంగా ఉంటూ, ఆయనతోపాటు స్పెషల్‌ ఫ్‌లైట్లలో తిరుగుతూ జిల్లాకు ఒక్క పరిశ్రమ తెచ్చేందుకు కృషి చేశారా అని నిలదీశారు. నాలుగేళ్లేపాటు తాము అఖిలపక్షంతో కలిసి ప్రత్యేకహోదా, విభజన హామీలపై పోరాటం చేస్తుంటే అరెస్టులు చేసి, అక్రమ కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. చివరకు ప్రధాని దిష్టిబొమ్మ కాల్చేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని గుర్తుచేశారు. రాష్ట్రానికి బీజేపీ ఎంత అన్యాయం చేసిందో, టీడీపీ అంతకు రెట్టింపు చేసిందన్నారు.

29 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం అసెంబ్లీ సీట్ల పెంపు, పోలవరం కాంట్రాక్టుల గూర్చే మాట్లాడారే తప్పా ప్రత్యేక హోదా, విభజన హామీల గూర్చి మాట్లాడలేదని దుయ్యబట్టారు. 55 ఏళ్ల వయసులో దీక్ష చేస్తున్న సీఎం రమేష్‌ 250కిపైగా షుగర్‌ లెవెల్స్‌ ఉండి 11 రోజులు దీక్ష చేస్తానని చెప్పడం వింతగా ఉందన్నారు. తనకు షుగర్‌ అటాక్‌ కానప్పుడు 43ఏళ్ల వయసులో ఆరు రోజులు దీక్ష చేస్తేనే కీటోన్స్‌ పెరిగిపోయి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, సీఎం రమేష్‌ మాత్రం అదేదో సిన్మా తీస్తున్నట్లు ప్రీ ప్లాన్డ్‌గా చెప్పేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. శక్తినిచ్చే ఫ్లూయిడ్స్‌ తీసుకుంటే తప్పా ఇన్ని రోజులు దీక్ష చేయలేరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, మాజీ అధ్యక్షుడు బి.నిత్యానందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ఎం.రాజగోపాల్‌రెడ్డి, షఫీ, ఖదీర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement