సాక్షి, విశాఖపట్నం : ప్రత్యేక హోదా విషయలో తాను చేసింది తప్పు అని ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపోరాటం, దీక్షలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని చంద్రబాబు జైలులో పెట్టించడం వంచన కాదా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ప్రజలను వంచించిన బాబు దీక్ష చేయడం మరో వంచనగా అంబటి అభివర్ణించారు. నీతికి నిజాయితికి మారుపేరని, నిప్పులాంటి వాళ్లమంటూ డబ్బా కొట్టుకున్న బాబు ఇప్పుడు, నేడు ఎక్కడ జైలులో వేస్తారేమోనని భయపడిపోతున్నారని విమర్శించారు.
అన్యాయంగా అక్రమంగా ప్రజల సొమ్ము దోచుకున్నపుడు, కుట్రలు చేసినపుడు ఎంతటి వారైనా జైలుకెళ్లక తప్పదని అంబటి హెచ్చిరించారు. చంద్రబాబు లాంటి వారిని జైలులో పెడతారనేది బహిరంగ రహస్యమేనని అన్నారు. బీజేపీ, టీడీపీలు కలిసి చేసిన మోసాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్న తరుణంలో చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ తనను మోసం చేసారని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే వైఎస్ జగన్ బీజేపీ కలిసి పోతున్నారంటూ తన అనుకూల మీడియా సంస్థలతో, టీడీపీ నేతలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సోనియాగాంధీ తన మాట వినలేదని అక్రమంగా కేసులు పెట్టినా, 16 మాసాలు జైలులో ఉంచినా, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ధీరుడు వైఎస్ జగన్ అని అన్నారు. చంద్రబాబులా భయపడలేదన్నారు. ప్రజల ఆశీస్సులు వైఎస్సార్ సీపీకి ఉన్నాయని, నరేంద్ర మోదీ, చంద్ర బాబు మెడలు వంచి ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా సాధిస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎంపీలు ఐదుగురే ఉన్నా రాష్ట్రానికి హోదా సాధన కోసం తమ పదవులకు రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం తన వద్ద ఉన్న పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయించకుండా, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేస్తూ వంచన చేస్తున్నారంటూ అంబటి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment