
వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా విషయంలో నరేంద్ర మోదీ, చంద్రబాబులు ఏ1 ఏ2 ముద్దాయిలని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వంచనపై గర్జన దీక్షలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రత్యేక హోదా వల్లే పరిశ్రమలు వస్తాయని అన్నారు. ఏపీ విభజన చట్టం హామీల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేసిన ఉద్యమాలను చంద్రబాబు కావాలని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాకుండా ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసమే ఎంపీ పదవులకు తాము రాజీనామాలు చేస్తే, చంద్రబాబు వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసమే పదవులను వదులుకున్నామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకోదని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని వ్యాఖ్యానించారు. ఏపీలో 150 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో జగన్‌దే జయం అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివిగల మోసకారి అని, వచ్చే ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబ్బు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం వైఎస్సార్ సీపీకే వేయాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment