సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం తాము ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికే మద్దతు తెలుపుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కృష్ణాజిల్లా నందిగామ బహిరంగ సభలో (గురువారం) పాల్గొన్న ఆయన ఆ తర్వాత ఎన్డీ టీవీతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. చంద్రబాబు పాలనపై ఆగ్రహంతోనే ప్రజలు తన సభలకు అధిక సంఖ్యలో వస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనుభవం, ఆయన చేసే జిమ్మిక్కులకు తాను ఆందోళన చెందడం లేదని, దేవుడిని, ప్రజలను నమ్ముతున్నాని ఎన్డీ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఎవరిస్తే వారికే మా మద్దతు ఉంటుందని తాము తొలి నుంచి చెబుతున్నామని, మా స్టాండ్‌ను ప్రజలకు స్పష్టంగా తెలియజేశామన్నారు. తాము ఇప్పటి వరకు ఎవ్వరితో పొత్తు పెట్టుకోలేదని, ఎవరు హోదా ఇస్తే వారికే మద్దతిస్తామన్నారు.
చంద్రబాబును ఓడించడానికి టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నాడన్న ఆరోపణలను వైఎస్ జగన్ కొట్టిపారేశారు. తనకు డబ్బులు ఇస్తుంటే చంద్రబాబు చూశారా? లేక కేసీఆర్ ఫోన్ చేసి ఏమైనా చెప్పాడంటనా? అని వైఎస్ జగన్ ఎదురు ప్రశ్నించారు. ఈ విషయాన్ని చంద్రబాబునే అడగాలని అన్నారు. తనపై ఉన్న కేసుల గురించి ప్రజలందరికి తెలుసన్నారు. తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం జగన్ మంచోడు.. ఎప్పుడైతే పార్టీలో నుంచి బయటకు వచ్చాడో అప్పుడే చెడ్డోడయ్యాడని, చంద్రబాబు, కాంగ్రెస్‌లు కుమ్మక్కై తనపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రాన్ని విడగొట్టి రాహుల్ గాంధీలు ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారని, వారి ప్రభావం రాష్ట్రంలో ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో టేప్‌లతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment