
అమరావతి: ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన చెవిరెడ్డి, చంద్రగిరిలో ఓట్లను తొలగించేందుకు అనుసరిస్తున్న కుట్రలను వివరించారు. ఓటర్ల తొలగింపు ఆదేశాల టెలికాన్ఫరెన్సు ఆడియో ఆధారాలను స్వయంగా చెవిరెడ్డి అందించారు. అనంతరం చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రగిరిలో ఈ నడుమ సుమారు 22 వేల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గానికి 30 మందిని సర్వే పేరుతో పంపించారని, పోలింగ్ బూత్ నెంబర్, ఓటర్ ఐడీ కార్డు నెంబర్‌లను తీసుకుని వారు గుంటూరులో ఉన్న ఆఫీసుకు పంపుతారని చెప్పారు.
అక్కడి నుంచి ఆదేశాలు పంపి ఓట్లు తీసేయిస్తున్నారని తెలిపారు. సర్వే చేస్తోన్న 17 మందిని పోలీసులకు అప్పగించినా వారిపై కేసులు పెట్టలేదని చెప్పారు. సర్వే చేసిన వారిని పోలీసులకు అప్పగించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్నే పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెడుతున్నారని వాపోయారు. మా వాళ్లను చూపించమని అడిగిన నన్ను అరెస్ట్ చేసి తమిళనాడులో తిప్పి తెల్లవారుజామున వదిలివేశారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఓట్లు తొలగించమని చెబుతున్నట్లుగా మాట్లాడిన సెల్‌ఫోన్ రికార్డింగ్‌ను మీడియాకు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment