వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లాకో మైనింగ్ డాన్‌ను తయారు చేశారని, మైనింగ్, ఎర్రచందనం, ఇసుక, మట్టి, భూ కబ్జా,కాల్‌మనీ మాఫియాలకు చంద్రబాబే డాన్ అని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి తూర్పారబట్టారు. హైకోర్టు తప్పుబట్టినా కూడా మైనింగ్ మాఫియాకు సహకరిస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని, జరుగుతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..మైనింగ్ విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్ట్‌లు చేశారని, తప్పును ఆపేందుకు ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేయించడమంటే చంద్రబాబు దొంగల పక్షాన నిలబడతారని అర్ధమవుతుందని పేర్కొన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు పండిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు సోనియా గాంధీతో కుమ్మక్కై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారు..జగన్ పరపతిని దెబ్బతీసేందుకు మళ్లీ తన విషపు కోరలను బయటకు తీసి ఆయన సతీమణి భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈడీ డిపార్టుమెంటులో ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఇద్దరు అధికారులు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను ముందే చంద్రబాబు నాయుడికి ఇచ్చారని తెలిపారు. హెరిటేజ్ డైరెక్టర్లు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు రూ.9.50 కోట్ల జీతం వస్తుందని ప్రకటించడానికి మాత్రం చంద్రబాబుకు నోరు రావడం లేదని అన్నారు.
హెరిటేజ్ ఆర్ధిక ఆదాయం పై విచారణకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. లోకేష్ అవినీతి, హెరిటేజ్ అక్రమాలపై భవిష్యత్ ప్రభుత్వాలు విచారణ చేస్తాయని చెప్పారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకమే రాశారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హయాంలో బస్సులు తగలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారని ఆరోపించారు. వంగవీటి రంగాని హత్య చేయించింది చంద్రబాబేనని..ఆనాటి హోంమంత్రి హరిరామజోగయ్య తన పుస్తకంలో రాసిన మాట వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నించారు. తుని ఘటనలో తనపై తప్పుడు కేసులు పెట్టారు..రైలు తగల బెట్టింది టీడీపీ నేతలే కాబట్టి ఒక్కరినీ అరెస్ట్ చేయలేదన్నారు. తుని విధ్వంసానికి చంద్రబాబే సూత్రధారి అందుకే రెండేళ్ల నుంచి కేసు విచారణ తేలలేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment