
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గౌతమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులను పోలీసులు జలియన్ వాలాబాగ్ తరహాలో పాశవికంగా అరెస్ట్‌లు చేశారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్న బోజన కార్మికులు చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటాన్ని దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు . 85 వేల మందిని విధుల నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. వారికి తాము అండగా ఉంటామని తెలిపారు.
అన్నం పెట్టే మహిళలను ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని అన్ని పోలీసు స్టేషన్‌లు మహిళలతో నిండిపోయాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కార్మికుల అంటే చిన్నచూపేనని అన్నారు. దుర్గగుడిలో అమ్మవారికే రక్షణ కరువయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరీటం మాయం అయిందని, తర్వాత క్షుద్రపూజలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అమ్మవారి చీర మాయంపై అదే గుడి కమిటీ సభ్యులు విచారణ జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment