‘ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధికారత సాధించినపుడే వారి నిజమైన పురోగతి సాధ్యమవుతుంది. అట్టడుగున ఉన్న వర్గాల మహిళలను ఈ రంగాల్లో ప్రోత్సహించినపుడు సమాజానికి మేలు జరుగుతుంది. ‘మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలు కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం’ అని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టీకరించారు. ఈ కేవలోనే మహిళా అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు.
సాక్షి, అమరావతి: మహిళా దినోత్సవ సందేశాన్ని నిజం చేస్తూ ఆయన ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలో బలహీన, బీసీ వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఈ జాబితాలో నలుగురు లోక్‌సభ, 15 మంది శాసనసభ అభ్యర్థులున్నారు. మహిళాభివృద్ధికి పాటు పడుతున్నామని చెప్పుకొనే టీడీపీ ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభకు పోటీ చేసే అవకాశం కల్పించింది. పార్టీ స్థాపించి ఎనిమిదేళ్లే అయినా... దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకునే టీడీపీకి దీటుగా వైఎస్ జగన్ మహిళా అభ్యర్థులను.. అందులోనూ బీసీ, బలహీన వర్గాలకు చెందినవారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. తాను భవిష్యత్తులో వారి పట్ల ఎలా ఉండబోతున్నారో సంకేతాలిచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కూడా ప్రాధాన్యం కల్పించడానికి వెనుకాడబోనని ఆయన ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేశారు.
అసెంబ్లీ బరిలోని నారీమణులు
అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ మహిళా అభ్యర్థుల్లో ముగ్గురు బీసీలు, నలుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు కాపులు, ఒకరు బ్రాహ్మణ సామాజిక వర్గంవారు. కురుబ వర్గానికి చెందిన కళ్యాణదుర్గం అభ్యర్థి ఉషాచరణ్ సాధారణ మహిళ. దళిత కుటుంబానికి చెందిన పద్మావతి విద్యావంతురాలు. తాడికొండ (ఎస్సీ) అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవి మంచి డాక్టర్. జనరల్ సీటైన చిలకలూరి పేట నుంచి బరిలో ఉన్న విడదల రజని బీసీ మహిళ. ప్రత్తిపాడు (ఎస్సీ) అభ్యర్థి మేకతోటి సుచరిత రెండుసార్లు ఎమ్మెల్యే. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ) అభ్యర్థి తానేటి వనితకు రాజకీయ నేపథ్యం ఉంది. రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ సాధ్యమైనంత మేర మహిళలకే సీట్లు కేటాయించారు. పాడేరు (ఎస్టీ) అభ్యర్థి గొట్టుకుళ్ల భాగ్యలక్ష్మిది సాదాసీదా నేపథ్యమే. కురుపాంలో పాముల పుష్పశ్రీవాణి, పాలకొండలో విశ్వాసరాయి కళావతి రెండోసారి పోటీ చేస్తున్నారు. పాతపట్నం అభ్యర్థి రెడ్డి శాంతి తూర్పు కాపు. రంప చోడవరం అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గృహిణి. ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. పెద్దాపురం అభ్యర్థి తోట వాణి కాపు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత తోట నరసింహం సతీమణి.
పరిచయం అక్కర లేని రోజా
ఇక మహిళలకు జరిగే అన్యాయాలు, అణచివేతపై నిప్పులు చెరుగుతూ పోరాడే ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆర్.కె.రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కాల్‌మనీ సెక్స్ రాకెట్, రిషితేశ్వరి మరణం, ఎమ్మార్వో వనజాక్షిపై జరిగిన దౌర్జన్యాలతో సహా పలు మహిళా సమస్యలపై ఆమె గత ఐదేళ్లుగా పోరాడిన తీరు ప్రజలకు విదితమే.
టీడీపీలో అధినేతల అత్మీయులకే సీట్లు
టీడీపీ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న వారంతా సీనియర్ నేతల ఆత్మీయులే. రాజమండ్రి అభ్యర్థి మాగంటి రూప ప్రస్తుత ఎంపీ మురళీమోహన్ కోడలు. కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. రాజంపేట అభ్యర్థి డి.కె.సత్యప్రభ దివంగత పారిశ్రామికవేత్త డి.కె.ఆదికేశవులు సతీమణి, ఆమె ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే. ఇక తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా, పలుమార్లు నెల్లూరు, బాపట్ల ఎంపీగా ఉన్నారు. ఏనాడూ టీడీపీలో లేని ఈమెకు... ఢిల్లీలో ఉన్నత స్థాయిలో జరిగిన రాజకీయ ఒప్పందాల కారణంగా టిక్కెట్ వచ్చిందన్న ప్రచారం ఉంది.
అభ్యర్థులంతా..ఆర్థిక వనరులు ఉన్నవారే
టీడీపీ నుంచి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులంతా గట్టి రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నవారే. వీరిలో నలుగురు రెడ్డి సామాజికవర్గం, ఒకరు క్షత్రియ, నలుగురు ఎస్సీలు. ఇద్దరు ఎస్టీ అభ్యర్థులున్నారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అలూరులో కోట్ల సుజాతమ్మ, పుంగనూరులో అనూషారెడ్డి, పాణ్యంలో గౌరు చరిత వీరంతా రెడ్డి సామాజికవర్గం అభ్యర్థులు కావడం విశేషం. గౌతు శిరీష (పలాస), గుండా లక్ష్మీదేవి (శ్రీకాకుళం), కోళ్ల లలితకుమారి(ఎస్.కోట), పిల్లి అనంతలక్ష్మి (కాకినాడ రూరల్) వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు.
Comments
Please login to add a commentAdd a comment